వలస కూలీల బాధలపై సీఎం ఆవేదన

వారికి ఆకలి బాధలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశం

కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

ఎగ్జిట్‌ వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం  

తాడేపల్లి: వలస కూలీలకు ఆకలి బాధలు లేకుండా భోజనం, తాగునీరు సదుపాయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తించి స్వస్థలాలకు పంపించడంపై ఆలోచన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వలస కూలీలపై సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది వలస కూలీలు అవగాహన లేక రైళ్ల కోసం నిరీక్షించలేక నడుచుకుంటూ వెళ్తున్నారని అధికారులు తెలిపారు. వ్యవస్థీకృతంగా ఉంటే కనుక ఆయా రాష్ట్రాలతో మాట్లాడి పంపించడానికి అవకాశం ఉంటుందని, చెక్‌పోస్టుల వద్ద గుర్తించివారిని సహాయక కేంద్రాలకు పంపిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తించి స్వస్థలాలకు పంపడంపై ఆలోచన చేయాలని, నిర్దిష్ట దూరంలో భోజనం, తాగునీరు వలస కూలీలకు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో అనుసరించాల్సిన ఎగ్జిట్‌ వ్యూహంపై సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు ప్రతిపాదనలు వివరించారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 290 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు, వీటిలో 75 క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. వాటిని డినోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని నిర్ణయించారు. కేసుల సంఖ్య, విస్తరణ అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్ల కంటైన్‌మెంట్‌ ఏరియా, 500 మీటర్ల బఫర్‌ జోన్‌ కలుపుకొని 1 కిలోమీటర్‌ పరిధిలో కంటైన్‌మెంట్‌ ఆపరేషన్లు.. ఆంక్షలు కఠినంగా కొనసాగించాలని నిర్ణయించారు. 

10 అంతకంటే తక్కువగా కేసులు నమోదైన మరొక 103 క్లస్టర్లలో 200 మీటర్లు మేర కంటైన్‌మెంట్, మరో 200 మీటర్ల బఫర్‌ ఏరియాలో ఆపరేషన్స్‌ కొనసాగించాలని, అదే విధంగా 14 రోజులుగా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటైన్‌మెంట్‌ ఏరియా అమలు చేయాలని, కొత్తగా కేసులు రాని పక్షంలో మే 31 తరువాత సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఎగ్జిట్‌ ప్లాన్‌లో భాగంగా థియోటర్లు, రెస్టారెంట్లు, ప్రజారవాణా, విద్యా సంస్థలు వీటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు ఎలా సాగించాలో నిర్దిష్ట విధానాలు సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

 

Back to Top