‘పోలవరం’ పనులు వేగవంతం చేయాలి

ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నాం

ఢిల్లీ వెళ్లి పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలి

వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టాలి

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ –2 పనులు వేగవంతం చేయండి

ఇరిగేషన్‌ శాఖ అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నామని, ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జలవనరుల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు.  

91 శాతం స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు పూర్తయని, జూన్‌ 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖరుకు స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తవుతాయని చెప్పారు. అదే విధంగా ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. జూన్‌ నెలాఖరుకు కాఫర్‌ డ్యామ్‌లో 1, 2 రీచ్‌లు పూర్తి చేస్తామని, జూలై ఆఖరుకు కాఫర్‌ డ్యామ్‌ 3,4 రీచ్‌పనులు నిర్ణీత ఎత్తుకు పూర్తవుతుందని వెల్లడించారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా వేగవంతం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

ఈ సందర్భంగా కేంద్రం నుంచి పోలవరం బిల్లులపై సమీక్షించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం. ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నాం. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగ్‌లో ఉండటం సరికాదు. అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలి. చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్‌ అయ్యేలా చూడాలి. వచ్చే మూడు నెలలకు కనీసం రూ.1400 కోట్ల ఖర్చు అని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలి’ అని ఆదేశించారు.

వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖ రాశామని.. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న సీఎస్‌ ఆదిత్యనాథ్‌.. త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామని సీఎస్‌ తెలిపారు. 

జూలై 31 నాటికి నెల్లూరు బ్యారేజీ నిర్మాణం
నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు 84 శాతం పూర్తయ్యాయని.. జూలై 31 నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామని.. ఇంకా 180 మీటర్ల పని ఉందని.. వచ్చే 3 నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని అధికారులు సీఎంకు తెలిపారు. 

వెలిగొండ ప్రాజెక్ట్‌పై సమీక్ష
వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్‌ –1 పూర్తిగా సిద్ధమైందన్న అధికారులు.. టన్నెల్‌ –1 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా దాదాపుగా పూర్తియ్యాయన్నారు. టన్నెల్‌ –2 పనులు వేగవంతం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పనులు ఆలస్యంకాకుండా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సీఎం.. రెండో టన్నెల్‌ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని తెలిపారు. 

వంశధార స్టేజ్‌ 2, ఫేజ్‌ 2 పనులపైనా సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వీటిని ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని.. పనులు ఆలస్యంకావడానికి వీల్లేదన్నారు. పనులు వేగంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు సత్వరమే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

బ్రహ్మసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. బ్రహ్మసాగర్‌ సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో నిల్వచేయడానికి.. అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలానే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు.. గోదావరి కృష్ణా సలైనటీ మిటిగేషన్, వాటర్‌ సెక్యూరిటీ ప్రాజెక్టులు.. పల్నాడు ప్రాంత కరువు నివారణా ప్రాజెక్టులు..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపైనా సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.  

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్,  జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top