విజయవాడ: నిస్వార్థంగా సేవ చేస్తున్న సైనికులు నా వలంటీర్లని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి చేపట్టిందని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైయస్ జగన్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. దాదాపుగా 20 నెలల కిందట.. మనం అధికారంలోకి వచ్చేసరికే మే 30న ప్రమాణస్వీకారం చేశాం. దాని తరువాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వలంటీర్ వ్యవస్థను తీసుకురావడం.. అక్టోబర్ నాటికి సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడం.. ఈ రెండింటిని తీసుకువచ్చి ఎప్పుడు అయితే గ్రామాల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో ఈ వ్యవస్థలను స్థాపించామో.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 20 నెలల కాలంలో రాష్ట్రంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా కూడా చేయొచ్చు అని దేశం మొత్తం మనవైపు చూస్తేలా చేస్తున్నారు.. నా చెల్లెమ్మలు, నా సోదరులు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సహాయపడే మంచి మనసులు. మనసున్న మనుషులందరికీ నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మానవత్వాన్నే మంచితనంగా, మంచితనాన్నే కులంగా మార్చుకొని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పథకాలకు రాష్ట్రంలో గ్రామ గ్రామాన, వాడవాడలా సంధాన కర్తలుగా ఒకవైపున సచివాలయం, మరోవైపున వలంటీర్లు నిస్వార్థంగా రూపాయి కూడా లంచం ఆశించకుండా.. వివక్ష ఏమాత్రం చూపించకుండా.. కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలు చూడకుండా.. చివరకు వాళ్లు మన పార్టీకి ఓటు వేశారా.. లేదా..? అన్నది చూడకుండా ప్రతీ కార్యక్రమం నిస్వార్థం చేస్తున్న నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లకు మనసారా సెల్యూట్. రూరల్‌లో ప్రతి 50 ఇళ్లకు, అర్బన్‌లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్ ఏర్పాటై.. వీరంతా ఆయా వార్డులు, గ్రామాల్లో సచివాలయ వ్యవస్థతో అనుసంధానమై సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ఎంత గొప్పగా సాగుతుందంటే.. దాదాపుగా రాష్ట్రంలో 2.60 లక్షల పైచిలుకు వలంటీర్లు ప్రతి గ్రామ/వార్డు పరిధిలో కనిపిస్తున్నారు. ఇందులో 97 శాతం 35 సంవత్సరాల వయస్సు లోబడి ఉన్నవారే. ఇందులో 53 శాతం మంది నా చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడుతున్నా. మొత్తం వలంటీర్లలో దాదాపు 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదవర్గాలే. పేదరికం తెలిసినవారు.. పేదల బాధలు అర్థం చేసుకున్నవారే. వలంటీర్లకు తోడుగా 1.40 లక్షలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మంది శాశ్వత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. ఇందులో దాదాపుగా 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేదలు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నా. పొద్దున్నే సూర్యుడు ఉదయించక మునుపే.. ఆ అవ్వాతాతల దగ్గరకు వెళ్లాలి.. వాళ్లకు పెన్షన్ చేతులో పెట్టాలి. ఆ అవ్వాతాతలు ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే ఇబ్బందులు పడతారని తెలిసిన మనసున్న వలంటీర్లు. ఆ బాధ తెలియకపోతే.. సూర్యోదయానికి మునుపే 61.73 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు ప్రతి నెలా 1వ తేదీన ఆదివారమైనా, సెలవు రోజు అయినా వలంటీర్ తలుపుతట్టి.. ఆ అవ్వాతాతల చేతుల్లో డబ్బులు పెడుతున్నారు. ఒక చిరునవ్వు, వాళ్ల దీవెనలు మాత్రమే ఆశిస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న గొప్ప సైనికులు నా వలంటీర్లు అని గర్వంగా చెబుతున్నా. దాదాపుగా 32 రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే వలంటీర్లు అంతా వారి పాత్రను పోషిస్తున్నారు. బియ్యం కార్డు, వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, వైయస్‌ఆర్ పెన్షన్, ఇళ్ల స్థలాల పట్టాలు, జగనన్న తోడు, వైయస్‌ఆర్ రైతు భరోసా, వైయస్‌ఆర్ చేయూత, వైయస్‌ఆర్ ఆసరా, వైయస్‌ఆర్ అమ్మఒడి, వైయస్‌ఆర్ ఉచిత పంటల బీమా, వైయస్‌ఆర్ కంటి వెలుగు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, జగనన్న వాహనమిత్ర, వైయస్‌ఆర్ నేతన్న నేస్తం.. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా.. కొన్నింటిలో పూర్తిగా, మరికొన్నింటిలో అవసరం మేరకు సేవలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో వైరస్‌ను ఎదుర్కునేందుకు వలంటీర్ల పాత్ర అంతాఇంతా కాదు. అవినీతి లేకుండా, వివక్షకు తావులేకుండా ఒక కార్యక్రమం చేయడం సాధ్యమేనా..? ఇంతకు ముందు రోజుల్లో మాట్లాడుకునే మాట. కానీ, ఒక వ్యవస్థలో అవినీతి, వివక్షకు తావులేకుండా, కేవలం అర్హత ఉంటే కచ్చితంగా డోర్ దగ్గరికే సంక్షేమ పథకం వస్తుందని చేసి చూపించిన వ్యక్తులు నా వలంటీర్లు అని గర్వంగా చెబుతున్నా. సేవా కార్యక్రమంలో, ఎండ, వాన, చలి ఏవీ లెక్క చేయకుండా.. తూర్పున ఇంకా సూర్యోదయం కాకపోయినా పడమర సూర్యాస్తమయం సమయం అయిపోయినా విధి నిర్వహించాల్సిన రోజుల్లో 2.60 లక్షల మంది చూపించిన చొరవ, చేసిన సేవకు వాళ్లందరినీ ప్రజలు గుర్తించి ఆశీర్వదించడమే కాదు.. ప్రభుత్వం తరఫున గుర్తింపు రావాలి. సేవాదృక్పథంతో ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయపడుతున్న వలంటీర్లను గుర్తించాలని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. - శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఒక అవ్వ.. రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంటే.. వలంటీర్ రమణ అక్కడకు వెళ్లి మరీ ఆ అవ్వకు పెన్షన్ అందించి వచ్చాడు. - ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలో చిలకపాడు గ్రామానికి చెందిన బొల్లినేని వీరనారాయణమ్మ హైదరాబాద్‌లో గుండె చికిత్స చేయించుకుంటే.. మన వలంటీర్ సిద్ధారావు హైదరాబాద్ వెళ్లి మరీ పెన్షన్ ఇచ్చి వచ్చాడు. - చిత్తూరు జిల్లా కమ్మంవారిపల్లె గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి పక్షవాతంతో బెంగళూరులో చికిత్స పొందుతుంటే మన వలంటీర్ భానుప్రకాష్ అక్కడకు వెళ్లి పెన్షన్ అందించాడు. - విజయనగరం జిల్లా గజపతినగరంలో గ్యాస్ స్టవ్ ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలిక గాయపడితే.. వెంటనే వలంటీర్లు సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. తమ జేబులోంచి రూ.2 వేల ఆర్థిక సాయం చేశారు. - గుంటూరు జిల్లా రొంపిచర్లలో అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రాణాలను కూడా లెక్కచేయకుండా మన వలంటీర్ శివకృష్ణ పిల్లలను, వృద్ధులను కాపాడాడు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు చూడకుండా ఎక్కడా కూడా పక్షపాతం చూపకుండా, వివక్ష చూపకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా.. చివరకు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు.. మనం చేసే మంచిమాత్రం ఆగిపోకూడదు.. పైన దేవుడు చూస్తున్నాడని ఒక్కే ఒక్క తపన, తాపత్రయంతో సేవలు అందించిన ప్రతి వలంటీర్‌ను సత్కరించేందుకు ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర ఈ మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,525 మంది వలంటీర్లను సత్కరించనున్నాం. మొదటి కేటగిరీలో సేవా మిత్ర అవార్డు, ఈ కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా 2,18,115 మంది వలంటీర్లను సత్కరించనున్నాం. ప్రతి వలంటీర్‌కు రూ.10 వేల నగదు, ఒక సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ ఇచ్చి.. ప్రభుత్వం మీరు చేసిన మంచిని గుర్తిస్తుందని ప్రతి వలంటీర్‌ను వెన్నుతట్టి ప్రోత్సహించడం. రెండవ కేటగిరీలో.. ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి 5గురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 10 మంది చొప్పున మొత్తం 4 వేల మందికి సేవా రత్న అవార్డుతో సత్కరించనున్నాం. వీరికి రూ.20 వేల నగదు, పతకం, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మూడవ కేటగిరీలో.. ఇంకా కొంత ఎక్కువగా కష్టపడిన వారికి సేవా వజ్ర అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5గురు చొప్పున ఎంపిక చేసిన 875 మంది వలంటీర్లకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నాం. సేవా వజ్ర అవార్డు గ్రహీతలకు రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీ ప్రదానం చేస్తున్నాం. వీటి కోసం ప్రభుత్వం రూ.241 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది కేవలం ఈ సంవత్సరంతో ఆగిపోదు.. ప్రతి సంవత్సరం వలంటీర్ల సత్కారం చేస్తాం. సేవా మిత్ర పొందిన వారు సేవా రత్న కోసం.. సేవా రత్న పొందినవారు.. సేవా వజ్ర కోసం తాపత్రయపడాలని కోరుతున్నా. నేటి నుంచి ప్రతి జిల్లాలో రోజు ఒక నియోజకవర్గం చొప్పున వలంటీర్లకు అవార్డుల ప్రదానం, సత్కార కార్యక్రమం జరుగుతాయి. జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాలుపంచుకొని వలంటీర్లను అభినందిస్తారు. స్వయంగా నేను కూడా మూడు ప్రాంతాల్లో పాల్గొంటా. ఉత్తరాంధ్రలోని ఒక జిల్లా, రాయలసీమలోని మరో జిల్లాలో వలంటీర్ల సత్కార కార్యక్రమంలో పాల్గొంటాను. గొప్ప సేవా భావంతో పనిచేస్తున్న వలంటీర్ వ్యవస్థ మీద కొన్ని సందర్భాల్లో ఎల్లో మీడియా, ప్రతిపక్షంలోని కొంతమంది నాయకులు అవాకులుచవాకులు పేలుతున్నారు. ఎప్పుడైనా మీ జీవితాల్లో మీరు క్రమశిక్షణతో మెలిగినంతకాలం ఎలాంటి విమర్శలకు కూడా బెరవవద్దు. పండ్లు పండే చెట్టు మీదనే రాళ్లు పడతాయని గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని నెరవేర్చండి.. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని గట్టిగా చెబుతున్నా. మీరు చేస్తున్నది.. ఉద్యోగం కాదు.. సేవ అని గుర్తుపెట్టుకోండి. 50 ఇళ్లలోని అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల దీవెనలే మన ఆస్తి అని గుర్తుపెట్టుకోండి.