రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న ప్రభుత్వం మనది

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా’తో కౌలు రైతులకు సైతం పెట్టుబడి సాయం అందిస్తున్నాం

దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న వారికీ తోడుగా నిలబడ్డాం

నేడు 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్ల సాయం

2023–24 సీజన్‌లో తొలి విడత సాయంగా రూ.7,500 చొప్పున జమ చేస్తున్నాం

పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.11 కోట్లు జమ

ఈ నాలుగేళ్ల పాలనలో 5.28 లక్షల మంది కౌలు రైతులకు, 3.99 లక్షల మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన రైతులకు రూ.1,122 కోట్ల పెట్టుబడి సాయం 

రైతు భరోసా ద్వారా 52.50 లక్షల మంది రైతులకు మంచి జరిగిస్తూ రూ.31 వేల కోట్లను అందించాం

హెక్టార్‌లోపు ఉన్న 70 శాతం మంది రైతులకు రైతు భరోసా సాయం ఎంతోమేలు చేస్తుంది

ఈ నాలుగేళ్ల పాలనలో రైతన్నకు తోడుగా అనేక గొప్ప మార్పులు తీసుకువచ్చాం

ఆర్బీకేల ద్వారా రైతన్నకు అండగా నిలిచాం.. ప్రతి ఎకరా ఈ–క్రాప్‌ నమోదవుతోంది

రైతులకు అదనపు ఆదాయం కోసం అమూల్‌ను తీసుకువచ్చాం

పగటిపూట ఉచిత విద్యుత్‌ కోసం రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేశాం

తాడేపల్లి: ప్రతి దశలోనూ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నామని, రైతన్నకు తోడుగా ఈ నాలుగేళ్ల పాలనలో అనేక గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా’ సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పారు. వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా కౌలు రైతులకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద సీసీఆర్‌సీ కార్డులు పొందిన  1,46,324 మంది కౌలు రైతుల ఖాతాల్లో రూ.109.74 కోట్ల పంట పెట్టుబడి సాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్‌ సీజన్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.11 కోట్లు జమ చేశారు. రైతులను, కౌలు రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..
దేవుడి దయతో రెండు మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది కౌలు రైతులు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న కౌలు రైతులకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద 2023–24కు సంబంధించిన తొలి విడత పెట్టుబడిసాయం నేడు అందిస్తున్నాం. రెండవది.. ఈ ఖరీఫ్‌సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీని సీజన్‌ ముగిసేలోపు రైతులకు అందించే మరో మంచి కార్యక్రమం అమలు చేస్తున్నాం. 

కౌలు రైతులకు కూడా ఇంతగా తోడుగా నిలబడే ప్రభుత్వం దేశంలో బహుశా ఎక్కడా లేదు. రైతులతో పాటు ఏ వ్యవసాయ భూమి నిరుపేదలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు.. ప్రతి పదం ముందు నా అని సంబోధిస్తూ అన్ని రకాలుగా వారికి తోడుగా, అండగా నిలబడుతున్న ప్రభుత్వం మనది. 

అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ రైతులకు అండగా నిలబడుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వడమే కాకుండా భూములను సాగుచేసుకుంటున్న రైతులకు కూడా తోడుగా నిలబడ్డాం. దేవాదాయ భూములను సాగుచేసుకుంటున్న వారికి కూడా క్రమం తప్పకుండా వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఏటా పెట్టబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. 2023–24 సీజన్‌కు సంబంధించి కౌలు రైతుల కోసం మంచి చట్టాన్ని తీసుకువచ్చాం.. రైతుకు నష్టం అనేది జరగకుండా 13 నెలల పాటు కౌలు రైతులకు సంబంధించిన సీసీఆర్‌సీ కార్డు (కౌలు రైతు లీజ్‌ డాక్యుమెంట్‌ లాంటిది) గ్రామ సచివాలయంలోనే వాటిని అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు నష్టం కలగకుండా ఉంటుంది.. సీసీఆర్‌సీ కార్డు కౌలు రైతులకు ఇచ్చిన పక్షాన రైతులకు రావాల్సిన అందాల్సిన సొమ్ము అందిస్తూ.. సీసీఆర్‌సీ కార్డు పొందిన కౌలు రైతులకు కూడా రైతు భరోసాతో పాటు మిగిలిన అన్ని ప్రయోజనాలు అందేలా మంచి చట్టం తీసుకువచ్చాం. సీసీఆర్‌సీ కార్డులను గ్రామ సచివాలయ పరిధిలోనే అందుబాటులోకి తీసుకువచ్చి.. తద్వారా కౌలు రైతులకు, రైతులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చి కౌలు రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం. 

రైతు సమ్మతితో సీసీఆర్‌సీ కార్డులు పొంది కౌలు చేసుకుంటున్న రైతులందరికీ ఈరోజు తొలి విడత రూ.7500 సొమ్మును పెట్టుబడి సాయంగా అందిస్తున్నాం. ఈ మేరకు 1,46,324 మంది సీసీఆర్‌సీ కార్డు పొందిన కౌలు రైతులకు తోడుగా, అండగా నిలబడుతూ మొదటి విడత పెట్టుబడి సాయంగా రూ.109 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ డబ్బు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది. 

ఇలా 50 నెలల పాలనలోనే దాదాపుగా 5.28 లక్షల మంది కౌలు రైతులకు, అదే విధంగా 3.99 లక్షల మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన రైతులకు మంచి జరిగిస్తూ రూ.1,122 కోట్లను నేరుగా అందించాం. ఈ సొమ్ము పంట పెట్టుబడి సాయం కింద ఉపయోగపడేలా మంచి చేయగలిగాం. 

2019లో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 50 నెలల కాలంలోనే అక్షరాల వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ అనే ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే అక్షరాల 52.50 లక్షల మంది రైతులకు మంచి జరిగిస్తూ దాదాపు రూ.31 వేల కోట్లను నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేయగలిగామని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తున్నాను. 

రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు గమనిస్తే.. రాష్ట్రంలో ఈరోజు అర హెక్టార్‌ (1.25 ఎకరా)లోపు ఉన్న రైతులు ఎంతమంది అని చూస్తే.. దాదాపు 60 శాతం మంది రైతులున్నారు. ఒక హెక్టార్‌ వరకు తీసుకుంటే.. 70 శాతం పైచిలుకు ఉంటారు. రూ.13,500 పెట్టుబడి సాయం 60 శాతం మంది రైతులకు 80 శాతం పంటలకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల వారు బయట ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. సమయానికి మేలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తున్నాం. పంట వేసే సమయానికి, పంట కోసే సమయానికి కరెక్ట్‌గా వారి చేతుల్లో డబ్బులు పడటంతో వారి కాళ్ల మీద వారు నిలబడుతున్నారు. వ్యవసాయం నష్టపోకుండా చేయగలిగే పరిస్థితి వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా రాష్ట్రంలో నాలుగేళ్లుగా అమలవుతోంది. రూ.13,500 సొమ్ము ఒక హెక్టార్‌ వరకు ఉన్న 70 శాతం మంది రైతులకు ఎంతోమేలు చేస్తుంది. 

ఇన్‌పుట్‌ సబ్సిడీలకు సంబంధించి కూడా రైతులకు మంచి చేస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి భారీ వరదలు చూశాం. వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఈ సీజన్‌ (జూన్‌–ఆగస్టు) ముగిసేలోపు దాదాపుగా 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు నష్టపోయిన దాదాపుగా 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా వెంటనే రూ.11 కోట్లు వారి చేతుల్లో పెట్టడం జరుగుతుంది. రైతు నష్టపోకుండా.. ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌ ముగిసేలోపు రైతులకు తోడుగా ఉండే గొప్ప కార్యక్రమం వల్ల ఈ 50 నెలల కాలంలోనే అక్షరాల రూ.1977 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా సరైన సమయంలో అందించాం. రైతు నష్టపోకుండా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, రైతుకు తోడుగా ప్రభుత్వం ఉందనే భావన కలిగించే కార్యక్రమం ద్వారా మంచి చేయగలిగాం. 

గోదావరి వరదల్లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.11 కోట్లు ఇవ్వడమే కాకుండా.. గోదావరి వరదల్లో నష్టపోయిన వారికి ఇప్పటికే రూ.38 కోట్లు వరదల పరిహారం కార్యక్రమంలో భాగంగా సాయం అందించాం. వరదల వల్ల నష్టపోయిన రైతులు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే ఆదుకుంటూ.. మళ్లీ వారు పంట వేసుకునేందుకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసి వారికి తోడుగా నిలబడ్డాం. 

రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు చూడగలిగామని గమనిస్తే.. 

ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ మన కళ్ల ఎదుటే కనిపిస్తుంది. దాదాపుగా 10,778 ఆర్బీకేలు ఉన్నాయి. గ్రామస్థాయిలో సచివాలయం పక్కనే ఆర్బీకే.. దాంట్లో అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ అక్కడే కూర్చొని రైతన్నకు సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్‌ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం జరుగుతుంది. కియోస్క్, కల్తీ లేని విత్తనాలు, ఎరువులు సైతం ఆర్బీకేల నుంచి సరఫరా చేసే గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోనే కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారానే ఈ–క్రాప్‌ పంట నమోదు జరుగుతుంది. పారదర్శకంగా ఏ ఎకరాలో, ఏ పంట, ఎవరు వేశారో ఏకంగా ఫిజికల్, డిజిటల్‌ అక్నాలజ్‌మెంట్‌ ఇస్తూ ఆర్బీకేలో ఈ–క్రాప్‌ డేటా నమోదవుతుంది. సోషల్‌ ఆడిట్‌లో లిస్టులు మొత్తం డిస్‌ప్లే అవుతున్నాయి. ఏ ఒక్కరికైనా మంచి జరగకపోతే వెంటనే ఎలా ఫిర్యాదు చేయాలో అక్కడే రాసి ఉంటుంది. వచ్చిన ఫిర్యాదులను వెంటనే రీవెరిఫై చేసి మళ్లీ వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

రైతన్నకు నష్టం జరగకుండా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకే ద్వారా జరుగుతుంది. గిట్టుబాటు ధర ఎంతో ఆర్బీకేల్లోనే జాబితా ప్రదర్శించి, కనీస గిట్టుబాటు ధర పడిపోతే వెంటనే ఆర్బీకేలు జోక్యం చేసుకొని రైతుకు సాయంగా పంట కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతుంది. 

ధాన్యం కొనుగోలు గతంలో కనీస మద్దతు ధర రాని పరిస్థితి నుంచి ఈరోజు ఎంఎస్‌పీ ఇవ్వడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు ఇవి కూడా ఎకరాకు రూ.10 వేల చొప్పున అదనంగా రైతుల చేతుల్లో పెట్టడం జరుగుతుంది.

పంట నష్టపోయిన అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే అడుగులు ఈ నాలుగేళ్లలో పడ్డాయి. ఏ పంట వేసినా ఈ–క్రాప్‌ నమోదవుతుంది. ఇన్సూరెన్స్‌ ఆటోమెటిక్‌గా నమోదవుతోంది. ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్‌ వచ్చే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. రైతుల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వారికి తోడుగా ఉండే కార్యక్రమం ఈ నాలుగు సంవత్సరాల్లోనే జరిగింది. 

రైతులకు ఉచిత పంటల బీమా, 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ పగటిపూటే ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈనాలుగు సంవత్సరాల కాలంలోనే వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత పగటిపూటే రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇవ్వాలంటే ఇవ్వలేం.. 17 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేస్తే తప్ప చేయలేమని డిపార్టుమెంట్‌ చెబితే.. ఆ రూ.1700 కోట్లను ఖర్చు చేసి ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేసి ఆ పిమ్మట రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటి పూటే కరెంట్‌ ఇస్తున్న పరిస్థితి ఈ 50 నెలల కాలంలో జరిగింది. 

రైతు సాగు సమయంలో అదనపు రావాలంటే.. వ్యవసాయం ఒక్కటే కాకుండా గేదెలు, ఆవుల నుంచి వచ్చే ఆదాయం కూడా మెరుగ్గా ఉండాలి.. అప్పుడే రైతు బతకగలుగుతాడనే ఉద్దేశంతో సహకార రంగంలో గొప్ప మార్పు తెస్తూ అమూల్‌ను తీసుకువచ్చాం. అమూల్‌ వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏకంగా 8 సార్లు పాల రేట్లు పెరగడంతో ఏకంగా లీటర్‌ గేదె పాలు రూ.22, ఆవు పాలు రూ.11 పెరిగింది. వారు పెంచారు కాబట్టి మిగిలిన డెయిరీలు కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా ఈ నాలుగు సంవత్సరాల మనందరి ప్రభుత్వంలో జరిగిన మార్పులకు తార్కాణం. ఇవన్నీ మన కళ్ల ఎదుట ప్రస్పుటంగా కనిపించే మార్పులు. 

ప్రభుత్వం అందించే సహాయ, సహకారాలతో రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

Back to Top