మహిళల ఆరోగ్యంపై దృష్టిపెట్టండి

గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి

గ్రామ సచివాలయాల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలి

బాల్య వివాహాల నియంత్రణకు కృషిచేయండి

గ్రామాల్లో న్యాయాలయాల ఏర్పాటుపై సీఎం ఆరా

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

 

తాడేపల్లి: మహిళల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు విషయాలపై అధికారులతో చర్చించారు. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. టెస్టు, ట్రీట్, ట్రాక్‌ విధానంలో రక్తహీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు సీఎం మాట్లాడుతూ.. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గర్భవతులకు ఆహారం ఏం ఇస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఏయే సరుకులకు ఎంత ఖర్చు చేస్తున్నారని, విడిగా వివరాలు రూపొందించాలన్నారు. మరింత నాణ్యంగా పౌష్టికాహారం అందించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ పథకాలు అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. బయోమెట్రిక్‌ లేదా ఐరీస్‌ లేదా వీడియో స్క్రీనింగ్‌ ఇవన్నీ పథకం లబ్ధిదారుడికి చేరిందనే దానికి ఆధారం తప్ప ఏ స్కీంనైనా నిరాకరించడానికి కాదని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలపై ప్రభుత్వం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని ఆదేశించారు.
 
1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ. 7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్న విషయాన్ని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే నిధులు విడుదల చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వివిధ ఘటనల్లో బాధితులకు సాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు రూ. కోటి చొప్పున నిధిని కేటాయించాలన్నారు. నిధి ఖర్చు అవుతున్న కొద్దీ కోటి రూపాయలకు తగ్గకుండా నిల్వ ఉండేలా వారం రోజుల్లో మళ్లీ మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఒక విధానం తీసుకురావాలన్నారు.

బాల్య వివాహాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై ఆరా తీశారు. న్యాయాలయాల ఏర్పాటు అంశంపై ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తనకు తెలియజేయాలన్నారు. భూ వివాదాలు, ఇతర వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలన్నారు. వీటిని దశాబ్దాల తరబడి నాన్చి న్యాయం జరగని పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు.

Back to Top