కరోనా వ్యాధి సోకితే అంటరానితనంగా భావించొద్దు

జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నయమవుతుంది
 

కరోనా టెస్ట్‌ల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది

కేవలం 63 మండలాల్లోనే రెడ్‌జోన్లు

559 మండలాల్లో ఒక్క కేసు లేదు

రెడ్‌జోన్లలో 1.61 శాతం మాత్రమే పాజిటివ్‌ కేసులు

81 శాతం కేసులు ఇళ్లలోనే నయం

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..సామాన్యులకు కష్టం రాకుండా చర్యలు

రాష్ట్రం కోసం కూడా ప్రార్థించండి

ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: కరోనా వైరస్‌ సోకిందని అంటరానితనంగా భావించవద్దని, రోగుల పట్ల వివక్ష చూపొద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా ఎవరికైనా వస్తుంది..వెళ్తుందని, ఇది భయంకరమైన రోగంగా భావించవద్దన్నారు. కరోనా మానవ జీవనంలో అంతర్భాగమవుతుందన్నారు. జాగ్రత్తలు పాటిస్తే, మందులు వాడితే వ్యాధి నయమవుతుందని, మన ఇళ్లలో ఉండే పెద్దలను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని సీఎం సూచించారు.కరోనా పరీక్షలు నిర్వహించడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని, రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కేవలం 1.61 శాతం మాత్రమే ఉందని, దేశంలో 4 శాతం నమోదు అయినట్లు చెప్పారు. సోమవారం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీడియా ద్వారా మాట్లాడారు.

సహకరించిన అందరికి ధన్యవాదాలు
కరోనా నియంత్రణకు సహకరించిన ప్రతి ఒక్కరికి  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి «దన్యవాదాలు తెలిపారు. మార్చి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేయగా నెల రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొంటునే ముందుకు వెళ్లగలిగామని తెలిపారు. కరోనా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని బాగా పెంచుకోగలిగామన్నారు. ఒక్క రోజులోనే 6 వేల మందికి టెస్టులు చేయగలిగామన్నారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1,396 మందికి కరోనా పరీక్షలు చేయగలిగామన్నారు. దేశంలో అయితే కేవలం 451 మందికి మాత్రమే పరీక్షలు చేయగలిగారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 74,551 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.

63 మండలాల్లో రెడ్‌జోన్లు
రాష్ట్రంలో కేవలం 63 మండలాల్లో మాత్రమే రెడ్‌జోన్లు గుర్తించామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. 54 మండలాలు అరెంజ్‌ జోన్, మిగిలిన 559 మండలాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయన్నారు.రాష్ట్రంలో 5 క్రిటికల్‌ కేర్‌ కోవిడ్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాలో ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్వంటైన్‌ సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించామని, అక్కడి వారికి పౌష్టికాహారం, మంచి వాతావరణం కల్పించామన్నారు.  రాష్ట్రంలో 40 వేల బెడ్స్, 20 వేల సింగిల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రుల్లో పీపీఈ, ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లు సమృద్ధిగా ఉంచామన్నారు. ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, టెక్నిషియన్లను నియమించామని, మే 15 నాటికి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తామన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..
లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సామాన్యులకు ఏ కష్టం, నష్టం కలుగకుండా అన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. ఇప్పటికే ప్రతి ఇంటికి రూ.1000 ఆర్థిక సాయం చేశామన్నారు. రెండు విడతల్లో రేషన్‌ ఇచ్చామని, 29వ తేదీ నుంచి మరో విడత రేషన్‌ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 3సార్లు కుటుంబ సర్వే నిర్వహించామని తెలిపారు.

వాస్తవం ఏంటంటే..
కరోనా కట్టడికి ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా..వాస్తవం ఏంటంటే ఈ వైరస్‌ కట్టడి చేయడం కష్టమే అన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిన రోజులు వచ్చాయని అందరం గమనించాలన్నారు. ఇది భయంకరమైన రోగమన్న భావన తీసివేయాలన్నారు. ఇది మన జీవనంలో అంతర్భాగమని తెలిపారు. స్వైన్‌ఫ్లూ, చికెన్‌ ఫాక్స్‌ మందులతో  నయం చేయవచ్చు కానీ, కరోనా వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే నయం అవుతుందన్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా కరోనా వ్యాధి వస్తోంది. మన ఇంట్లో పెద్దవాల్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 81 శాతం కేసులు ఇంట్లోనే నయం అయ్యాయని సీఎం తెలిపారు. ఇందులో 14 శాతం మాత్రమే ఆసుపత్రులకు వచ్చాయని, 4 శాతం మాత్రమే ఐసీయూకి వచ్చాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకి చనిపోయింది కేవలం 3 శాతం మాత్రమే అన్నారు. ఇది ఒక అంటరాని రోగం కాదని, ఎవరూ వివక్ష చూపొద్దన్నారు. ఇది ఎవరికైనా రావచ్చు అని, లక్షణాలు కనిపిస్తే 104, 14410కు ఫోన్‌ చేసి డాక్టర్లను సంప్రదించాలన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను సంప్రదిస్తే వాళ్లు చూసుకుంటారన్నారు. చనిపోయిన కేసుల్లో కూడా బీపీ, ఆస్తమా వంటి లక్షణాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారన్నారు.

కేవలం 1.61 శాతం మాత్రమే పాజిటివ్‌ కేసులు
రాష్ట్రంలో కేవలం 1.61 శాతం మాత్రమే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు.దేశంలో 4 శాతం ఉందన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం ఏపీనే అని గర్వంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ చేస్తున్నామని, వీటిని పొదుపు సంఘాలు తయారు చేస్తున్నాయని చెప్పారు.

ప్రజా రవాణా కాస్త ఆలస్యం కావచ్చు..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజా రవాణా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. పరిశ్రమలు పని చేస్తాయని, వ్యవసాయం యధావిధిగా సాగుతుందన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలన్నారు. రాష్ట్రం కోసం ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ కూడా తమ కుటుంబ అవసరాలతో పాటు రాష్ట్రం కోసం ప్రార్థించాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న గ్రామ వాలంటీర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలు, డాక్టర్లు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

Back to Top