ఎంఎస్‌పీ కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు

పంటలకు కనీస మద్దతు ధరలను ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలి

ఆర్‌బీకేల పరిధిలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు 

కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై సీఎం సమీక్ష

తాడేపల్లి: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు జరగకూడదని, ఆ మేరకు గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు, మార్కెట్‌ గోడౌన్ల నిర్మాణంపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి వ్యవసా యశాఖ మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు జరగకూడదు. ఆ మేరకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధర ఉందని అలర్ట్‌ వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. పంటలకు కనీస మద్దతు ధరలను ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలి. రైతులందరికీ తెలిసేలా పెద్ద పెద్ద పోస్టర్లను ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలి. రైతుల నుంచి చేసిన కొనుగోళ్లకు 10 రోజుల్లోగా పేమెంట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. 

రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు. మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లపై వెంటనే కార్యాచరణ రూపొందించాలి. ఇందుకు సుమారు రూ.9,093 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. గ్రామాల్లో గోడౌన్లు, ప్రిప్రాసెసింగ్‌ యూనిట్లు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు కావాలి. రైతులకు పేమెంట్ల చెల్లింపు సక్రమంగా ఉండేలా పటిష్ట విధానం ఉండాలి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.  
 

Back to Top