సహకార వ్యవస్థ మళ్లీ బలోపేతం కావాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి

గతంలో కొందరు సహకార డెయిరీలను ప్రైవేట్‌ సంస్థలుగా మార్చారు

హెరిటేజ్‌ మేలు కోసం ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయలేదు

అమూల్‌ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు అదనపు ఆదాయం

మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం ఆసరా, చేయూత పథకాలు

మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలి

ఆక్వా రైతుల మేలు కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చాం

జగనన్న అమూల్ పాల వెల్లువ, మత్స్యశాఖ, ఫిషింగ్‌ హార్బర్ల‌పై సీఎం స‌మీక్ష 

తాడేపల్లి: గతంలో కొందరు సహకార డెయిరీలను తమ ప్రైౖవేటు సంస్థలుగా మార్చుకున్నారని, హెరిటేజ్‌ మేలు కోసం ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయలేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని, చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. జగనన్న అమూల్‌ పాలవెల్లువ, మత్స్యశాఖ, ఫిషింగ్‌ హార్బర్స్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి అమూల్‌ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని చెప్పారు. వారికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. దానివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుందని, మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నామని సీఎం  వైయస్‌ జగన్‌ అన్నారు. 

పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ–శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. 

ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు..
ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాదు, స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. ఇది జరక్కపోతే సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్‌ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారన్నారు. ప్రాసెసింగ్‌ చేసేవాళ్లు, ఎక్స్‌పోర్ట్‌ చేసేవాళ్లు సిండికేట్‌ అవుతున్నారని పలు దఫాలుగా రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని చెప్పారు. పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాదు, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. 

చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్‌లో నాణ్యత కోసం, రైతుల్ని దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తుచేశారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఫిష్‌ ఆంధ్రా లోగో ఆవిష్కరణ.. 
ఆక్వారంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతులకు నేరుగా అందేలా చూడాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేయడానికి తగిన ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్‌ కూడా పెట్టే ఆలోచన చేయాలన్నారు. ఫిష్‌ ఆంధ్రా లోగోను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. ఆక్వాహబ్‌లు, అనుబంధిత రిటైల్‌ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు.

వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి.. 
జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌లను, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లను సిద్ధం చేస్తామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు తెలిపారు. 10 ప్రాసెసింగ్‌ప్లాంట్లు, 23 ప్రీప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు చెక్‌ పెట్టగలుగుతామని, రైతులకు మంచి ధరలు వస్తాయని అధికారులు వివరించారు. 

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనుల ప్రగతి.. 
నాలుగు ఫిషింగ్‌ హార్బర్లలో పనులు మొదలయ్యాని అధికారులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు వివరించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌–జూలై నాటికి ఈ నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు ప్రారంభానికి సిద్ధం చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. మిగిలిన 5 ఫిషింగ్‌ హార్బర్ల పనులు ఈ డిసెంబర్‌లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్ర కుమార్, అమూల్‌ ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top