తాడేపల్లి: అంగన్‌వాడీల కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల్లో `నాడు-నేడు`, వైయస్ఆర్ సంపూర్ణ పోషణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. గర్భవతులు, బాలింతలు, 36 నెలలలోపు శిశువుల కార్యకలాపాలు ఒకేలా చూడాలని, 36 నెలల నుంచి 72 నెలల వరకు పిల్లలను మరో విధంగా చూడాల్సి ఉంటుందని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2లపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. `స్కూళ్లలోనే వీరికి బోధన ఉంటే బాగుంటుందనేది ఆలోచన. దీనిపై సమగ్రంగా ఆలోచన చేసి ప్రణాళిక రూపొందించాలి` అని అధికారులను సీఎం ఆదేశించారు. పీపీ-1, పీపీ-2 సిలబస్‌పైనా పరిశీలన చేయాలని సూచించారు. అంగన్‌వాడీ పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ, ప్రత్యేక పుస్తకాలు ఏర్పాటు చేయాలన్నారు. అంగన్‌వాడీల్లో ఆహారం ఎక్కడ తిన్నా ఒకే క్వాలిటీ ఉండాలని ఆదేశించారు. డెలివరీ కాగానే మహిళలకు ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు ఇవ్వాలన్న ఆదేశించారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై బలమైన పర్యవేక్షణ ఉండాలని, అంగన్‌వాడీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు.