కోవిడ్‌కు వ్యాక్సినేష‌నే ప‌రిష్కారం

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

 తాడేప‌ల్లి: కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వ్యాక్సినేషన్‌ మాత్రమే ఒక పరిష్కారంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో కూడా తెలియద‌ని, ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. గురువారం క్యాంపు కార్యాల‌యంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా, అందులో కోటి వాక్సిన్లు కోవాక్సిన్‌. మిగిలినవి కోవీషీల్డ్. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్లు ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్‌ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు కావాలి. తొలి డోస్‌ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారు. 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్‌ మాత్రమే వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటి వరకు వేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ డోస్‌లు దాదాపు 15 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 39 కోట్ల వాక్సిన్‌ డోస్‌లు కావాల‌ని సీఎం వై య‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. 

భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి వాక్సిన్లు తయారు చేస్తుండగా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6 కోట్ల వాక్సీన్లు తయారు చేస్తోంది. వీటితో పాటు రెడ్డీ ల్యాబ్స్‌.. ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. అన్నీ కలిపి ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్లు వాక్సీన్లు ఉత్పత్తి కావొచ్చు. దానికి తోడు ఇప్పుడున్న 7 కోట్లు కూడా కలుస్తాయి.ఈ లెక్కన 39 కోట్ల వాక్సీన్‌ డిమాండ్‌  ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదని అనుమానం వ్య‌క్తం చేశారు. 

18–45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు దేశంలో 60 కోట్లు ఉన్నార‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. ఆ మేరకు వారికి 120 కోట్ల కరోనా వాక్సిన్‌ డోస్‌లు కావాలి. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వాక్సినేషన్‌ పూర్తయ్యాక, 18–45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సీన్‌ ఇవ్వొచ్చని అంచనా. ఆ మేరకు వారికి వాక్సినేషన్‌ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్‌ చేయగలుగుతాము. ఇదీ వాస్తవ పరిస్థితి.
కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే శానిటేషన్‌ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. 

Back to Top