ప్ర‌జ‌లు కాల్ చేసిన వెంట‌నే స్పందించాలి

104, 14410 కాల్‌సెంట‌ర్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాలి

స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు మాస్కులు ఇవ్వాలి

టెలిమెడిసిన్‌కు ఫొన్ చేసిన వారికి మళ్లీ ఫోన్ చేసి సేవలపై ఆరా తీయాలి

కోవిడ్ ఆస్ప‌త్రుల్లో సేవ‌ల‌పై కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి

ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయ‌డానికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం

క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ఎదుర‌వుతున్న లోపాలను అంగీకరించి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశానికి వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని,  సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌, ఆరోగ్య శాఖ స్పెష‌ల్ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పరీక్షలు బాగా చేస్తున్నామన్నారు. చేస్తున్న పరీక్షల్లో 85 నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నామ‌న్నారు. 104, 14410 కాల్‌ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఈ రెండు నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు కాల్‌ చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు.

139 కోవిడ్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో భోజనం, పారిశుద్ధ్యంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌ ఆరా తీశారు. మెనూ ప్ర‌కారం నాణ్య‌మైన భోజ‌నం అందించాల‌ని ఆదేశించారు. టెలిమెడిసిన్‌ కింద మందులు పొందిన వారికి మళ్లీ ఫోన్ చేసి సేవలపై ఆరా తీయాలని అధికారుల‌ను ఆదేశించారు. సేవల్లో స్థిరత్వం ఉండాలని, వ్యవస్థలు ఉన్నట్టు ఉంటాయి గాని, అవి స్థిరంగా పనిచేస్తున్నాయా? లేదా? అనేదానిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలన్నారు. కాల్‌సెంట‌ర్ సేవ‌ల‌పై ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేయాల‌న్నారు. ఎదురవుతున్న లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు.

జగనన్న విద్యాకానుక ఇచ్చే సమయానికి మాస్కులు కూడా ఇవ్వాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.  కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలపైన కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆయా అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయన్న దానిపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని, గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు పెట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఏఎన్‌ఎం ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా ఉండాలన్నారు. కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలు కూడా ఈ పోస్టర్‌లో ఉండాలని, వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై ఏఎన్‌ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. దీంట్లో వలంటీర్‌ భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. కోవిడ్ నివార‌ణ‌కు సంబంధించిన హోర్డింగ్‌లు, పోస్ట‌ర్లు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కోవిడ్ నివార‌ణ‌పై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

తాజా వీడియోలు

Back to Top