ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించండి

పంటలు సరైన ధరకు కొనుగోళ్లు చేసి రైతుకు అండగా నిలబడాలి

కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కరోనా కేసులు ఎక్కువ అవుతున్న ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ జిల్లాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఆదేశించారు. రైతులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. అన్నదాత పండించిన ప్రతి పంట సరైన ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలని ఆదేశించారు. అదే విధంగా లాక్‌డౌన్‌ సందర్భంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారుల కోసం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడానని,  మత్స్యకారులును అన్ని రకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని తనతో గుజరాత్‌ సీఎం చెప్పారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు.

Back to Top