మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం

రుయా ఆస్పత్రి ఘటన తీవ్రంగా కలిచివేసింది

ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం

ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్‌ అధికారులకు బాధ్యతలు

పేదలకు రూ.87 వేల కోట్లు ఇచ్చిన మేము రూ.1600 కోట్లు వ్యాక్సిన్‌కు ఇవ్వలేమా..?

ప్రభుత్వంపై కావాలనే కొంద‌రు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఇప్పటి వరకు కేంద్రం 73 లక్షల డోసులు మాత్రమే ఇచ్చింది

‘స్పందన’పై సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన సంఘటన తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ట్యాంకర్‌ సమయానికి రాకపోవడంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి.. 11 మంది చనిపోయినట్టు అధికారులు చెప్పారన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం వైయస్‌ జగన్‌.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పరిహారం నగదును మృతుల కుటుంబ సభ్యులకు వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్‌ విషయంలో కలెక్టర్లందరూ అప్రమత్తతో వ్యవహరించాలని, ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 

‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం ఏం మాట్లాడారంటే.. 

''నిన్న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఆరు ట్యాంకర్లను ఒడిశాకు పంపించాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌లిఫ్ట్‌ చేశాం. అక్కడ ఆక్సిజన్‌ ట్యాంకర్లను నింపి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నాం. విదేశాల్లో కూడా ఆక్సిజన్‌ కొనుగోలు చేసి షిప్స్‌ ద్వారా తెప్పిస్తున్నాం. ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. 

వ్యాక్సిన్లు పరిస్థితి ఏంటో రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకొని కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. నెలకు రూ.7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. 6 కోట్ల డోసులు సీరం ఉత్పత్తి చేస్తుంటే.. భారత్‌ బయోటెక్‌ కోటి డోసులు ఉత్పత్తి చేస్తోంది. భారత్‌ బయోటెక్‌ సాక్షాత్తు చంద్రబాబు బంధువు, రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే 7 కోట్ల డోసులు అవసరం. కానీ ఇప్పటి వరకు కేంద్రం 73 లక్షల డోసులు మాత్రమే ఇచ్చింది. డబ్బులు తీసుకొని సప్లయ్‌ చేయండని కోరినా కంపెనీలు ఇవ్వడం లేదు. 

వ్యాక్సిన్ల పంపిణీ కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంది. ఈ మేరకు కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్ధారిస్తామని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఇచ్చారు. రూ.1600 కోట్లు ఇవ్వలేరా..? అని ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. 22 నెలల పాలనలో పేదలకు రూ.87 వేల కోట్లు ఇచ్చిన మేము రూ.1600 కోట్లు వ్యాక్సిన్‌కు ఇవ్వలేమా..? ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top