భూస‌ర్వేలో దేశానికే దిక్సూచిగా నిలవాలి

అవినీతి, లంచాలకు తావులేకుండా వ్యవస్థ నడవాలి

సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు.. లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు

వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పారదర్శకంగా పరిష్కరించాలి 

రికార్డులను ఎవరూ మార్చలేని, ట్యాంపర్‌ చేయలేని విధంగా ఉండాలి

సబ్‌ డివిజన్‌ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరగాలి

వివాదాలు లేని క్లియర్‌ టైటిల్స్‌ భూ యజమానులకు అందించాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షపై సీఎం సమీక్ష

తాడేపల్లి: భూసర్వే రికార్డులు తదితర అంశాల్లో దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, లంచాలకు తావులేకుండా వ్యవస్థ నడవాలని ఆదేశించారు. వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకంపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌లను పరిశీలించారు. 

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇవి జరగాలని సూచించారు. ఇందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎస్‌ఓపీలను తయారు చేయాలన్నారు. రికార్డులను ఎవరూ మార్చలేని విధంగా, ట్యాంపర్‌ చేయలేని విధంగా ఉండాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే కాకుండా ఫిజికల్‌ రికార్డులు కూడా తయారు చేయాలని, ఫిజికల్‌ డాక్యుమెంట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. 

సబ్‌ డివిజన్‌ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరగేలా చూడాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, లంచాలకు తావులేకుండా వ్యవస్థ నడవాలని సూచించారు. సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలన్నారు. లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవుతాయని సీఎం వివరించారు.  భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చే నాటికి వివాదాలు లేకుండా చూడాలని,  ఈ ప్రక్రియలో న్యాయ శాఖను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. దీనిపై రోడ్‌ మ్యాప్‌ను కూడా తయారు చేయాలని సూచించారు. భూసర్వే రికార్డులు తదితర అంశాల్లో దేశానికే ఒక దిక్సూచిగా రాష్ట్రం నిలవాలని, సీనియర్‌ అధికారులు, సీనియర్‌ మంత్రులను ఇందులో భాగస్వామ్యులుగా చేశామని చెప్పారు. 

ఈ స‌మీక్షా స‌మావేశానికి డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్ జి. సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top