తాడేపల్లి: కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలని, ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో పరికరాల నుంచి ఏసీల వరకూ అన్నీ సక్రమంగా పనిచేయాలని, శానిటేషన్, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులపై సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కింద కొత్తగా తీసుకువస్తున్న 16 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులుపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, వైయస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలు, అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. వైద్య, ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద రూ.17,300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. 16 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకువస్తున్నాం.. వీటికి జనవరిలోగా టెండర్లు పూర్తి చేయాలన్నారు. ‘పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు నవంబర్‌లోగా టెండర్లు పూర్తి చేయాలి.. అనకాపల్లి, మదనపల్లె, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి డిసెంబర్‌లో టెండర్లు. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆధోని మెడికల్ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు పూర్తిచేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని, అదే విధంగా ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లో ‘నాడు–నేడు’ పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. వీటికి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. హెల్త్ క్లినిక్స్ వచ్చే వరకు ఆరోగ్యశ్రీ రిఫరల్ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్ లేదా ఏఎన్‌ఎంల ద్వారా రిఫరల్ చేయించాలన్నారు. నవంబర్ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు. అవసరం అనుకుంటే మరిన్ని వైద్య ప్రక్రియలను జాబితాలో చేర్చేందుకు పరిశీలన చేయాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.