కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపడం సరికాదు

వైరస్‌పై ప్రజల్లో భయాందోళన తొలగించాలి

రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదు

రొయ్యలు, చేపల ఎగుమతులపై దృష్టిపెట్టండి

సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో భయం, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉంది. వైరస్‌ సోకినవారి పట్ల వివక్ష చూపడం సరికాదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. కరోనాపై అవగాహన పెంచుకోవడంతోపాటు, చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. క‌రోనా వైర‌స్‌పై ప్ర‌జ‌లు భ‌యాన్ని వీడేలా అవ‌గాహ‌న క‌ల్పించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కరోనా వైరస్‌ పట్ల భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందన్న మాటపై ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ కూడా తనతో మాట్లాడారని, వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానితో కీలక అంశాలను ప్రస్తావించారంటూ అన్నారని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.

కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని సోమవారం డిశ్చార్జి అయిన ఒక ఉద్యోగిని ఇంట్లోకి రానివ్వలేదన్న అంశాన్ని అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనల కారణంగా ఇలాంటి వివక్ష చూపిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. హైరిస్క్‌ ఉన్నవారు, 60 సంవత్సరాల పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపైనా దృష్టి సారించామన్నారు.

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. రైతులకు పేమెంట్లు కూడా జరుగుతున్నాయని, అకాల వర్షాలు సంభవిస్తే మార్కెట్లలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. చేపలు, రొయ్యల ఎగుమతులపై దృష్టిపెట్టాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు సిద్ధమవుతున్నాయని, ఈనెల 30న వాటిని ప్రారంభించడానికి సిద్ధమని అధికారులు తెలిపారు.
 

Back to Top