నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు

కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి

విద్యాసంస్థల్లో ఎస్‌ఓపీలను తప్పకుండా పాటించాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

సచివాలయాల సమర్థత మరింత పెరగాలి

ప్రతి ఇంటి నిర్మాణ ప్రగతిపై ఆన్‌లైన్‌ స్టేజ్‌ అప్‌డేషన్‌ చేయాలి

వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు కొనసాగాలి

కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌

తాడేప‌ల్లి: ఇటీవల రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏరకంగా స్పందించిందీ, ఏరకమైన చర్యలు తీసుకుందీ మీకు అందరికీ తెలుసు అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు చేయాల్సిందంతా చేస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. వారి స్వప్రయోజనాలకోసం చేయకూడనివి చేస్తున్నారు. రాజకీయాలకోసం ఆడ పిల్లలు, వారి కుటుంబాల గౌరవాలను కూడా మంటగలుపుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. స్వప్రయోజనాల కోసం ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారంతో కూడా పోరాటం చేస్తున్నామ‌ని తెలిపారు . 

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం సీఎం వైయ‌స్ జగన్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్‌ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

 
 కరోనాపై నిర్వహించిన సమీక్షలో..
 గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా మనం కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం పర్యవేక్షణ, సమీక్షచేయాలి. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ మనం అప్రమత్తంగానే ఉండాలి.

కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి

కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలి. పెళ్లిళ్లలో 150కి మించి ఉండకుండా చూడాలి. విద్యాసంస్థల్లో ఎస్‌ఓపీలను తప్పకుండా పాటించాలి. ఫోకస్‌గా టెస్టింగ్‌ చేయాలి. ఇంటింటికీ సర్వేలు కొనసాగాలి. ఎవరికి లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయాలి. ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని టీచర్ చెప్తే... మార్గదర్శకాల ప్రకారం అక్కడ పరీక్షలు చేయాలి. విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా వెంటనే పరీక్షలు చేయాలి. 104 టోల్‌ఫ్రీ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. నిరంతరం పర్యవేక్షణ చేయాలి. నిర్దేశించుకున్న ఎస్‌ఓపీలను పాటించాలి. ఎవరైనా ఫోన్‌చేసినప్పుడు నిర్దేశించుకున్న ప్రోటోకాల్స్‌ పాటించాలి. కోవిడ్‌ తగ్గింది కాబట్టి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు.

మ‌నం మాత్రం స‌న్న‌ద్ధంగా ఉండాలి..

‘థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో తెలియదు గానీ మనం మాత్రం సన్నద్ధంగా ఉండాలి. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలి. ఆస్పత్రులను, సిబ్బందిని సన్నద్ధంగా ఉంచుకోవాలి. నర్సులకు శిక్షణ కూడా ఇవ్వాలి. బెడ్లను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్‌సంట్రేటర్లు అందుబాటులో ఉంచుకోవాలి. 100  బెడ్లు దాటిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటివరకూ 71,03,996 మందికి డబుల్‌ డోస్, 1,18,53,028 మందికి సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్లు ఇచ్చాం.

అప్ర‌మ‌త్తంగా ఉండాలి..
85 శాతం ప్రజలకు డబుల్ డోస్‌ ఇచ్చేంతవరకూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాలి. సచివాలయాన్ని యూనిట్‌గా పెట్టుకుని ప్రతి ఇంటిలో ఉన్నవారికీ వ్యాక్సిన్లు పూర్తిచేసేలా ముందడుగు వేయండి. దీనివల్ల వ్యాక్సిన్ల వృథాను అరికట్టగలుగుతాం. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి. వర్షాకాల సమావేశాల్లో వచ్చే వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అన్నిరకాల చర్యలు తీసుకోండి. పారిశుద్ధ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి’ అని సీఎం వైయ‌స్ జగన్‌ తెలిపారు.

 గ్రామం రూపు రేఖలు పూర్తిగా మారుతాయి..
గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఎన్‌ఆర్‌జీఎస్‌ డబ్బును మన ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారు. కేంద్రం నుంచి కూడా మనకు నిధులు రావాల్సి ఉందని, 15 రోజుల్లో ఈ చెల్లింపులపై దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ పనులపై పూర్తిగా దృష్టిపెడితే గ్రామం రూపు రేఖలు పూర్తిగా మారుతాయని పేర్కొన్నారు.

చెట్లు నాటే కార్యక్రమంపై దృష్టిపెట్టండి
‘కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీ పీఓలు, సబ్‌ కలెక్టర్లు అందర్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చేయమని చెప్పాం. ఈ విషయంలో మంచి పురోగతి చూపారు. తనిఖీలు చేసేటప్పుడు ఎలాంటి ప్రోటోకాల్‌ పాటించాలో చెప్పాం. సచివాలయాల సమర్థత మరింత పెరగాలి. ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలి. వివిధ డిపార్టమెంట్ల పోస్టర్లు, వెల్ఫేర్‌క్యాలెండర్లు, బయెమోట్రిక్‌ అటెండెంటెన్స్, రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణతోపాటు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల పనితీరును కూడా పర్యవేక్షణ చేయాలి.

వారికి అవగాహన కల్పించాలి. కౌన్సెలింగ్‌ చేయాలి. గ్రీవెన్స్‌ నంబర్‌ను డిస్‌ప్లే చేస్తున్నారో, లేదో చూడాలి. అలాగే తిరస్కరించిన అర్జీలను ఏ ప్రాతిపదికిన తిరస్కరించారో చూడాలి. ఒక అర్జీని తిరస్కరించినప్పుడు ఆ అర్జీ మరోసారి వెనక్కిరావాలి. జేసీకి వెళ్లాలి, దీనిపై ఆ అధికారి పరిశీలన చేయాలి. పెన్షన్, రైస్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డు 21 రోజుల్లో దరఖాస్తుదారుని అర్హతను నిర్ధారించాలి. అర్హత సాధించిన వారికి 90 రోజుల్లోగా వాటిని శాంక్షన్‌ చేయాలి. ఏడాదికి 4 సార్లు ఇలా శాంక్షన్లు వస్తాయి’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. 

ఇంకా ఎవరైనా మిగిలిపోతే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అనేక పథకాలను అమలు చేస్తోందని సీఎం వైయ‌స్ జగన్‌ తెలిపారు. ‘ఇళ్లపట్టాలతోపాటు, నేతన్న నేస్తం, చేయూత, మత్స్య భరోసా తదితర పథకాలను అమలు చేస్తోంది. పథకాన్ని అమలు చేసినప్పుడు ఎవరైనా మిగిలిపోతే వారిని దరఖాస్తు చేసుకోమని చెప్తున్నాం. ఈ జాబితాల్లో కూడా 90 రోజుల్లోగా అర్హతలను నిర్ధారించి, అర్హులైన వారికి 6 నెలల్లోగా శాంక్షన్లు ఇవ్వాలి. దీనివల్ల ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం కలుగుతుంది. సంవత్సరానికి ఇలా 2 సార్లు శాంక్షన్లు వస్తాయి’ అని చెప్పారు. అధికారుల తనిఖీల్లో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంపైనా కూడా అధికారులు తనిఖీల్లో పర్యవేక్షణ చేయాలి. సచివాలయాల పరిధిలో పథకాల పట్ల అవగాహన కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. పథకం అమలుకు ఒకరోజు ముందు ఈ సమావేశం జరగాలి. లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు చేరిన తర్వాత వాలంటీర్‌తో కలిసి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లబ్ధిదారుని వద్దకు వెల్లి డిజిటల్‌ అకాలెడ్జ్‌తోమెంట్‌తోపాటు, భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలి.

అవ‌గాహ‌న క‌ల్పించాలి..
నెలలో చివరి శుక్రవారం, శనివారం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో ఒక్కొక్కరు, ఇద్దరు ముగ్గురు వాలంటీర్లతో కలిపి బృదంగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి  ప్రభుత్వ పథకాలను వివరించాలి. వాటిపట్ల అవగాహన కల్పించాలి. పౌరులనుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఫోన్‌నంబర్లను వారికి ఇవ్వాలి. కరపత్రాలను వారికి ఇవ్వాలి. హౌసింగ్‌ లే అవుట్లలో ప్లాట్ల మ్యాపింగ్‌ వచ్చే 10 రోజుల్లోగా పూర్తిచేయాలి.

అర్హులైన వారికి మిగిలిన ప్లాట్లను వెంటనే కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులుగా గుర్తించిన వారికీ ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. పెండింగులో ఉన్న సుమారు 8వేల దరఖాస్తులకు వెంటనే వెరిఫికేషన్‌ పూర్తిచేయాలి. అర్హులుగా గుర్తించిన 1,99,663 లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో 45,212 మందికి పట్టాలు. కొత్తగా లే అవుట్లలో 10,801 మందికి పట్టాలు. మరో 1,43,650 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

ఎప్పటికప్పుడు పరిశీలించాలి
ఇళ్ల నిర్మాణంపై నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ప్రతి ఇంటి నిర్మాణ ప్రగతిపై ఆన్‌లైన్‌ స్టేజ్‌ అప్‌డేషన్‌ చేయాలి. కలెక్టర్లు హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అక్టోబరు 25 నుంచి ఆప్షన్‌ 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణం, ఆప్షన్‌ 3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లు 3.25 లక్షల ఇళ్లు. ఇప్పటికే 1.77 లక్షల ఇళ్లకు సంబంధించి 12,855 గ్రూపులు ఏర్పాటు. ఒక్కో గ్రూపులో హెడ్‌మేసిన్, 20 మంది లబ్ధిదారులు. మిగిలిన చోట్ల గ్రూపుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. అక్టోబరు 25లోగా అన్నిరకాల సన్నాహకాలు పూర్తికావాలి. నీరు, కరెంటు సదుపాయాలను సెప్టెంబరు 15లోగా ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు.

రుణ సదుపాయం వల్ల ఇళ్ల నిర్మాణ  ఊపందుకుంటుంది..
‘లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడాలి. మనం లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ చేశాం. అత్యవసర సమయాల్లో వీటిమీద రుణం తెచ్చుకునేలా చేశాం. పావలా వడ్డీ మాత్రమే లబ్ధిదారునికి పడుతుంది, మిగతా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. రుణ సదుపాయం వల్ల ఇళ్ల నిర్మాణ మరింత ఊపందుకుంటుంది. కొన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా లాంటివాటి సహకారంతో లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మెటల్‌ ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోంది. కలెక్టర్లు దీనిపై చర్యలు తీసుకోవాలి. వెంటనే రేట్లు నిర్ణయించాలి. ధరలు పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపాలి. లే అవుట్ల సమీపంలోనే ఇటుక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణాఖర్చు తగ్గుతుంది. ప్రతి వారానికి ఒక సారి కలెక్టర్లు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలి’ అని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు.

ఖరీఫ్‌పై సమీక్ష
‘ఖరీఫ్‌కింద ఇప్పటివరకూ 59.07 లక్షల ఎకరాల్లో సాగు. ఇందులో 37.25 లక్షల ఎకరాల్లో ఇ-క్రాపింగ్‌, మిగిలిన చోట్ల కూడా ఇ-క్రాపింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు 10శాతం ఇ- క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. జేడీఏలు, డీడీఏలు 20 శాతం ఇ- క్రాపింగ్‌ను తనిఖీచేయాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్‌ అధికారులు 30శాతం ఇ- క్రాపింగ్‌చేయాలి. ఇ- క్రాపింగ్‌ అనేది నిరంతర ప్రక్రియ. సీజన్‌తో సంబంధం లేకుండా చేయాలి. ఎలాంటి డాక్యుమెంట్లను రైతులనుంచి డిమాండ్‌ చేయరాదు. ఇ- క్రాపింగ్‌పైన కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు కొనసాగాలి. ఈ సమావేశాలను సమీక్షించాలి, పర్యవేక్షణ చేయాలి. ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల్లో, రెండో శుక్రవారం మండల స్థాయిల్లో, ప్రతి 3వ శుక్రవారం జిల్లాల స్థాయిలో వ్యవసాయ సలహా సమావేశాలు జరగాలి. జిల్లాస్థాయి సమావేశాలకు కలెక్టర్‌ హాజరు కావాలి. ఆర్బీకేల నుంచి విత్తనాలు, ఎరువుల తదితర వాటి పంపిణీ, వాటి నాణ్యతలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ఎక్కడా కల్తీలకు చోటు ఉండకూడదు. క్రమం తప్పకుండా దుకాణాల్లో తనిఖీలు చేయాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలి’ అని సీఎం జగన్‌ సూచించారు.

జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష
వందేళ్ల తర్వాత సర్వే చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. కలెక్టర్ల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. సర్వేను కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఉండే దిశగా సర్వే కొనసాగుతోందని తెలిపారు.

ఎంఎస్‌ఎంఈలకు 3న ప్రోత్సాహకాలు విడుదల
ఎంఎస్‌ఎంఈలకు నెలలో ఒకరోజు, ఇతర పరిశ్రమలకు నెలలో మరో రోజు కలెక్టర్లు కేటాయించాలి. వారితో మాట్లాడి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. వాటిని పరిష్కరించడంపై దృష్టిపెట్టాలి. అప్పుడే పారిశ్రామిక రంగం ప్రగతి సాధిస్తుంది. జిల్లాస్థాయిల్లో ఉన్న ఇండస్ట్రియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ కూడా  ప్రతినెలలో ఒకరోజు సమావేశం కావాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు వారికి పోత్సాహకాలు విడుదలకు మార్గం ఉంటుంది. భూముల కేటాయింపులు, కాలుష్యనివారణ తదితర అంశాలపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే చట్టం అమలుపైనా సమీక్షించాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై దృష్టిపెట్టాలి. ప్రతి పార్లమెంటులో ఒక కాలేజీని తీసుకువస్తున్నాం. విజయదశమి రోజున వీటి నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. ఈ చర్యలపై కలెక్టర్లు దృష్టిపెట్టడంద్వారా పెట్టుబడి పెట్టేవారిలో విశ్వాసం నింపుతాం’ అని సీఎం జగన్‌ చెప్పారు.

90 రోజుల్లో వివరాలు ఖరారు చేయాలి
‘విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ఆస్పత్రుల్లో ఉండాల్సిన సిబ్బంది ఎంత? ఎంతమంది ఉన్నారు?. దీనిపై 90 రోజుల్లోగా వివరాలు ఖరారు చేయాలి. ఎంతమంది సిబ్బంది అవసరమో నిర్ధారించాలి. ఈమేరకు నియమాకాలు పూర్తికావాలి. గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి. డిప్యుటేషన్లు ఇవ్వొద్దు. కచ్చితంగా డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేలా, చికిత్స అందించే స్థాయికి ప్రభుత్వ ఆస్పత్రులను తీసుకెళ్లాలి’ అని సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top