వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

ప్రకాశం: ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్దే ఇరిగేషన్‌ అధికారులు, మంత్రులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్‌ తయారు చేశారు. 

వెలిగొండకు మంచి రోజులు
 వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా వరప్రదాయని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అత్యధికంగా నిధులు కేటాయించి పనులు వేగంగా చేయించగలిగారు. 2005 నుంచి 2009 వరకు రిజర్వాయర్, కాలువలు, పైపులైన్ల నిర్మాణ పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే 2009 సెప్టెంబర్‌ 2న వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందడంతో వెలిగొండ పనులకు గ్రహణం పట్టింది. 

టీడీపీ పాలనలో నత్తనడకన.. 
2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వెలిగొండ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ధనార్జనే ధ్యేయంగా వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను వాడుకున్నారు. గతంలో రెండో టన్నెల్‌ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి అంచనాలు విపరీతంగా పెంచి తన బినామీ, అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ«కు అప్పగించారు. అయినా ఆ సంస్థ పనులను సక్రమంగా చేయలేదు. అంచనాలు పెంచి ప్రజాధానాన్ని లూటీ చేయాలని వేసిన పన్నాగం తర్వాత అధికారం కోల్పోవడంతో బెడిసి కొట్టింది.

జూన్‌లోగా నీరిచ్చేందుకు చర్యలు
వెలిగొండ ప్రాజెక్టులోని టన్నల్‌ పనులు పూర్తి చేసి ఈ ఏడాది జూన్‌లోగా నీరు ఇచ్చే విధంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకున్నారు.  ప్రకాశం జిల్లా బి. చెర్లోపల్లి వద్ద నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రారంభమై ప్రకాశం జిల్లాలోని 5 మండలాల్లో 62వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి రూపొందించారు. ఈ కాలువ 12.80 మీటర్ల వెడల్పుతో 48.3 కిలో మీటర్ల పొడవుతో త్రిపురాంతకం వద్ద ముగుస్తుంది. ఈ పనులను వేగవంతం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Back to Top