ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి

 ఏప్రిల్‌ 14 వరకు ప్రయాణాలు వద్దు
 

మనవాళ్లనే మనం ఆపే పరిస్థితి ఇబ్బందికరం

అందరూ సామాజిక దూరం పాటించాలి

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నాం

ఎలాంటి ఇబ్బంలున్నా హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయండి

ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

తాడేపల్లి: మన వాళ్లంతా..ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడే ఉండాలని సూచించారు. రాబోయే మూడు వారాలు ఎక్కడివారు అక్కడే ఉండకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలైనా అందరూ అనుసరించాలని కోరారు. ఎవరికి ఏ ఇ బ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
 
కరోనా లాంటి వైరస్‌ వందేళ్లకు ఓసారి వస్తుందేమో?. కేవలం క్రమశిక్షణతోనే గెలవగలం. ఇలాంటి వైరస్‌ను సమర్ధంగా ఎదుర్కొవాలి. అలా ఎదుర్కోలేకపోతే భావి తరాలపై ఆ ప్రభావం పడుతుంది. నిన్న సాయంత్రం జరిగిన ఘటనలు మనసును కలిచి వేశాయి. పక్కన తెలంగాణ బార్డర్‌. అక్కడి నుంచి చూస్తే చాలా మంది తెలంగాణ బార్డర్‌ నుంచి మనవాళ్లు..ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిని చూసినప్పుడు నిజంగా మనవాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించలేమా అన్నది మనసుకు చాలా కష్టమనిపించింది. ఒక్కసారి మనమంతా ఆలోచన చేయాలి. 

 

అందరం కూడా ఈ రోజు ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యే పరిస్థితిలోకి వెళ్లలేకపోతే ఈ వ్యాధిని మనం నివారించలేము. ఇవాళ కూడా సరిహద్దు వద్ద ఇదే పరిస్థితి. దయచేసే..మీరు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో..వారంతా అక్కడే ఉండండి. ఒక్కసారి ప్రదేశం మారితే వచ్చేవారు ఎంతమందితో కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. వాళ్లు ఎంత మందితో కలుస్తారు..అన్నది ఆలోచిండానికే భయంగా ఉంటుంది. ఎక్కడి వారు అక్కడే ఉంటే ఈ వైరస్‌ను కట్టడి చేయగలుగుతాం. దేశం అతలాకుతలం అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా కేవలం మూడు వారాలకు సంబంధించిన అంశాలే. ఏప్రిల్‌ 14 వరకు ఇళ్లలోనే ఉండిపోగలిగితే..వైరస్‌ కట్టడి చేయవచ్చు. ఇంట్లో ఉన్న వారికి ఏదైనా సమస్య వస్తే వైద్య సేవలు అందించవచ్చు. దయచేసి ఈ మూడు వారాల పాటు ఎక్కడివారు అక్కడే ఉండండి. 

నిన్న 44 మందిని బార్డర్‌ వద్దకు వచ్చిన వారికి కాదనలేక రాష్ట్రంలోకి అనుమతించాల్సి వచ్చింది. అందరిని కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతున్నాం. వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు వారు ఎవరితో కాంటాక్ట్‌లో ఉన్నారు అన్న డేటా తెలుసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఈ మూడు వారాల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండాలి. పక్కనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా మాట్లాడాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. దేశమంతా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి. అందరూ సహకరించాలి. 

60 ఏళ్లు దాటిన వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సామాజిక దూరం పాటించాలి. నాలుగు చోట్ల కోవిడ్‌-19 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. 450 బెడ్లతో ఐసీయూ ఏర్పాట్లు చేస్తున్నాం. 213 వెంటిలేటర్లు సిద్ధం చేశాం.  80.9 శాతం మంది ఇళ్లలో ఉండి కోలుకునే పరిస్థితి ఉంది. 14 శాతం మంది ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందాలి. నాలుగు శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అవసరం. దయచేసి ఎవరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. 

 

మన రాష్ట్రానికి సంబంధించి 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో 10 శాఖలకు సంబంధించిన వారితో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. హెల్త్‌కు సంబంధించి 104 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వండి. రెండోసారి కూడా సర్వే జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారు, వారి బంధువులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సంబంధమైన జబ్బులు ఉంటే పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని కూడా సఫలీకృతం కావాలంటే అందరూ కూడా ఇళ్లలో ఉండాలి

 

 ప్రతి జిల్లాలో కూడా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. ముగ్గురు మంత్రులు కూడా కంట్రోల్‌ రూమ్‌లో కో-ఆర్డినేట్‌ చేస్తారు. సీఎం ఆఫీస్‌ నుంచి కూడా సమన్వయం చేస్తుంటారు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా.
ఎక్కడి వారు అక్కడే దయచేసి ఉండిపోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికి కూడా ఆహారం కొరత, వసతులు, నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తాం. ఏమైనా ఇబ్బంది ఉంటే 1902కు ఫోన్‌ చేస్తే వెంటనే  అధికారులు స్పందిస్తారని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 

 

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గూడ్స్‌ వెహికల్స్‌ తిరుగుతాయి. వాటిని అనుమతి ఇచ్చాం. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. సరుకులు అయిపోతాయని భయపడాల్సిన అవసరం లేదు. అందరికి సరుకులు అందుతాయి. ప్రతి 2, 3 కిలోమీటర్లకు ప్రజలకు అవసరమైన సరుకులు అందుబాటులో ఉంచుతాం. రైతు బజార్లకు వికేంద్రీకరిస్తున్నాం. అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరుకులు అందుబాటులో ఉంటాయి. అత్యవసరమైతేనే బయటకు రండి. గ్రామాల్లో ఉండే రైతులు, రైతు కూలీలకు విజ్ఞప్తి. పంటలు కోత దశలో ఉన్నాయి. తప్పదు అనుకుంటే పనులకు వెళ్లండి..కానీ అక్కడ కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్‌శాఖ, మున్సిపల్‌ శాఖ అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. బియ్యం, పప్పు ఈ నెల 29వ తేదీ నుంచి పంపిణీ చేస్తాం. ఏప్రిల్‌ 4వ తేదీ ప్రతి ఇంటికి రూ.1000 వాలంటీర్‌ ద్వారా అందజేస్తాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తలా ఓ చెయ్యి వేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం నుంచి చేయాల్సినంత చేస్తాం. డాక్టర్లు, నర్సులు, గ్రామ వాలంటీర్లు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఎలక్ర్టసిటీ సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని సవినయంగా కోరుతున్నాను. ఈ మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోవాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సవినయంగా కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top