ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం తీపి కబురు

ఆర్టీసీ ఎంప్లయీస్‌ని ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చాలని ఆదేశం

కాంట్రాక్టు ఉద్యోగులు, సీపీఎస్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసినందున 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగాల జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌), కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, పురపాలక పరిపాలన శాఖ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. 

సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్‌ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్‌ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగులు 1,98,221 మంది సీపీఎస్‌ పరిధిలో ఉన్నారని వివరించారు. వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705, ఎయిడెడ్‌ కింద 3,295 మంది, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 16,221 మంది పనిచేస్తున్నారని చెప్పారు. వారికి ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు.

ఆర్టీసీలో పని చేస్తున్న 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చాలని ఆదేశించారు. అనంతరం కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) కూడా అమలు చేశామని వెల్లడించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top