ఏ ఒక్క రైతు కూడా క‌న్నీరు పెట్ట‌కూడ‌దు

అసెంబ్లీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

చంద్ర‌బాబు యాక్ట‌ర్‌..పచ్చ‌మీడియా క‌థ‌, స్క్రీన్ ఫ్లే, డైరెక్ష‌న్‌

డిసెంబ‌ర్ 31లోగా రైతులకు న‌ష్ట‌ప‌రిహారం అందిస్తాం

వ‌ర్షాల కార‌ణంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం

2020 ఖ‌రీఫ్ నుంచి బీమా బాధ్య‌త‌లు కూడా ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుంది

రైతులు మేలు జ‌రిగేలా అమూల్ సంస్థ‌తో ఒప్పందం

తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎక్క‌డ వ‌ర‌ద‌లు వ‌చ్చినా జ‌గ‌న్ క‌నిపించేవారు

సీబీఎన్ అంటే..క‌రోనాకు భ‌య‌ప‌డే నాయుడు

చంద్ర‌బాబు మొస‌లి క‌న్నీరు కార్చాల్సిన అవ‌స‌రం లేదు

అమ‌రావ‌తి: త‌మ ప్ర‌భుత్వం రైతు ప‌క్ష‌పాతి అని, ఏ ఒక్క రైతు కూడా క‌న్నీరు పెట్ట‌కూడ‌ద‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. చంద్ర‌బాబు రైతుల కోసం మొస‌లి క‌న్నీరు కార్చాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. రైతుకు ఎన్నిక‌ల ముందు ఇస్తామ‌న్న దాని కంటే అద‌నంగా ఇస్తూ అండ‌గా నిలిచామ‌ని, విత్త‌నం నుంచి పంట అమ్ముకునే వ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే చెయ్యి ప‌ట్టి న‌డిపిస్తుంద‌ని హామీ ఇచ్చారు. రైతుల‌కు మేలు చేస్తుంటే ఓర్వ‌లేక చంద్ర‌బాబు, ఎల్లో మీడియా అసెంబ్లీలో డ్రామాను ర‌క్తిక‌టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రో చెప్పార‌ని, ఏదో పేప‌ర్లో రాశార‌ని రైతుల‌కు చేయ‌డం లేద‌ని, త‌న‌కు రైతుల‌తో ఉన్న అనుబంధంతో ఇదంతా చేస్తున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. సోమ‌వారం  అసెంబ్లీలో వ్య‌వ‌సాయ రంగంపై జ‌రిగిన చ‌ర్చ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే..

కాసేప‌టి క్రితం పెద్ద డ్రామాను మ‌న క‌ళ్ల‌తోనే చూశాం. చంద్ర‌బాబు యాక్ట‌రైతే..ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5 క‌థ‌, స్క్రీన్‌ఫ్లే, డైరెక్ష‌న్‌తో రైతులకు ప్ర‌భుత్వం చేసిన మంచిని ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు దుర్భుద్దితో డ్రామాను ర‌క్తి క‌ట్టించారు. ఆ పార్టీ నేత రామానాయుడు మాట్లాడుతుండ‌గా చంద్ర‌బాబు వెంట‌నే అందుకొని..తాను మాట్లాడ‌తాన‌ని ముందుకు వ‌చ్చారు. క్లారిఫికేష‌న్ ఇచ్చిన త‌రువాత మ‌రొక‌రికి మైక్ ఇవ్వ‌రు. నేను ఐదేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌గా ఎప్పుడూ పోడియం వ‌ద్ద‌కు రాలేదు.  రైతుల‌కు ముఖ్య‌మంత్రి ఏం చెప్పారు..దీని వ‌ల్ల రైతుల‌కు మంచి జ‌రుగుతుంద‌న్న వార్త‌లు రేప‌టి పేప‌ర్లో ఉండ‌వు. ఇంత ద‌రిద్ర్య‌మైన మీడియా వ్య‌వ‌స్థ‌, ప్ర‌తిప‌క్ష నేత ఉన్నారు. 
ఒక అనుకోని ప‌రిస్థితి వ‌చ్చింది. కేబినెట్‌లో కూడా నిర్ణ‌యాలు తీసుకున్నాం. ఇవ‌న్నీ జ‌రిగిన త‌రువాత సీఎం ఏం చెబుతారు. మాకు మంచి జ‌రుగుతుంద‌ని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇవేవి చూపించ‌రు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇది రెండో న‌వంబ‌ర్‌, ఈ నెల చివ‌రి నాటికి ఏ రిజ‌ర్వాయ‌ర్ తీసుకున్నా కూడా..గ‌తంలో ఎప్పుడూ లేన‌ట్లుగా క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

గ‌త ప‌దేళ్ల‌లో ఎప్పుడూ లేని విధంగా భూగ‌ర్భ‌జ‌లాలు పెరిగాయి. ఆగ‌స్టు నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు అడ‌ప ద‌డ‌ప కురిసిన వ‌ర్షాల‌కు మ‌న రైతుల‌కు న‌ష్టం జ‌రిగింది. వెంట‌నే ప్ర‌భుత్వం నిజాయితీగా స‌మీక్షించి, వెంట‌నే ఆ సీజ‌న్‌కు సంబంధించిన న‌ష్టం అదే సీజ‌న్‌లో పంట న‌ష్టం ఇచ్చింది. ఇలా ఎప్పుడు జ‌ర‌గ‌లేదు. ఇవ‌న్నీ కూడా ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తుంద‌నో, ప‌త్రిక‌లు ఏదో రాస్తార‌నో ఈ స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు. రైతుల‌కు, నాకు ఉన్న అనుబంధంతో రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వంగా ఈ వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాను. రైతులు న‌ష్ట‌పోతే కార‌ణం ఏమైనా స‌రే..అదే సీజ‌న్‌లో న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డం చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఈ ఏడాది అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల‌కు రూ.143 కోట్లు ఈ అక్టోబ‌ర్ 23న ఇన్‌ఫుట్ స‌బ్సిడీ ఇచ్చాం. మ‌ళ్లీ అక్టోబ‌ర్‌లో వ‌చ్చిన అధిక వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు నెల రోజుల్లోనే న‌వంబ‌ర్ 17న రూ.132 ఇన్‌ఫుట్ స‌బ్సిడీ ఇచ్చాం. మ‌ళ్లీ నిన్న న‌వంబ‌ర్‌లో నివ‌ర్ తుపాన్ కార‌ణంగా పంట‌లు, ఇల్లు, రోడ్లు, చెరువుల‌కు న‌ష్టం వాటిల్లింది. ఈ న‌ష్టాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యాలు తీసుకుంది. 

భారీ వ‌ర్షాల కార‌ణంగా స‌హాయ శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 ఇవ్వాల‌ని మంత్రి వ‌ర్గంలో నిర్ణ‌యించాం. చిన్నా, పెద్ద‌, మూడేళ్లు, ఏడాది పిల్లాడు అయినా స‌రే ప్ర‌తి మ‌నిషికి రూ.500 చొప్పున క‌చ్చితంగా అంద‌రికీ ఇవ్వాల‌ని ఆదేశించాం. ఒక ఇంటికి దాదాపుగా క‌నీసం న‌లుగురు ఉంటే దాదాపుగా రూ.2 వేలు ఇచ్చిన‌ట్లే. నీరు వ‌చ్చిన ప్రాంతాల నుంచి బాధితుల‌ను శిబిరాల‌కు త‌ర‌లించ‌డంతో పాటు ఆర్థిక సాయం చేశాం. ఏరియ‌ల్ స‌ర్వేకు వెళ్ల‌కముందే బాధితుల‌ను ఇళ్ల‌కు పంపించామ‌ని, వాళ్ల ఇంటికి వెళ్లి డ‌బ్బులు ఇస్తామ‌ని క‌లెక్ట‌ర్లు చెప్పారు. పూర్తిగా ఎన్యుమ‌రేష‌న్ డిసెంబ‌ర్ 21లోగా అంద‌జేస్తున్నాం. అంటే నెల‌లోపే ప‌రిహారం అందిస్తాం. నిజంగా ఆ డ‌బ్బు ఆప‌ద‌లో ఉన్న వారికి ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌ళ్లీ పంట వేసుకునేందుకు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు 80 శాతం స‌బ్సిడీలో అంద‌జేస్తున్నాం. ఇళ్ల‌కు జ‌రిగిన న‌ష్టానికి , ప‌డ‌వ‌లు, వ‌ల‌లు న‌ష్ట‌పోయిన వారంద‌రికీ డిసెంబ‌ర్ 15లోగా అంచ‌నాలు పూర్తి చేసి డిసెంబ‌ర్ 31లోగా న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేస్తున్నాం. తుపాను కార‌ణంగా 8 మంది అకాల మ‌ర‌ణం పొందారు. చ‌నిపోయిన కుటుంబాల‌కు ఊర‌ట క‌లిగించేందుకు రూ.5 లక్ష‌ల చొప్పున అంద‌జేశాం. రోడ్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌పై పూర్తి స్థాయిలో అంచ‌న వేయ‌మ‌ని ఆదేశాలు ఇచ్చాం.
ఎక్క‌డైతే క‌రెంటు స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డిందో ..అక్క‌డ యుద్ధ‌ప్రాతిపాదిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌డుతున్నారు. దాదాపు పూర్తిగా మ‌ర‌మ్మ‌తులు చేశారు. 
వ‌ర్షాల కార‌ణంగా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌మ‌ని ఆదేశించాం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ధాన్యం రంగుమారింది. మొల‌క‌లు వ‌చ్చాయి. గ‌తంలో రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖ‌లాలు లేవు. ఇప్పుడు రంగు మారిన ధాన్యంతో పాటు మొల‌కెత్తిన విత్త‌నాలు కూడా కొనుగోలు చేయ‌మ‌ని ఆదేశించాం. రైతులు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఆదుకునేందుకు ఆదేశాలు ఇచ్చాం. ఇవ‌న్నీ కూడా ఆర్‌బీకేల ద్వారా, ఈ క్రాపింగ్ డేటా ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.

ఇన్సూరెన్స్ కూడా మ‌న ప్ర‌భుత్వ‌మే  2020 ఖ‌రీఫ్ నుంచి బాధ్య‌త‌లు తీసుకుంది. 2012కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత చెల్లించాల్సిన ప‌రిస్థితి చూశాం. దీని వ‌ల్ల రైతుల‌కు పంట న‌ష్ట ప‌రిహారం అంద‌ని ప‌రిస్థితిలో ఇన్సూరెన్స్ బాధ్య‌త‌లు కూడా ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుంది. జ‌న‌వ‌రి వ‌ర‌కు కోతలు ఉంటాయి. న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప‌రిహారం అంద‌జేస్తారు. ఫిబ్ర‌వ‌రిలో ప్లానింగ్ డిపార్టుమెంట్ నివేదిక ఇచ్చిన త‌రువాత మార్చి, ఏప్రిల్‌లో ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తామ‌ని మాట ఇస్తున్నాను.ఇంత వ‌ర‌కు చ‌రిత్ర‌లో జ‌ర‌గ‌లేదు. ఇవాళ జ‌రుగ‌బోతోంది.
వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కారణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌కు అదే సీజ‌న్‌లో ప‌రిహారం ఇచ్చిన ప‌రిస్థితి గ‌తంలో చూడ‌లేదు. మొద‌టి సారి ఈ ప్ర‌భుత్వం ఇన్‌ఫుట్ స‌బ్సిడీ అదే సీజ‌న్‌లో అంద‌జేస్తున్నాం. 2014లో న‌ష్టం జ‌రిగితే ఆ ఇన్సూరెన్స్ సొమ్ము 2015లో రూ.620 కోట్లు ఇచ్చారు. మ‌ళ్లీ 2017లో రెండేళ్ల త‌రువాత ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చారు. ఇవీ కాక 2018 ఇన్‌ఫుట్ స‌బ్సిడీని చంద్ర‌బాబు పూర్తిగా ఎగుర‌గొట్టారు. 2194 కోట్లు చంద్ర‌బాబు ఎగుర‌గొట్టారు. మ‌నం అదేసీజ‌న్‌లో ఇన్‌ఫుట్ స‌బ్సిడీ అదే సీజ‌న్‌లో ఇస్తుంటే వీళ్లు స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
ఇన్సూరెన్స్‌ను రెండు ర‌కాలుగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.  ప్ర‌భుత్వ‌మే ఇన్సూరెన్స్ క‌ట్ట‌డం మొద‌లుపెట్టిన త‌రువాత గ‌మ‌నిస్తే స‌గ‌టున 20 ల‌క్ష‌ల మంది రైతులు కూడా ఇన్సూరెన్స్ చెల్లించే ప‌రిస్థితి లేదు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత 56.82 ల‌క్ష‌ల మంది ఇన్సూరెన్స్ చెల్లించారు. రైతులు చెల్లించేది రూ.26 ల‌క్ష‌లు మాత్ర‌మే..ప్ర‌భుత్వం రూ.1030 కోట్లు ఇన్సూరెన్స్  ప్రీమియం చెల్లించం. డీసెంబ‌ర్ 21న ఇన్సూరెన్స్ చెల్లిస్తాం. గ‌తంలో ప్ర‌భుత్వం రూ.390 కోట్లు మాత్ర‌మే చెల్లించింది. మ‌న ప్ర‌భుత్వం రూ.1030 కోట్లు రైతుల త‌ర‌ఫున చెల్లిస్తోంది.

ఇన్సూరెన్స్ ప‌రిస్థితి చూస్తే..ఏ సంవ‌త్స‌రం చూసినా ఏడాదిన్న‌ర త‌రువాతే అందించారు. మ‌న ప్ర‌భుత్వ‌మే ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తోంది. కోత ద‌శ ముగిసిన వెంట‌నే ఇన్సూరెన్స్ అంద‌జేస్తాం. ఇక్క‌డ కులం, మ‌తం చూడ‌టం లేదు. ప్రాంతం, పార్టీలు, రాజ‌కీయాలు చూడ‌టం లేదు. చెప్పిన మాట ప్ర‌కారం తూచా త‌ప్ప‌కుండా ఈ రోజు అర కోటి మంది రైతుల‌కు రైతు  భ‌రోసా ప‌థ‌కం పేరుతో నేరుగా వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తున్నాం. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఒక్కో రైతుకు రూ.12,500 నుంచి రూ.13,500 చెల్లిస్తున్నాం. చెప్పిన దానిక‌న్న ఎక్కువ‌గానే ఇస్తున్నాం. 18 నెల‌ల కాలంలో రైతు భ‌రోసా కింద రూ.13 వేల కోట్లు రైతుల‌కు ఇచ్చాం. 
విత్త‌నం నుంచి అమ్మ‌కం వ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లో రైతుకు అండ‌గా నిలిచేందుకు రాష్ట్ర‌వ్యాప్తంగా 10,641 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతు అవ‌స్థ‌లు తెలిసిన వ్య‌క్తిగా రైతు భ‌రోసా కేంద్రాలు రైతుల చెంత‌కే తీసుకెళ్లాం. రైతుల‌ను చెయ్యి ప‌ట్టుకొని ఈ ఆర్‌బీకేలు న‌డిపిస్తాయి. ప్ర‌తి గ్రామంలో ఆర్‌బీకేలు ఏర్పాటు చేశాం. పేద రైతుల‌కు అండ‌గా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో రైతుల‌కు ఉచితంగా బోర్లు వేయించ‌డ‌మే కాకుండా మోటార్లు కూడా బిగిస్తున్నాం. ఏడాదికి 50 వేల బోర్లు వేసే దిశ‌గా అడుగులు వేస్తున్నాం. ఈ ప‌థ‌కానికి రూ.4 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాం.
గ‌త ప్ర‌భుత్వం విద్యుత్ బ‌కాయిలు చెల్లించ‌కుండా అన్యాయం చేస్తే..రూ.8658 కోట్ల బ‌కాయిలు మ‌న ప్ర‌భుత్వ‌మే రైతుల త‌ర‌ఫున చెల్లించాం. ధాన్యం సేక‌ర‌ణ బ‌కాయిలు గ‌త ప్ర‌భుత్వం చెల్లించ‌లేదు. మ‌న ప్ర‌భుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన రెండు వారాల్లోనే డ‌బ్బులు అంద‌జేయాల‌ని ఆదేశాలు జారీ చేశాం. 

విత్త‌నాల స‌బ్సిడీకి కూడా చంద్ర‌బాబు బ‌కాయిలు పెట్టారు. రూ.384 కోట్ల బ‌కాయిలు మ‌న‌మే చెల్లించాం. రైతుల‌కు వ‌డ్డీ లేని రుణాల కింద గ‌త ప్ర‌భుత్వం రూ.1030 కోట్ల బ‌కాయిలు మ‌న ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. ఇవ‌న్నీ కూడా రైతుల మీద ప్రేమ‌తోనే చెల్లించింది .రైతుల‌కు ప‌గ‌టి పూట 9 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్ ఇచ్చేందుకు ఫీడ‌ర్ల‌కు కేపాసిటి పెంచేందుకు రూ.1700 కోట్లు మ‌న‌మే చెల్లించాం. ఇవాళ రైతుల‌కు ఇచిత విద్యుత్ ఇస్తున్నామ‌ని గ‌ర్వంగా చెబుతున్నాను. వైయ‌స్ఆర్ సున్నా వ‌డ్డీ ప‌థ‌కం కింద 2019లో రూ.510 కోట్లు రైతుల త‌ర‌ఫున మ‌న ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. బీమా ప్రీమియం కూడా మ‌న ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. రైతులు కేవ‌లం ఒక్క రూపాయి చెల్లిస్తే..ప్ర‌భుత్వం రూ.1030 కోట్ల ప్రీమియం చెల్లించాం. డిసెంబ‌ర్ 15న రూ.1227 కోట్ల బీమా ప్రీమియం చెల్లిస్తాం.

13 జిల్లా స్థాయి  ఆగ్రి ల్యాబ్‌లు, 147 రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో విత్త‌నాలు, పురుగు మందుల‌కు ముంద‌స్తు నాణ్య‌త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం. దాదాపు 15 వేల కోట్ల‌తో వ‌రి ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్ స‌మ‌యంలో మొక్క‌జొన్న‌, ఉల్లి, ట‌మాట‌, త‌దిత‌ర పంట‌లు రూ.3491 కోట్ల‌కు కొనుగోలు చేశాం. ప‌త్తి కొనుగోలుకు మ‌రో రూ.666 కోట్లు సీసీఐ ద్వారా కొనుగోలు చేశాం. రైతులు మంచి ధ‌ర అందించాల‌న్న ల‌క్ష్యంతో ఏ పంట‌కు ఎంత గిట్టుబాటు ధ‌ర ఇస్తున్నామో బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రైతుల నుంచి నేరుగా పంట‌లు కొనుగోలు చేస్తున్నాం. ఇందు కోసం ఒక యాప్ కూడా తీసుకువచ్చాం. రైతుకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చేందుకు మార్కెటింగ్ శాఖ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌రుండి న‌డిపిస్తారు. రైతుల‌ను ఆదుకోవ‌డంతో పాటు ప్ర‌భుత్వం కూడా న‌ష్ట‌పోకూండా బ‌య‌ట ప‌డేందుకు సెకండ‌రీ ఫుడ్ ప్రాసెసింగ్ క్ల‌స్ట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు రూ.3 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాం. ఎక్క‌డెక్క‌డ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలో కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్నాం.

ప్ర‌తి గ్రామంలోనూ గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు క‌నిపిస్తాయి. అదే గ్రామంలో జ‌న‌తా బ‌జారు కూడా ఏడాదిలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మాల కోసం రూ.10 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాం. గ్రామీణ వాతావ‌ర‌ణ రూపురేఖ‌లు మార్చ‌బోతున్నాం. రాష్ట్ర‌వ్యాప్తంగా రైతులు, అక్క చెల్లెమ్మ‌ల‌కు వ్య‌వ‌సాయం ఒక్క‌టే లాభ‌సాటిగా ఉండ‌ద‌ని, చేయూత అనే గొప్ప కార్య‌క్ర‌మం తీసుకువ‌చ్చాం. 6 ల‌క్ష‌ల యూనిట్ల ఆవులు, గేదేలు, 2.5 ల‌క్ష‌ల గొర్రెల యూనిట్లు త్వ‌ర‌లోనే పంపిణీ చేయ‌బోతున్నాం.  అమూల్ సంస్థ‌ను రాష్ట్రంలోకి తీసుకువ‌స్తున్నాం. స‌హ‌కార రంగాన్ని బాగు చేసేందుకు అమూల్ సంస్థ‌ను తీసుకువ‌చ్చాం. 9989 బ‌ల్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా గ్రామాల్లో ఏ ర‌కంగా మార్పులు తీసుకువ‌స్తామో మంత్రి క‌న్న‌బాబు కూడా వివ‌రించారు. హెరిటేజ్ సంస్థ లీట‌ర్ పాలు రూ.34 చొప్పున కొనుగోలు చేస్తే..అమూల్ రూ.39 చొప్పున పాలు కొనుగోలు చేయ‌బోతున్నారు. సంగం డ‌యిరీ, హెరిటేజ్ డ‌యిరీ లీట‌ర్ ఆవుపాలు రూ.54 చొప్పున కొనుగోలు చేస్తే అమూలు సంస్థ రూ.7 అధికంగా చెల్లించి పాలు కొనుగోలు చేస్తుంది. గ్రామీణ వ్య‌వ‌స్థ‌లో రైతుల‌ను, పేద‌వారిని ఆదుకోవాల‌ని మా ప్ర‌భుత్వం ఆలోచ‌న‌, త‌ప‌న‌, తాప‌త్ర‌యంతో ముందుకు వెళ్తోంది. వ్య‌వ‌స్థ మార‌బోతుంద‌ని స‌గ‌ర్వంగా ఈ సంద‌ర్భంగా చెబుతున్నాను.

ఆక్వా రైతుల‌ను కూడా నిల‌బెట్టుతుంది. రూ.1.50ల‌కే యూనిట్ క‌రెంటు ఇస్తోంది. రూ.720 కోట్లు ఏడాదికి భారాన్ని భ‌రిస్తున్నాం. ఆక్వా ప్రాడ‌క్ట్స్ చేప‌, రొయ్య‌లు కూడా జ‌న‌తా బ‌జార్ల‌లో రాబోయే రోజుల్లో ల‌భిస్తాయి. వాటికి కూడా ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు తీసుకువ‌స్తాం. ఆక్వా రైతులు, రైతుల‌కు మేలు జ‌రిగించే విధంగా ల్యాబ్స్ నిర్మిస్తున్నాం. ఇదే స‌భ‌లో బిల్లులు పెట్ట‌బోతున్నాం. 35 ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. నాలెడ్జ్ ప‌రంగా ల్యాబ్‌లు కూడా తీసుకువ‌స్తున్నాం. 

మ‌న ప్ర‌భుత్వం రైతు శ్ర‌మ‌, అవ‌స‌రాలు తెలిసింది. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా మేలు చేస్తున్నాం. చంద్ర‌బాబు రైతుల త‌ర‌ఫున మొస‌లి క‌న్నీరు కార్చాల్సిన అవ‌స‌రం లేదు. ఈ రోజు రైతుల త‌ర‌ఫున మాట్లాడ‌కుండా డ్రామా చేసి, ఆయ‌న‌ను ఎత్తుకెళ్తున్న‌ట్లు రేపు పేప‌ర్లో చూపించ‌డం త‌ప్ప‌..వీళ్ల‌కు రైతులు గుర్తుకు రారు. గ‌తంలో ఎక్క‌డ వ‌ర‌ద వ‌చ్చినా ప్ర‌తిప‌క్ష నేత‌గా నేను క‌నిపించేవాడిని. చంద్ర‌బాబు అంటే సీబీఎన్ అన‌గా క‌రోనాకు భ‌య‌ప‌డే నాయుడు గారు అన్న‌ది సార్థ‌కం చేసుకున్నారు. చంద్ర‌బాబుది డ్రామా మాత్ర‌మే..ఆయ‌న‌కు రైతుల‌పై ప్రేమ లేదు. అదే సీజ‌న్‌లో పంట న‌ష్ట ప‌రిహారం ఇచ్చే మా ప్ర‌భుత్వానిది నిజ‌మైన ప్రేమ ..ఏది నిజ‌మైన ప్రేమో ఒక్క‌సారి అంద‌రూ ఆలోచ‌న చేయాలి. మ‌న ప్ర‌భుత్వంలో ఏ రైతు కూడా క‌న్నీరు పెట్ట‌కూడ‌ద‌ని మ‌న‌స్ఫూర్తిగా చెబుతున్నాను. రైతుల‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటాన‌ని మ‌రోసారి స‌భ సాక్షిగా చెబుతున్నాను అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top