ప్లాస్మా దానం చేస్తే రూ.5 వేలు 

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు

మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి

కోవిడ్ నివార‌ణ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైర‌స్ బాధితుల కోసం ప్లాస్మా దానం చేసిన వాళ్ల‌కు రూ. 5 వేలు ప్రోత్సాహ‌కం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్లాస్మా థెరఫీపై  ప్ర‌జ‌ల్లోవిస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని  వైద్య ఆరోగ్య శాఖ‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.అత్య‌వ‌స‌ర మందుల‌ను అందుబాటులోఉంచుకోవాల‌ని, ఆసుప‌త్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి  ఉండ‌రాద‌ని సీఎం సూచించారు.కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హెల్ప్‌డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే.. 
  బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.  హెల్ప్‌డెస్క్‌ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కోవిడ్‌ కోసం నిర్దేశించిన138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్‌డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలి. హెల్ప్‌డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే.. చాలావరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్‌ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌పై దృష్టి పెట్టాలి
జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. స‌మర్థవంతమైన సిబ్బందిని పెట్టాలి. జేసీలు దీనిపై ఫోకస్‌ పెట్టాలి. ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌పై బాగా దృష్టి పెట్టండి. కాల్‌సెంటర్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా.. చూడండి. వచ్చే కొన్ని రోజులు దీనిపై శ్రద్ధ వహించండి. కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టండి. స్వప్రయోజనాలకోసం తప్పుడు వార్తాకథనాలు ఇస్తే ఎప్పటికప్పుడు ఖండించాలి. లేదంటే ప్రజలు వీటిని వాస్తవం అనుకునే అవకాశం ఉంది. నిజాలు ప్రజలముందు పెట్టండి. వచ్చే సమాచారంలో వాస్తవాలు ఉంటే.. వాటిని పాజిటివ్‌గా తీసుకుని సమస్యలను పరిష్కరించండి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి. ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలి. ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని ముఖ్య‌మంత్రి అన్నారు 

విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు
సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి. దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండి. వీటిని ఎలా వాడాలన్న దానిపై వారికి అవగాహన కల్పించాలి. కోవిడ్‌ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే... ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలి. నాడు-నేడు కార్యక్రమాలనూ సమీక్షించాలి. మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తికావాల‌ని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు.  

తాజా వీడియోలు

Back to Top