తాడేపల్లి: జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి.. ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యసురక్షపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్ ని సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలన్నారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలన్నారు. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నామన్నారు. అలా జల్లెడ పట్టిన ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి... ఆ గ్రామంలో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరించాలన్నారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి ట్రీట్ మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో సూచిస్తారని చెప్పారు. ఒకవైపు తనిఖీలు చేస్తూనే.. మందులు కూడా ఇవ్వాలన్నారు ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 30 న కార్యక్రమం ప్రారంభమవుతుంది. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..: ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే సీఎంఓ, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి సుదీర్ఘంగా కలెక్టర్లుతో చర్చించి, ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎలా చేపట్టాలన్న దానిపై... మరింత స్పష్టత ఇస్తున్నాను. జగనన్న సురక్ష తరహాలోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుంటాం. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. సురక్షలో ఏ రకంగా సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికేట్లు నెల రోజుల వ్యవధిలో అందించామో... అదే తరహాలో ఇక్కడ చేపట్టాల్సిన అవసరం ఉంది. వారికి ప్రతి పథకంలోనూ లబ్ధి జరిగిస్తూ, అవసరమైన సర్టిఫికేట్స్ ఇప్పిస్తూ.. ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ ఊరులోనే ఉందని భరోసా ఇవ్వగలిగామో... అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. మనం చేసే ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో జల్లెడ పట్టి.. ఒక పర్టిక్యులర్ రోజునాడు ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇస్తూ...అదనపు బాధ్యత కూడా తీసుకున్నాం. జల్లెడ పట్టిన గ్రామాన్ని ఫ్యామిలీ డాక్టర్ పూర్తిగా బాధ్యత తీసుకుని ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి... ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. విలేజ్ క్లినిక్‌ల ద్వారా ఆ గ్రామాన్ని ఆరోగ్యపరంగా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి... ఏ రకమైన మందులు కావాలి, ఎలాంటి ట్రీట్ మెంట్ జరగాలి అన్న దానిపై చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. ఆ గ్రామంలో ఒక ఇంట్లో ఎవరికైనా డయాలసిస్ జరుగుతున్నా.. ఇంకేదైనా మందులు అవసరమైన, పెరాలసిస్, మరేదైనా సమస్య ఉంటే వారికి రెగ్యులర్ మెడిసిన్ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి... తదుపరి చికిత్స అందించే కార్యక్రమం కూడా జరగాలి. ఈ రెండు బాధ్యతలను మనం తీసుకుంటున్నాం. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే... మందులు కూడా ఇవ్వబోతున్నాం. మందులు లేని పరిస్థితి కూడా ఉండకూడదు. దీనికి సంబంధించిన బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్ కావాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను ప్రత్యేకంగా మరింత లక్ష్యంగా చేసుకుని వారికి పీరియాడికల్‌గా పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తూ... వారిని చేయిపట్టుకుని నడిపించాలి. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలుతోపాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. ఈ కార్యక్రమం ద్వారా జీరో ఎనిమిక్ కేసులే లక్ష్యంగా పనిచేయాలి. వాళ్లను కూడా గుర్తించి మందులుతో పాటు పుడ్ సప్లిమెంటేషన్ కూడా చేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ అండ్ ఇన్‌ఫాంట్ కేర్ కేసులను కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు, బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి. ఒకవైపు సరైన సమయంలో వీటికి చికిత్స అందిస్తూనే.. జీవనవిధానాల్లో జరగాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా గ్రామాల్లో అవగాహన కలిగించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. ఈ వివరాలతో ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్ చేయాలి. 45 రోజుల పీరియడ్‌తో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి. ప్రతి మండలంలో కనీసం నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి. ఆ తర్వాత కూడా ఈ క్యాంపులు జరగాలి. దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుంది. ఈ కార్యక్రమం ఐదు దశలలో జరుగుతుంది. సెప్టెంబరు 30 న హెల్త్ క్యాంపు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు... అంటే సెప్టెంబరు 15 నుంచి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని జల్లెడ పట్టే కార్యక్రమం ప్రారంభమవుతంది. తొలిదశలో వలంటీర్లు, గృహసారధులతో పాటు ప్రజాప్రతినిధులు ఈ ముగ్గురూ వెళ్లి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఆరోగ్య సురక్షా కార్యక్రమం జరగబోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరిస్తారు. ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కలిగిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఎంప్యానెల్ అయిన ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి ? ఎలా వెళ్లాలి ? ఉచితంగా వైద్యం అందుకోవాలంటే ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కలిగించే కార్యక్రమం జరుగుతుంది. తొలిదశలో వాలంటీర్లు, గృహసారధులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లిన తర్వాత దశలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మీ ఏరియా వాలంటీర్లు వస్తారని చెప్పాలి. గ్రామాన్ని రెండు భాగాలుగా విభజిస్తే... ఒక భాగంలో ఒక ఏఎన్‌ఎం, ఆశావర్కర్, వాలంటీర్‌తో కూడిన ఒక టీం వస్తుంది. ప్రతి ఇంట్లోనూ మీ అందరితో మాట్లాడి... 7 రకాల టెస్టులకు సంబంధించిన విషయాలను మీతో చర్చిస్తారని ప్రజలకు వివరిస్తారు. రెండో టీంలో సీహెచ్‌ఓ నేతృత్వంలో ఆశావర్కర్, వాలంటీర్ వస్తారు. ఇక్కడితో రెండో దశ పూర్తవుతుంది. ఇంటిలోనే 7 రకాల టెస్టులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ... బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్ టెస్టుతో పాటు స్పూటమ్ (కఫం)టెస్ట్‌తో పాటు ఫీవర్ కేసులుంటే మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిని ప్రతి ఇంటికి వెళ్లి జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తారు. ఈ టెస్టుల రిజల్ట్ ఆధారంగా... మొబైల్ యాప్‌లో ఇలా సేకరించిన డేటాను అప్‌డేట్ చేస్తారు.ఆ తర్వాత ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ కూడా జనరేట్ అవుతుంది. ఈడేటా హెల్త్ క్యాంపు జరిగేనాటికి ఉపయోగపడుతుంది. ఫేజ్ –3లో మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. అంటే హెల్త్ క్యాంప్ జరగబోయే 3 రోజుల ముందు వాలంటీర్, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు ఆ గ్రామంలో మరోసారి గుర్తు చేస్తారు. అందుబాటులో ఉండాలని చెప్తారు. ఫేజ్ 4లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ఇది ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్ క్యాంపు ఉంటుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. పట్టణాల్లో అర్భన్ హెల్త్ క్లినిక్స్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని హెల్త్ క్యాంపు నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీల నుంచి పాల్గొంటారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. వీటి నుంచి ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. వీరిలో ఒకరు గైనిక్ లేదా పీడియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ అందుబాటులో ఉండేటట్టు తగిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కంటిపరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి. ఆయ గ్రామాల్లో... స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా ఎంపీడీఓ, ఎమ్మార్వోలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణా బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. హెల్త్ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇవి కాకుండా ఐదో దశలో ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత.... హేండ్ హోల్డింగ్‌గా ఉండాలి. ఒక్కసారి పేషెంట్లను గుర్తించిన తర్వాత.. వారికి సంబంధించి పీరియాడికల్ టెస్టింగ్, కన్సల్టేషన్, పీరియాడికల్‌గా మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాట వినిపించకూడదు. ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్కుల ద్వారా బాధ్యత తీసుకోవాలి. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఏఎన్‌ఎం, వాలంటీర్లు, ఆశావర్కర్లు, సీహెచ్‌ఓ బ్రోచర్లు తీసుకుని వెళ్లినప్పుడు ఆరోగ్యశ్రీపైన కూడా అవగాహన కలిగించాలి. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేయడం ఎలా అన్న అంశాలతోపాటు... ఎలా వినియోగించుకోవాలన్న దానిపై కూడా అవగాహన కలిగించాలి. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం అన్నది ప్రభుత్వం యొక్క ప్రత్యేక కార్యక్రమం ఉద్దేశ్యం. ఆరోగ్య సేవలను ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలిగించాలి. ఆరోగ్యశ్రీ సేవలను పొందడం, జీరో ఎనిమిక్ కేసులు ఈ రెండు అంశాలు ప్రధానమైనవి. రూ.1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ అందాలి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి ?. ఎలా వెళ్లాలి ? అన్న అంశాలపై అవగాహన కలిగించాలి. ఈ కార్యక్రమంలో ఇవి చాలా ప్రధానమైన అంశాలు. నాకు గట్టి నమ్మకం ఉంది.. జగనన్న సురక్షా కార్యక్రమం తరహాలో.. ఆరోగ్య సురక్షా కార్యక్రమం కూడా మీ చేతుల మీదుగా విజయవంతం అవుతుంది. ప్రతి ఇంటిని ఆరోగ్యపరంగా ప్రజలను సురక్షంగా ఉంచే కార్యక్రమమే ఆరోగ్య సురక్షా కార్యక్రమం. ఎవరికి ఇందులో ఎలాంటి అనుమానాలున్నా.... సీఎంఓతో నివృత్తి చేసుకొండి. సెప్టెంబరు 15న కార్యక్రమం ప్రారంభమై... 30వ తేదీ నాటికి తొలి హెల్త్ క్యాంప్ మొదలవుతుంది. మనం ఈ నాలుగేళ్లలో కేవలం వైద్యఆరోగ్యశాఖలో 53,126 పోస్టులు భర్తీ చేశాం. అన్ని ఆసుపత్రులను జాతీయ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసాం. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలు మొదలుకుని ఆరోగ్యసురక్ష కార్యక్రమం జరగబోతుంది. సీహెచ్‌సీలు నుంచి ఏరియా ఆసుపత్రులు, డిస్ట్రిక్ట్ ఆసుపత్రులు మొదలుకుని టీచింగ్ ఆసుపత్రుల వరకు నాడు–నేడుతో జాతీయ స్ధాయి ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసుకుంటున్నాం. వీటికి అదనంగా 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా పెంచాం. మనం రాకముందు 1,050 సేవలు అందుబాటులో ఉంటే ఇప్పుడు 3,256 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మనలక్ష్యం. ప్రతి పేషెంట్ కూడా డబ్బులు ఖర్చు కాకుండా, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా అందుబాటులోకి వైద్య సేవలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం. ఖాళీలు తక్షణ భర్తీ... వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే... మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఈ తరహా కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అని సీఎం ప్రసంగం ముగించారు.