అనుకున్న సమయంలోగా లక్ష్యాలను చేరాలి

సమగ్ర భూసర్వేకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: ‘వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘శాశ్వత భూహక్కు–భూరక్ష సర్వేపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిర్దేశించిన సమయంలోగా అనుకున్న లక్ష్యాలను చేరాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సమగ్ర భూ సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా సిగ్నల్స్‌ సమస్యలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సర్వే ఆలస్యం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అన్ని సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలని ఆదేశించారు. అన్ని రకాల సర్టిఫికెట్లు సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉంచాలన్నారు. డిజిటల్‌ లైబ్రరీని కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.‌ఎస్.రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, రెవెన్యూ(సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్ లాండ్ రికార్డ్స్‌)  కమిషనర్‌ సిద్దార్ధజైన్, ఐజీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఎం వి వి శేషగిరిబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Back to Top