పొగాకు పంట సాగు, కొనుగోళ్లపై సీఎం సమీక్ష

తాడేపల్లి: పొగాకు రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఏపీ మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. ఇందుకోసమని  2–3 రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసేందుకు సీఎం నిర్ణయించారు. ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో సంస్థ పనిచేసేలా.. పొగాకు కనీస ధరలను ప్రభుత్వం ప్రకటించనుంది. 

కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే వేలంపాట జరగాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీలపై వేటువేయాలని అధికారులను ఆదేశించారు. లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు వేలంలో తప్పనిసరిగా పాల్గొనాలని, వేలం జరిగే అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో పాల్గొనాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరపాలని, లేదంటే వారి లైసెన్స్‌ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 

Back to Top