వైద్యం కోసం ఎవరూ అప్పులు పాలు కాకూడదు

ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

అమరావతి: ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు.  తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో  అమల్లోకి తీసుకు రానున్నారు.

 

 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ  పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని తెలిపారు. ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని తెలిపారు. ఆస్పత్రులకు గ్రేడింగ్‌ విధానం అమలు చేస్తామని  పేర్కొన్నారు. ‘‘ కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. వైద్యం కోసం ఎవరూ అప్పులు పాలు కాకూడదు. కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

 

 

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని  సీఎం తెలిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత ప్రభుత్వ బకాయిలన్నింటినీ చెల్లించామని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1059 చికిత్సలు ఉంటే..ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని వెల్లడించారు.  త్వరలో అన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు వర్తింపు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 27 టీచింగ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు డబ్ల్యూహెచ్‌వో సూచించిన మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు.

 

నివారణా చర్యలపై మరింత దృష్టిపెట్టాలి..

కోవిడ్‌ నివారణా చర్యల పట్ల మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్లుకు సీఎం వైఎస్‌ జగన్ సూచించారు. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందే. కోవిడ్‌పట్ల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్న దానిపై అవగాహన ఉండాలి. ఎవరికి ఫోన్‌ చేయాలి? ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలి. కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయన్నదానిపై అవగాహన కలిగించాలి. 85 శాతం మంది ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే తగ్గిపోతుంది.  ఇళ్లలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్‌ కేర్‌ సెంటర్లో ఉండొచ్చు. అన్నిరకాలుగా వారిని బాగా చూసుకుంటాం. వైద్యులు కూడా ఉంటారు. కలెక్టర్లు దీనిమీద దృష్టిపెట్టారు. ప్రతి రాష్ట్ర సరిహద్దులను తెరిచారు కాబట్టి రాకపోకలు పెరుగుతాయి. ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌కూడా తిరుగుతున్నాయి. కాబట్టి కేసులు పెరుగుతాయి. ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఎలా అవగాహన కలిగించగలం? వారిలో అవేర్‌నెస్‌ కలిగించామా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని’’  సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

 

కోవిడ్‌ రాగానే ఏం చేయాలన్న దానిపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని, కలెక్టర్‌ స్పెషల్‌ డ్రైవ్స్‌ తీసుకోవాలని సీఎం తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ లాంటి వాటిని పెట్టుకోవడం వల్ల వ్యాప్తి తగ్గుతుంది. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి  విషయాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

 

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగంలో  కీలక అంశాలు..

►అధికారంలోకి రాగానే రూ. 680 కోట్ల బకాయిలు నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాం

►పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం తీసుకుని చిరునవ్వుతో ఇంటికి రావాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకున్నాం

►ఎలాంటి జాప్యం లేకుండా ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ గ్రీన్‌ ఛానల్‌ ద్వారా చెల్లిస్తున్నాం

►1059 చికిత్సలు గతంలో ఉంటే.. వాటిని 2200 చికిత్సల వరకూ ఆరోగ్యశ్రీని విస్తరిస్తున్నాం

►జనవరిలో ప.గో. జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టాం

►ఇవాళ 2200 చికిత్సలకు పెంచి, మరో 6 జిల్లాల్లో వర్తింపు చేస్తున్నాం

►1059 చికిత్సలకు మరో 200 చికిత్సలు పెంచి.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశాం.. అధికారంలోకి రాగానే ఇందులో క్యాన్సర్, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ లాంటి వాటన్నింటినీ తీసుకువచ్చాం

►ప.గో.జిల్లాలో మాత్రం 2059కి, తర్వాత 2200 చికిత్సలు పెంచి పైలట్‌ప్రాజెక్టు కింద చేపట్టాం

►ఇప్పుడు మరో 6 జిల్లాల్లో 2200 చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వస్తున్నాం

►దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్‌ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన రాష్ట్రం మనదే...

►మనం చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయి

►నాన్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నాం

►1088 సంఖ్యలో 108, 104 అత్యాధునిక సదుపాయాలున్న అంబులెన్స్‌లను మనం ప్రారంభించాం

►ప్రతి మండలంలో కూడా సేవలు అందించడానికి ఈ చర్యలు తీసుకున్నాం

►రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఉండాలని, వైద్యం ఖర్చులకు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది

►చికిత్స తీసుకున్న తర్వాత కూడా విశ్రాంతి సమయంలోకూడా ఇబ్బందులు పడకూడదని రోజుకు రూ.225లు చొప్పున లేదా నెలకు రూ.5వేల వరకూ మనం డబ్బులు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నాం

►దేవుడి దయంతో, మీ అందరి చల్లని దీవెనలతో మనం గొప్పగా చేయగలుగుతున్నాం

►వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బతకడు.. వైద్యం కోసం ఏ మనిషీ కూడా అప్పులు పాలు కాకూడదు

►రూ.5లక్షల ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఇందులోకి వచ్చాం

►నెలకు రూ.40వేలు సంపాదించే వ్యక్తిని కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చాం

►1.4కోట్లకు పైగా ఆరోగ్యకార్డులను పంపిణీచేస్తున్నాం

►4 లక్షల కార్డులు తప్ప.. మిగతావన్నీకూడా పంపిణీ చేశారు.. మిగిలినవి కూడా త్వరలోనే పంపిణీచేస్తున్నారు

►ఆరోగ్య డేటా అంతా కూడా స్టోర్‌ చేసి.. ప్రతి రికార్డుకూడా అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం

►రాష్ట్రంలో ఆరోగ్య రంగంలోకి పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నాం

►ఆస్పత్రులన్నీ కూడా నాడు – నేడుతో రూపు రేఖలు మారుస్తున్నాం

►రాష్ట్రంలో ఇప్పుడు 11 టీచింగ్‌ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి

►కొత్తగా మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను కట్టబోతున్నాం

►జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆస్పత్రులను నిర్మిస్తున్నాం

►దాదాపు రూ.16వేల కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నాం

►ప్రతి నెట్‌ వర్క్‌ ఆస్పత్రికీ గ్రేడింగ్‌ ఇచ్చాం

►గ్రేడింగ్‌లో పాస్‌ అయిన ఆస్పత్రినే నెట్‌ వర్క్‌ ఆస్పత్రిగా గుర్తింపు నిచ్చాం

►ఇవన్నీ ఒకవైపున చేస్తూనే.. దేవుడి దయతో.. మరో ముఖ్యమైన పనిచేయగలుగుతున్నాం

►ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు తీసుకుంటే... వాటి నాణ్యతమీద సందేహాలు, భయాలు ఉన్న పరిస్థితి అలాంటి భయాన్ని తొలగించాం

►డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులను మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్నాం

►బయటకూడా దొరకని నాణ్యమైన మందులను అందిస్తున్నాం

►500కుపైగా నాణ్యమైన మందులను ఆస్పత్రులకు అందుబాటులో తీసుకొచ్చాం. ఇవన్నీ జీఎంపీ ప్రమాణాలున్న మందులే

►ప్రతి గ్రామంలోకూడా ఎవరికైనా బాగోలేకపోతే అదే గ్రామంలోనే , గ్రామ సచివాలయం పక్కనే వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ కూడా తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశాం

►13వేల విలేజ్‌ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం

►54 రకాల మందులు.. అక్కడే అందుబాటులోకి వస్తాయి

►24 గంటలు ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు

►ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ పాయింట్‌గా కూడా అందుబాటులోకి వస్తుంది

►ఈ కార్యక్రమానికి గ్రామాల్లో పనులుకూడా ప్రారంభం అయ్యాయి

►ఏప్రిల్‌నాటికి పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం

►ఈ ఏడాదిలో మనసుకు సంతోషం కలిగించే కంటివెలుగు కార్యక్రమం చేపట్టాం

►ప్రతి పిల్లాడికీ కూడా కంటి పరీక్షలు చేశాం

►65 లక్షల మంది కంటి పరీక్షలు చేశాం

►1.58 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని భావిస్తే... అందులో 1.29 లక్షల మందికి అద్దాలు ఇచ్చాం...

►కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది.. ఈనెలాఖరు లోగా మిగిలిన వారికి కంటి అద్దాలు పంపిణీ

►కరోనా తగ్గానే అపరేషన్లు కూడా చేస్తాం

►ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలని  కలెక్టర్లు దీనిపై ధ్యాసపెట్టి... ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నాం

►బాధ్యులైన జేసీలు కూడా ధ్యాసపెట్టాలని కోరుతున్నాం

►గాడిలో పడేంతవరకూ క్రమంతప్పకుండా రివ్యూ చేయాలి

►2200 చికిత్సలు ఆరోగ్యశ్రీ కింద అమలయ్యేలా చూడాలి

 

Back to Top