లక్ష్య సాధన కోసం సీరియస్‌గా పనిచేయాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

విద్య, వైద్య రంగాల్లోని వ్యవస్థల మార్పు లక్ష్యంగా పెట్టుకున్నాం

ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం

వైద్య రంంలో వేల సంఖ్యలో పోస్టులు భర్తీ చేశాం

నాడు–నేడు కింద ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆస్పత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను సీఎం పరిశీలించారు. ఆరోగ్యశ్రీ మరింత సులువుగా వైద్య సేవలు పొందడంపై సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం. వైద్య రంగం విషయానికొస్తే.. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీచేశాం. వేల కోట్ల రూపాయలను ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాం. విలేజ్‌ / వార్డు క్లినిక్స్‌ దగ్గరనుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

కీలక రంగాలను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాం..
ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. ఆరోగ్య ఆసరా కింద రోగులకు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచాం. 16 టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నాం. భారీ మార్పులను ఆశించి, దానికి అనుగుణంగా ల‌క్ష్యాలు పెట్టుకున్నాం. అందుకే విద్య, వైద్య సహా కీలక రంగాలను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాం. అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు అప్పగించాం.

ఒక ముఖ్యమంత్రిగా నేను ల‌క్ష్యాలను నిర్దేశిస్తాను. కానీ, ఆ ల‌క్ష్యాన్ని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలి. శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది ఛాలెంజ్‌గా స్వీకరించాలి. ఆశించిన మార్పుల సాధనకు, ల‌క్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్‌గా పనిచేయాలి. 

కోవిడ్‌ పరిస్థితులను వివరించిన అధికారులు
డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి గణనీయంగా పడిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు కేవలం 5 మాత్రమే ఉన్నాయని, 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేశామని అధికారులు చెప్పారు. 15– 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి వందశాతం 2 డోసుల  వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని, 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నవారికి మొదటి డోసు 94.47 శాతం వ్యాక్సిన్లు వేశామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. 

మే చివరి నాటిని అన్నీ పూర్తిచేయాలి..
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నాం. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదు. ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రై వేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు.

ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు, విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష

నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్ద‌ని, వ‌సతులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రానివ్వొద్ద‌ని సీఎం సూచించారు. పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, అలాగే గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతిని అధికారులు వివ‌రించారు. 16 మెడికల్‌ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్‌ కాలేజీల్లో నిర్మాణాల ప్రగతిని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టిపెట్టాలని సూచించారు. 

ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు

ఆస్పత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను పర్యవేక్షించాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాల‌న్నారు. టాయిలెట్ల దగ్గరనుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలన్నారు. ప్రతిభ ఆధారంగా వలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆరోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌కు సూచించారు. 

ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వి. వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Back to Top