అంగన్‌వాడీల్లోనూ ‘నాడు–నేడు’ అభివృద్ధి పనులు

అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశం

స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ‘నాడు–నేడు’ కార్యక్రమాలు చేపట్టాలని  సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీ రాజ్‌ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, దిశ ప్రత్యేక అధికారిణి కృతికాశుక్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లోనూ ‘నాడు–నేడు’ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలన్నారు. అంగన్‌వాడీల్లో ఫర్నిచర్, ఫ్యాన్లు, లైట్లు, పరిశుభ్రమైన తాగునీరు సహా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సుమారు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా 31 వేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు కూడా అంచనాలను రూపొందించాలని సూచించారు. పిల్లలు, తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం నాణ్యంగా ఉండాలని, పౌష్టికాహారంలో నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 

Back to Top