మంచి స‌దుపాయాలు, నాణ్య‌మైన విద్య ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ఎయిడెడ్ స్కూళ్లు ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌డం పూర్తి స్వ‌చ్ఛందం

తామే నడుపుకుంటామంటే.. నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు

పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలి

స్కూళ్ల‌లో సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదుకు ఫోన్ నంబ‌ర్ ఏర్పాటు చేయాలి

గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి

టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందించాలి

విద్యాశాఖ అధికారుల‌కు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణం చేప‌ట్టాల‌ని విద్యాశాఖ అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని ఆదేశించారు. విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. నూతన విద్యా విధానం అమలుపై కూడా సీఎం స‌మీక్షించారు. 

శాటిలైట్‌ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ ప్లస్‌స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రాలు అందించారు. నూతన విద్యా విధానంలో తీసుకున్న చర్యలు వాటి అమలుపై సీఎం ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమ‌లు కావాల‌ని సీఎం ఆదేశించారు. 

2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో  మూడుదశలుగా పూర్తిగా నూతన విద్యా విధానం అమ‌లు కానుంది. దీంట్లో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 స్కూళ్లు  విలీనం చేశామని అధికారులు తెలిపారు. 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారన్నారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. 

సీబీఎస్‌ఈ అఫిలియేష‌న్‌పై సీఎం సమీక్ష
1092 స్కూల్స్‌ 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ జరిగాయని విద్యాశాఖ అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదోతరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. అంతర్జాతీయంగా 24వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉందని తెలిపారు. దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1,092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఇవ్వడం రికార్డని అధికారులు సీఎంకు వివ‌రించారు. 

నాణ్యమైన శిక్షణ అందించాలి
టీచర్‌ ట్రైనింగ్‌ ఇస్తున్న డైట్‌ సంస్థల సమర్థత పెంచాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందించాల‌న్నారు. టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. స్కూల్‌లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌చేసేలా ఒక నంబర్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్రతి స్కూల్‌లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలన్నారు. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

ఇంగ్లిష్‌పై ప్రత్యేక శ్రద్ధ
ఇంగ్లిష్ ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టిసారించాల‌న్నారు. పిల్లలకు ఇదివరకే డిక్షనరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు నేర్పించాలని ఆదేశించారు. 

ఎయిడెడ్.. పూర్తి స్వ‌చ్ఛందం..
ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందం అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సమావేశంలో మరోసారి స్పష్టంచేశారు. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందన్నారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనంచేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని మరోసారి స్పష్టంచేశారు. విలీనంచేస్తే.. వారి పేర్లు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే.. నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని సీఎం తెలిపారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ప్ర‌భుత్వ ఉద్దేశమని సీఎం వివ‌రించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతంలేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలు కూడా తగవని స్పష్టం చేశారు.

మరుగుదొడ్లు నిర్వహణ
మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని, నాణ్యమైన సదుపాయాలు అన్నది అందరి లక్ష్యం కావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. అందుకనే పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలన్నారు. టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక.. అవి చివరకు దుర్గంధంతో నిండిపోయి ఎవరూ వినియోగించని పరిస్థితులు చూశామని, అలాంటి పరిస్థితులను నాడు – నేడు ద్వారా మార్చ‌గ‌లిగామ‌ని చెప్పారు. ఇప్పడు వాటిని సరిగ్గా పర్యవేక్షించి పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉండాల‌న్నారు. పాఠశాలలకు హెడ్‌మాస్టర్లు కుటుంబ పెద్దలు.. ఆ పాఠశాలల్లో నాణ్యమైనరీతిలో బోధన దగ్గరనుంచి మొదలు భోజనం నుంచి ఇతర సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు చేసి.. వాటిని సవ్యంగా ఉండేలా వారుచూడాలని, ఆవిధంగా హెడ్ మాస్టర్లను చైతన్యం చేయాలని విద్యాశాఖ అధికారుల‌ను సీఎం ఆదేశించారు. దీనిపై  ప్రతిరోజూ మానిటరింగ్‌ జరగాలన్నారు. 

గోరుముద్దపై ఫీడ్‌ బ్యాక్‌
గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. పిల్లలనుంచి, తల్లులనుంచి తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలన్నారు. స్వయంగా వారు భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. 

లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాల‌ని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (ఎండిఎం అండ్‌ శానిటేషన్‌) బి ఎం దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి చినవీరభద్రుడు, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి రాములు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా ఫోటోలు

Back to Top