72 గంటల్లోగా సమస్య పరిష్కరించాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో హెల్ప్‌లైన్‌ నంబర్‌

వలంటీర్ల వ్యవస్థపై మానిటరింగ్‌ చాలా ముఖ్యం

రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి

గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు ఒకే నమూనాలో ఉండాలి

డిసెంబర్‌ నుంచి కొత్త పెన్షన్లు అందించాలి

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: ప్రజల సమస్యలు 72 గంటల్లో పరిష్కరించే విధంగా గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సచివాలయానికి ప్రత్యేకంగా ఒక నంబర్‌ ఉండాలన్నారు. 72 గంటల్లోగా సమస్యను తీర్చడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్‌ కూడా ఉండాలన్నారు. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి గ్రామ సచివాలయం నుంచి సంబంధిత శాఖాధిపతిని అప్రమత్తం చేసేలా వ్యవస్థ ఉండాలని సూచించారు.  

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన పనుల విషయంలో ప్రజలకు పూర్తి సహాయకారిగా తోడ్పాటు అందించేలా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థలపై మానిటరింగ్‌ చాలా ముఖ్యమైందని, వలంటీర్ల వ్యవస్థల కోసం మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 

ఇళ్ల స్థలాలపై వలంటీర్ల సర్వే పూర్తయిందని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరగాలని, లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు ఇకే నమూనాలో ఉండేలా చూడాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో రైతులకు వర్క్‌షాపు నిర్వహించడానికి ఏర్పాట్లు ఉండాలన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒక షాపు కూడా ఉండాలని ఆదేశించారు. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై సచివాలయాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 

ప్రభుత్వ పథకం ఏదైనా కూడా సాంకేతిక కారణాలతో నిరాకరించరాదని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. పారదర్శక పద్ధతితో పథకాన్ని లబ్ధిదారులకు అందించడానికే సాంకేతిక పద్ధతులని, వేలిముద్రలు సరిగ్గా పడకపోతే వీడియో స్క్రీనింగ్‌ ద్వారా వెంటనే పథకాన్ని అందించాలన్నారు. డిసెంబర్‌లో కొత్త పెన్షన్లు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top