ఇసుక మాఫియా కనిపించకూడదు

ఇసుక రవాణా బాధ్యత జేసీ స్థాయి అధికారికి అప్పగించాలి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం 

‘స్పందన’ కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘వరదలు తగ్గాయి. ఇసుక లభ్యత ఉంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఓపెన్‌ చేయండి. ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలి. కిలోమీటర్‌కు రూ. 4.90 చొప్పున ఎవరు ముందుకొచ్చినా ఇసుక రవాణా కోసం వారి వాహనాలను వాడుకోవాలి. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. ఇసుక రవాణాలో రాజకీయ జోక్యం ఎక్కడా ఉండకూడదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా చేయకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి. ఇసుక రవాణాపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలి’ అని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. 
ఖాళీ అయిన చోట వలంటీర్లను నియమించండి
రేపు గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్‌ 1వ తేదీ వరకు గ్రామ సచివాలయాలు పూర్తిగా పనిచేయాలి. నవంబర్‌ నాటికి గ్రామ సచివాలయాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి. జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు పౌరులకు అందాలి. జనవరి 1 నుంచి అర్హులందరికీ కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు అందించాలని సీఎం సూచించారు. అదే విధంగా వలంటీర్లకు సచివాలయ ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చని, ఖాళీ అయిన చోట వలంటీర్లను నియమించాలని, ఈ ప్రక్రియను అక్టోబర్‌ 15వ తేదీ లోపు పూర్తిచేయాలని సూచించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top