కచ్చితమైన మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటించాల్సిందే

కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

కోవిడ్‌ – 19 పరీక్షలు కొనసాగుతున్న తీరుపై ఆరా

తాడేపల్లి: రెడ్‌జోన్లలో ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితమైన మెడికల్‌ ప్రొటోకాల్‌ పాటించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు కొనసాగుతున్న తీరును సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో ప్రతి పది లక్షల జనాభాకు 2,224 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా తమిళనాడులో ప్రతి మిలియన్‌కు 1929 పరీక్షలు, రాజస్థాన్‌లో ప్రతి మిలియన్‌కు 1402 పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. గడిచిన 24 గంటల్లో 10,229 పరీక్షలు నిర్వహించామని, ఆదివారం నాటికి మొత్తం 1,25,229 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1093కి చేరిందని, మొత్తం 524 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు.  ఇక రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల శాతం 1.32 ఉండగా దేశంలో 3.84 ఉందని, రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు 2 శాతం కాగా.. దేశంలో 3.27 ఉన్నట్లు అధికారులు వివరించారు.  
 

Back to Top