'వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌' సమర్థవంతంగా అమలు చేయాలి

డయాలసిస్‌ వంటి చికిత్సకు ఇబ్బందులు రాకుండా చూడాలి

పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌, ధరలపై దృష్టిపెట్టాలి

సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా డయాలసిస్‌ వంటి చికిత్సలు అవసరమైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరయ్యారు.

కరోనా కట్టడికి కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. కుటుంబంలో ఒకరికి పాసు ఇచ్చి నిత్యావసరాలకు ఆ వ్యక్తిని మాత్రమే అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వెళ్లేలా చూడాలని సీఎం సూచించారు. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. వైద్యం కోసం వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పటి వరకు 8,395 మంది టెలీ మెడిసిన్‌ ద్వారా వైద్యులను సంప్రదించారని అధికారులు పేర్కొన్నారు. మరింత సమర్థవంతంగా టెలీ మెడిసిన్‌ విధానాన్ని అమలు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

డీఆర్డీవో ద్వారా మొబైల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఎం తెలిపారు. వలస కూలీలు, వివిధ క్యాంపుల్లో ఉన్న వారిని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. టమాట, ఉల్లి, చీనీ పంటలు సహా ఇతర ఉత్పత్తులను మార్కెటింగ్‌, ధరలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. రైతు బజార్లను ఎక్కువగా వికేంద్రీకరించి రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలను ఈ రైతుబజార్లలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top