జనవరి 1న ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

స్పందన కార్యక్రమంలో వెల్లడించిన సీఎం వైయస్‌ జగన్‌

ఫిబ్రవరి నుంచి ఆరోగ్యశ్రీ కింద కేన్సర్‌ చికిత్స

ఫిబ్రవరి 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు

పలు కీలక అంశాలను ‘స్పందన’లో వెల్లడించిన సీఎం

సచివాలయం:  ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక కలను నెరవేర్చామని, జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కార్మికులను ప్రభుత్వంలో విలీనం) చట్టం 2019 ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ కార్మికులు జీతాలు అందుకోనున్నారు.

సచివాలయంలో స్పందనపై సీఎం వైయస్‌ జగన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. జనవరి 3న కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేస్తామని వివరించారు. 1259 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించనున్నామని, ఏప్రిల్‌ నుంచి ఒక్కో జిల్లాకు పెంచుతూ 2059 రోగాలకు వర్తింపజేస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి ఆరోగ్యశ్రీ కిందకు కేన్సర్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామన్నారు. తలసేమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్, బోదకాలు, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి రూ. 5 వేల పెన్షన్‌. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారికి రూ. 3 వేల పెన్షన్‌ అందించనున్నట్లు చెప్పారు.

జనవరి 2న రైతు భరోసాకు సంబంధించి చివరి విడత డబ్బుల పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి మళ్లీ రైతు భరోసా కింద డబ్బులు ఇస్తామన్నారు.

జనవరి 9న అమ్మఒడి పథకం అమలు అవుతుందని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. జనవరి 4 నుంచి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, తల్లిదండ్రులు, విద్యా కమిటీలకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు.  అదే విధంగా అమ్మఒడి, మధ్యాహ్న భోజనంలో తీసుకొస్తున్న మార్పులు, ఇంగ్లిష్‌ మీడియం, నాడు – నేడుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
 
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమంలో వివరించారు. ఫిబ్రవరి 1న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, నాణ్యతతో కూడిన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తాయన్నారు.

ఉగాది నాటికి ఇళ్లు లేని ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 22,76,420 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన స్థలాలకు సంబంధించి మొత్తం భూముల గుర్తింపు, సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తామన్నారు.  

జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ. బుక్‌ చేసుకున్న వెంటనే ఇసుక ఇంటికి పంపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

మహిళా భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

తాజా వీడియోలు

Back to Top