104కి కాల్‌ చేసిన వెంటనే సహాయం అందాలి

కాల్‌ కలవలేదు.. స్పందన లేదనే మాట వినిపించకూడదు

నిర్ణయించుకున్న ఆస్పత్రుల్లో జర్మన్‌ హేంగర్స్‌ను ఏర్పాటు చేయాలి

ప్రతి ఆస్పత్రిలో ఆరోగ్య మిత్ర ఉండాలి

వ్యాక్సిన్లపై కొందరు వ్యక్తులు, ఓవర్గం మీడియా దుష్పచారంపై సీఎం సీరియస్‌

వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయాలి

45 ఏళ్లు దాటిన వారికి రెండో డోస్‌ అందేలా చూడాలి

ప్రతి బుధవారం కోవిడ్‌ రివ్యూ కమిటీలు సమావేశం కావాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: 104 వ్యవస్థ పట్టిష్టంగా ఉండాలని, బలోపేతంగా నడవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజూ 104 కాల్‌ సెంటర్‌కు మాక్‌ కాల్స్‌ చేసి పని తీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. రద్దీ ఉన్న జిల్లాల్లో బెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని, ఆక్సిజన్‌ సహా కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించాలని ఆదేశించారు. 104కు కాల్‌ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలన్నారు. అవసరమైన వారికి బెడ్‌ కల్పించాలన్నారు. బెడ్‌ అవసరం లేదు అన్న వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపించాలన్నారు. 

కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్, ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సేవలపై చర్చించారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 104కు కాల్‌ చేస్తే కలవలేదని, స్పందన లేదనే మాట వినిపించకూడదన్నారు. 104కు కాల్‌ చేసిన తరువాత కోవిడ్‌ బాధితులకు కచ్చితంగా సాయం అందాలని సూచించారు. నిర్ణయించుకున్న ఆస్పత్రుల్లో జర్మన్‌ హేంగర్స్‌ను ఏర్పాటు చేయాలని దీని వల్ల పేషెంట్లు బయట వేచిచూసే పరిస్థితులు తప్పుతాయన్నారు. అంతేకాకుండా సత్వరమే వారికి వైద్యం అందుతుందన్నారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు.. కేంద్రమే నిర్ణయిస్తోంది..
‘ప్రతి ఆస్పత్రిలో కూడా ఆరోగ్య మిత్ర ఉండాలి. ఎవరైనా, ఏదైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి ఆస్పత్రిలో కూడా నంబర్‌ డిస్‌ ప్లే చేయాలి. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వ్యాక్సినేషన్‌ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నా, ఎన్ని అమ్మాలో కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోంది. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోంది. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా డబ్బును ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం..
వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. అయినా, ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారాలు చేస్తున్నారు. కావాలనే ప్రజల్లో ఆందోళనను, భయాన్ని సృష్టిస్తున్నారు.’

ఆ ఆలోచన చేయాలి..
నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతోంది. ప్రస్తుతం ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయి. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయాలి. అధికారులు అంతా కూర్చుని దీనిపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలి. 

వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందించేలా చూడాలి..
‘వ్యాక్సిన్‌ సెంటర్ల వద్ద, రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదు. వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారన్నదానిపై ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు స్పష్టంగా చెప్పాలి. దీనివల్ల వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద క్యూలు ఉండే పరిస్థితిని నివారించవచ్చు. వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి, టీకా తీసుకునేవారికి సౌకర్యంగా ఉండేలా చూడాలి. అందిరికీ వ్యాక్సిన్‌ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. 45 ఏళ్లకు పైబడి మొదటి డోస్‌ తీసుకుని, రెండో డోస్‌ కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందించేలా చూడాలి. వీరికి వ్యాక్సిన్‌ పూరైన తర్వాత 45 ఏళ్ల పైబడ్డ వారికి వ్యాక్సిన్లు ఇవ్వడంపై దష్టిపెట్టాలి.

ముందు వారిపై దృష్టిపెట్టాలి..
45 ఏళ్ల పైబడ్డ వారిపై కోవిడ్‌ ప్రభావం అధికంగా ఉన్నందున ముందు ఈ కేటగిరిలో ఉన్న వారిపై దృష్టిపెట్టాలి. జ్వరం వస్తే దాన్ని కోవిడ్‌ లక్షణంగా చూసి, వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని, వైద్య నిపుణులు ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలి.  సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. 

బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాలి..
రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాలి. దీనిపై ఆడిట్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్‌ ఉండాలి. రోగులకు అందుబాటులో ఉంచాలి. ఇంజక్షన్ల పేరిట రోగులను దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలి. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లా నుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలి. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలి. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్‌ రివ్యూ కమిటీలు సమావేశం కావాలి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతుంది. ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చైర్‌పర్సన్‌ డా. కే.ఎస్‌. జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం. టీ. కృష్ణబాబు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ఎం. రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంచార్జి ఎ. బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ. మల్లికార్జున్, ఏపిఎంఎస్‌ఐడీసీ విసి అండ్‌ ఎండీ విజయరామరాజు, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top