మెరుగైన వైద్యసేవలు అందించాలి

డిశ్చార్జ్‌ అయినవారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలి

అస్వస్థతకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

కేంద్ర వైద్య బృందాల పరిశీలనను పరిగణలోకి తీసుకోవాలి

వైద్య అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ ఆదేశం

ముగిసిన సీఎం స‌మీక్ష‌.. అస్వస్థతకు దారితీసిన కారణాలపై ఆరా

ఏలూరు: అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డిశ్చార్జ్‌ అయిన వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో వైద్య ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. 

తాగునీటి పరీక్షల్లో రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు తెలిపారు. హెవీమెటల్స్‌పై కూడా పరీక్షలు చేశామని, వివిధ రోగాలకు కారణమవుతున్న వైరస్‌లపై పరీక్షలు చేశామని, అన్ని రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని సీఎంకు వివరించారు. ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామని, అన్ని వయసుల వారు అస్వస్థతకు గురయ్యారని వివరించారు. ఎయిమ్స్‌ నుంచి డాక్టర్ల బృందం వచ్చింది. ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్‌ బృందాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. 

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. డిశ్చార్జ్‌ చేసిన వారు మళ్లీ తిరిగి ఆస్పత్రికి వస్తున్నారా అని ఆరా తీశారు. డిశ్చార్జ్‌ చేసిన వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలని, వారికి ఆహారం, మందులు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్‌ పరిశీలనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఏలూరులో ఉండాలని ఆదేశించారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 104, 108 నంబర్లకు కాల్‌ చేసేలా అవగాహన కల్పించాలన్నారు.  
 

Back to Top