స‌మ‌న్యాయం కోస‌మే పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌

స్వాతంత్ర్య వేడుక‌ల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ఎన్నిక‌ల్లో ఇచ్చిన 129 హామీల్లో ఇప్ప‌టికే 83 అమ‌లు చేశాం

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేదాకా కేంద్రాన్ని గ‌ట్టిగానే అడుగుతున్నాం

గ‌త ప్ర‌భుత్వం చెల్లించ‌ని బకాయిల‌నూ  చెల్లించాం 

 అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్

వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.56వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతోనే పాల‌నా వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోను ఓ ప‌విత్ర గ్రంధంగా భావించి అందులో పేర్కొన్న 129 హామీల్లో 14 నెల‌ల్లోనే 83 అమ‌లు చేశామ‌ని, హామీ ఇవ్వ‌కుండానే ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను గుర్తించి మ‌రో 39 హామీలు అమ‌లు చేసిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు. పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర ప్ర‌భుత్వంఇచ్చిన మాట ప్ర‌కారం రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని గ‌ట్టిగానే అడుగుతున్నామ‌ని చెప్పారు.  దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో  శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ.. ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని అన్నారు. 14 నెల‌ల వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వం సాధించిన ల‌క్ష్యాల‌ను..ప్ర‌గ‌తిని వివ‌రించారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

♦సామాజిక, ఆర్ధిక భరోసాను రాజ్యాంగం కల్పించింది
♦సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదు
♦పేదల జీవితాలు మార్చడానికి కృషి చేస్తున్నాం
♦రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టాం
♦కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం
♦ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగింది
♦ఆర్ధిక పరిస్థితులు లేకున్నా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం
♦విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం
♦ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
♦రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్ధిక సాయం చేస్తున్నాం
♦పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం
♦అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ
♦సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం
♦త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని
♦కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం
♦పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటాం
♦కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు.. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినా.. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా  సాధించాలనే ధృడసంకల్పంతో ఉన్నాం
♦ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం
♦అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్ ప్రివ్యూ, డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నాం
♦కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.56వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం
♦చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది చీడపురుగు. అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి
♦ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్‌ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా రూ.4వేల కోట్లకు పైగా ఆదా చేశాం అని సీఎం వైయ‌స్‌ జగన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Back to Top