కోవిడ్ నియంత్ర‌ణ‌పై మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ 

కోవిడ్‌–19, వ్యాక్సినేష‌న్‌, 104 సేవ‌ల‌పై చ‌ర్చ‌

ఉపాధి హామీ పనులు , ఆర్బీకే భవనాలు, డాక్టర్‌ వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాల‌పై స‌మీక్ష 

 వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్

 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా.. ఇళ్ల నిర్మాణం

తాడేప‌ల్లి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు వచ్చే కొన్ని నెలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌, ఉపాధి హామీ పనులు , స‌చివాల‌య భ‌వ‌న నిర్మాణాలు, ఆర్బీకే భవనాలు, డాక్టర్‌ వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలతో పాటు ఏప్రిల్, మే నెలల్లో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలపైనా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. 

1). కోవిడ్‌–19:
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు వచ్చే కొన్ని నెలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. 
లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలిగితే, సామాన్యుడికి 4 రూ. నష్టం కలుగుతుంది. గత ఏడాది లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం జరిగింది. అంటే ప్రజలకు దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం జరిగింది.

వాక్సినేషన్‌:
దేశంలో నెలకు 7 కోట్ల వాక్సిన్‌ ఉత్పత్తి జరుగుతుండగా, అందులో కోవాక్సిన్‌ కోటి డోస్‌లు తయారవుతున్నాయి. మిగతాది కోవిషీల్డ్‌. రాష్ట్రంలో 45ఏళ్ళకు పైబడిన వారిలో ఇప్పటివరకు 11.30 లక్షల మందికి రెండు డోసులు, దాదాపు 45.48 లక్షలమందికి సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 18–45 ఏళ్ల వారికి కూడా వాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే కోవిడ్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. అదొక్కటే మనకున్న పరిష్కార మార్గం.

104 కాల్‌ సెంటర్‌:
ఈ కాల్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి.
ఆస్పత్రికి వెళ్లడమా, క్వారంటైన్‌కు పంపడమా, హోం ఐసొలేషనా? ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి.
కాబట్టి 104 నెంబర్‌ను మనసా, వాచా, కర్మణా ఓన్‌ చేసుకోవాలి.
కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 నెంబర్‌ అన్నది వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ స్థాయిలో కాల్‌ సెంటర్‌ పని చేయాలి.
104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము.

కోవిడ్‌ ఆస్పత్రులు–బెడ్లు:
కోవిడ్‌ చికిత్స కోసం అన్ని జిల్లాలలో మొత్తం 355 ఆస్పత్రులను కలెక్టర్లు గుర్తించగా, వాటిలో 28,377 బెడ్లు ఉన్నాయి. వాటిలో 17901 బెడ్లు ఆక్యుపైడ్‌. ఆ ఆస్పత్రులలో వైద్యం పూర్తిగా ఉచితం. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి.
104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి. 

జేసీకి బాధ్యత:
జేసీ (గ్రామ వార్డు సచివాలయాలు. అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ఆ అధికారికి అదే పని ఉండాలి. అప్పుడే మనం అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతాం. మన అధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ చూడాలి. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు వాటిలో ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లు (సీసీసీ):
జిల్లాలో తగినన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాలలో 59 సీసీసీలు పని చేస్తుండగా, వాటిలో 33,327 బెడ్లు ఉన్నాయి. ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు వాటిలో ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు, రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారా? లేదా? అన్నది ప్రతి కలెక్టర్‌ చూడాలి.
అలాగే ఎక్కడా బెడ్ల కొరత లేకుండా కలెక్టర్లు శ్రద్ధ చూపాలి.

ఆక్సీజన్‌ సరఫరా: 
ప్రస్తుతం రోజుకు 320 నుంచి 340 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సీజన్‌ సరఫరా అవుతోంది. ఇది ప్రస్తుతానికి సరిపోతున్నది. ఆక్సీజన్‌ అవసరమైన వారికి తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. ఆక్సీజన్‌ లెవెల్‌ 94 కంటే తక్కువ ఉంటే వెంటనే ఆక్సీజస్‌ ఇవ్వాలి. 

నిరంతరం తనిఖీలు:
జిల్లా స్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. వాటికి ఇంఛార్జ్‌లను నియమించాలి. 
జిల్లా స్థాయి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలి. అందులో ఔషథ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు.
వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.

సిబ్బంది నియామకం:
అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. 
ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండి. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయండి.

50 మందికి మించి వద్దు:
ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలి. పెళ్ళిళ్ళకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి.
అలాగే స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి. 
ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకూడదు. అదే సమయంలో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి.
ఏ కార్యక్రమంలో కూడా ఎక్కడా 50 మందికి మించి చేరకూడదు.

వారి పట్ల కఠినంగా వ్యవహరించండి:
పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం, వాస్తవాలు మరుగున పెట్టి, అసత్యాలు ప్రచారం చేస్తే, కఠినంగా వ్యవహరించండి. అరెస్టు చేయండి. వాళ్లను జైలుకు పంపే అధికారం కూడా మీకు ఉందన్న విషయం మర్చిపోవద్దు.
ఈ విషయంలో అవసరమైతే అందరు ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలి.
ప్రతి రోజూ అఫీషియల్‌ బులెటిన్‌ ఇస్తారు. దాన్నే అందరూ తీసుకోవాలి. కోవిడ్‌ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి, అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన ఇంకా తీవ్రమవుతుంది.
కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు.

2). ఉపాధి హామీ పనులు:
కోవిడ్‌ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చాలా కీలకం. మనకు 20 కోట్ల పని దినాలకు మనకు అనుమతి ఉండగా, గత ఏడాది పెంచారు.
ఏప్రిల్‌లో 2.50 కోట్ల పని దినాలు మనకు (పర్సన్‌ డేస్‌–పీడీస్‌) లక్ష్యం కాగా, ఈనెల 26 నాటికి కేవలం 1.89 కోట్లు మాత్రమే సాధించగలిగాము. కాబట్టి వచ్చే రెండు నెలల్లో ప్రతి జిల్లాలో కోటి పని దినాలు (పీడీస్‌) సాధించి తీరాలి. 
నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలో వేజ్‌ కాంపోనెంట్‌ ఇంకా పెరగాల్సి ఉంది.

గ్రామ సచివాలయాల నిర్మాణం:
10,929 భవనాలకు అనుమతి వచ్చి, నిర్మాణాలు మొదలు కాగా, ఇప్పటి వరకు కేవలం 6057 భవనాలు మాత్రమే దాదాపు పూర్తయ్యాయి. మరో 1035 భవనాల నిర్మాణం తుది దశలో ఉండగా, 613 భవనాల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి, 
నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలలో పనుల్లో చాలా జాప్యం జరుగుతోంది. కడప, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పనులు ఆలస్యం అవుతున్నాయి.
ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం అన్ని గ్రామ సచివాలయాల భవనాలు వచ్చే జూన్‌ చివరి నాటికి పూర్తి చేయాలి.

రైతు భరోసా కేంద్రాలు:
10,408 భవనాల నిర్మాణానికి అనుమతి రాగా, వాటి పనులు మొదలైనా కేవలం 2649 మాత్రమే పూర్తయ్యాయి. 139 భవనాల పనులు తుది దశలో ఉండగా, 640 భవనాల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి.
కృష్ణా, విశాఖపట్నం, అనంతపురంతో పాటు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయి.
ఈ భవనాల పనులన్నీ కూడా ఈ ఏడాది జూలై నాటికి పూర్తి కావాల్సి ఉంది.

డాక్టర్‌ వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (రూరల్‌):
8585 భవనాలకు గానూ ఇప్పటి వరకు 1755 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 63 భవనాల పనులు తుది దశలో ఉండగా, 400 భవనాల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి . ఇంకా 4118 భవనాల పనులు శ్లాబ్‌ వేసే వరకు జరిగాయి.  
అన్ని క్లినిక్‌ల నిర్మాణం ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి కావాల్సి ఉంది.
అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, కడప, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయి.

ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం:
రాష్ట్రంలో మొత్తం 9,899 బీఎంసీయూల అవసరం ఉండగా, 9,538 భవనాల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడం జరిగింది.
వాటిలో తొలి దశలో చేపట్టిన 2,633 భవనాలతో సహా, మొత్తం 4840 భవనాల పనులు మొదలయ్యాయి. 
తొలి దశలో చేపట్టిన 2,633 బీఎంసీయూలను నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలి.
రాష్ట్రంలో అమూల్‌ ఇప్పటికే పాల సేకరణ మొదలు పెట్టింది.

అంగన్‌వాడీ కేంద్రాలు:
మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలలో 27,438 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
నాడు–నేడు మొదటి దశలో కొత్తగా 4706 అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు, ప్రస్తుతమున్న మరో 3341 అంగన్‌వాడీల స్థాయి పెంచే పనులు కొనసాగుతున్నాయి.
వీటికి సంబంధించి 3928 భవనాల నిర్మాణం పనులు సాగుతున్నాయి. వాటిని లక్ష్యానికి అనుగుణంగా వచ్చే జూన్‌ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలో పనుల్లో జాప్యం జరుగుతోంది. కాబట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిపై దృష్టి పెట్టాలి.

3). వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు:
రాష్ట్రంలో మొత్తం 560 వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ అవసరం ఉండగా,  వాటిలో ఇప్పటికే ఉన్న 205 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టి, అభివృద్ది చేయాల్సి ఉంది. 
ఇంకా కొత్తగా 353 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉంది. వాటిలో 311 భవనాల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, మిగిలిన వాటి టెండర్లు పూర్తి చేయాల్సి ఉంది.

4). ఇళ్ల స్థలాల పట్టాలు:
రాష్ట్రంలో మొత్తం 30,28,346 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా, వాటిలో ఇప్పటి వరకు 28,54,983 పట్టాల పంపిణీ జరిగింది. ఇది 94 శాతం కాగా, ఇంకా 1,73,363 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది.
మొత్తం 17,053 జగనన్న కాలనీల్లో 16,450 కాలనీలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మొత్తం పూర్త‌వుతుంది.
నెల్లూరు, గుంటూరు, విజయనగరం, వైయస్సార్‌ కడపతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పెండింగ్‌లో ఉంది.  ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 15 రోజుల్లో వాటన్నింటినీ పూర్తి చేయాలి.

90 రోజుల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు:
ఇళ్ల స్థలాల కోసం మొత్తం 5,48,690 దరఖాస్తులు  రాగా, వాటిలో 51,859 అర్హులని గుర్తించారు.
మరో 2,21,127 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీఆర్వోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమషనర్లు, సబ్‌ కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్ల వద్ద ఆ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అర్హులుగా గుర్తించిన 51,859 దరఖాస్తులను వచ్చే 15 రోజుల్లో పరిష్కరించాలి.
వారిలో 14,410 మందికి ఇప్పుడున్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయవచ్చు.
మరో 6,004 మందికి ప్రభుత్వ భూముల్లో కొత్తగా వేస్తున్న లేఅవుట్లలో ఇవ్వనుండగా, 31,445 మంది కోసం కొత్తగా భూసేకరణ జరపాల్సి ఉంది.
కాబట్టి 31,445 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూసేకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.  
దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి మన లక్ష్యం మేరకు  90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలి.

ఇళ్ల నిర్మాణం:
తొలి విడతగా మొత్తం 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాటిలో 15.10 లక్షలు అర్బన్‌ ప్రాంతాల్లో (యూఎల్‌బీ, యూడీఏ) ఉన్నాయి.
14.89 లక్షల మందికి ఇళ్లు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తి అయింది.
కాగా, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పూర్తి కాకపోవడంతో 71 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయలేదు. వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ డీపీఆర్‌లు సిద్దం చేసి పంపండి.
ప్లాట్ల డీమార్కింగ్‌ లేకపోవడం, సరిహద్దుల రాళ్లు పాతకపోవడం వల్ల 742 లేఅవుట్లలో 1.46 లక్షల ప్లాట్ల జియో టాగింగ్‌ జరగలేదు. వాటన్నింటినీ వెంటనే పూర్తి చేయాలి.
ఏపీ హౌజింగ్‌ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల నమోదు కేవలం 71 శాతం వరకు పూరై్తంది. దాన్ని కూడా పూర్తి చేయాలి.
నాన్‌ యూఎల్‌బీలలో ఉపా«ధి హామీ కింద జాబ్‌ కార్డుల మ్యాపింగ్‌ కూడా 75 శాతమే పూరై్తంది. దాన్ని కూడా పూర్తి చేయాలి.
వీటన్నింటినీ మే 15 నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలి.

లేఅవుట్లలో నీటి సరఫరా వ్యవస్థ. విద్యుద్దీకరణ:
మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన 8905 లేఅవుట్లలో 8668 లేఅవుట్లలో నీటి సరఫరా చేయాల్సి ఉంది.
కాగా వాటిలో 6280 లేఅవుట్లలో పనులు మొదలు కాగా, 1532 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి.
మిగిలిన లేఅవుట్లలో కూడా వెంటనే ఆ పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. 
పెండింగ్‌లో ఉన్న 1549 లేఅవుట్లలో టెండర్లు పూర్తి చేయాలి. టెండర్లు పూరై్తన 839 లేఅవుట్లలో పనులు మొదలు పెట్టాలి. 
ఒక ఉద్యమ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి, అన్ని ఇళ్ల నిర్మాణాల పనులు మే 15 నాటికి మొదలయ్యేలా కలెక్టర్లు శ్రద్ధ చూపాలి.

అధికారుల నియామకం–మోడల్‌ హౌజ్‌లు:
ఇందుకోసం ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీకి జిల్లా లేదా డివిజన్‌ స్థాయిలో ఉన్న సీనియర్‌ అధికారిని నియమించాలి. ఆ అధికారులు వారానికి ఒకసారి అయినా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలి.
ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా మోడల్‌ హౌజ్‌ నిర్మించాలి. ఇప్పటికే 4374 లేఅవుట్లలో మోడల్‌ హౌజ్‌ల నిర్మాణం మొదలు కాగా, మిగిలిన 4500 లేఅవుట్లలో కూడా వెంటనే ఆ పనులు మొదలు కావాలి.

ఇళ్ల నిర్మాణాలు:
తొలి దశలో చేపట్టిన 14.89 లక్షల ఇళ్లకు గానూ ఇప్పటికే 90,105 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా మొదలు కావాలి.
ఆ మేరకు కలెక్టరు వెంటనే అంచనాలు రూపొందించి, డీపీఆర్‌లు సిద్ధం చేయాలి. 
ఏదేమైనా మొదటి దశలో చేపట్టిన అన్ని ఇళ్ల నిర్మాణాలు మే 31 నాటికి కచ్చితంగా మొదలు కావాలి.

5). స్పందన సమస్యలు:
స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు 2,19,81,131 సర్వీస్‌ రిక్వెస్టులు రాగా, వాటిలో 2,14,78,165 పరిష్కరించారు. (97.71శాతం).
నిర్దేశించిన గడువులోగా 1,83,68,988 దరఖాస్తులను పరిష్కరించగా, కాస్త ఆలస్యంగా 31,09,166 అర్జీలను పరిష్కరించడం జరిగింది.
పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

 శానిటేషన్‌ (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు), వీధి దీపాలు, తాగు నీటి సరఫరా.
వీటిని కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి. ప్రతి వారం సమీక్షించుకోవాలి. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.
ఇంకా చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్‌ రిడ్రెస్సల్‌ చాలా ముఖ్యం
అంటే మొక్కుబడిగా కాకుండా, నిర్దిష్టంగా దరఖాస్తులను పరిష్కరించాలి. 

ఈనెల, వచ్చే నెల కార్యక్రమాలు:
రేపు (ఏప్రిల్‌ 28వ తేదీ) జగనన్న వసతి దీవెన
మే 13న రైతు భరోసా
మే 18న మత్స్య కార భరోసా
మే 25న గత ఏడాది (2020) ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్సు డబ్బు చెల్లింపు

    డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top