మద్యపానాన్ని నిరుత్సాహపరచడమే లక్ష్యం

కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కరోనా నియంత్రణపై సమీక్ష

తాడేపల్లి: మద్యపానాన్ని నిరుత్సాహపరచడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మద్యం ధరలు 75 శాతం పెంచామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అలాగే కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ..మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అందులో భాగంగానే ధరలు పెంచినట్లు చెప్పారు. ఇప్పటికే 13 శాతం మద్యం దుకాణాలు రద్దు చేసినట్లు తెలిపారు. రూమ్‌ పర్మిట్లు కూడా రద్దు చేశామన్నారు. మద్యం  అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే చేపట్టాలని సూచించారు. మద్యం అక్రమ రవాణా జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కరోనా పరీక్షల్లో మనమే నంబర్‌ వన్‌
దేశంలో కరోనా పరీక్షల నిర్వాహణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. ప్రతి మిలియన్‌ జనాభాకు 2,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 11 జిల్లాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని, అన్ని ఆసుపత్రుల్లో ట్రూనాట్‌ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. గ్రామ సచివాలయాల్లో లక్ష బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించామని, ఇప్పటికే 40 వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వలస కూలీలను రాష్ట్రానికి రప్పించామన్నారు. త్వరలోనే విలేజ్‌ క్లినిక్‌లు ప్రారంభిస్తామని చెప్పారు.

టెలీ మెడిసిన్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌
రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెలీ మెడిసిన్‌కు పాజిటివ్స్‌ రెస్పాన్స్‌ వస్తున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. టెలీ మెడిసిన్‌ ద్వారా రోగులకు ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం 24 గంటల్లో మందులు అందజేయాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ద్విచక్రవాహనాలు, థర్మల్‌ బాక్స్‌లు  అందుబాటులో ఉంచుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.

జూన్‌ 1 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 1వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అడ్వజరీ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీల సూచనల మేరకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌బీకేల్లోనే విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. మత్స్యకార, రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. అర్హులందరికీ ఈ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల్లోనే అర్హుల వివరాలు నమోదు చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో వివక్ష, అవినీతికి తావు లేకుండా చూడాలన్నారు. ఈ-క్రాప్‌ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద రైతులకు రుణాఉల మంజూరు చేయాలని ఆదేశించారు.

Back to Top