ఆటో కార్మికుల కష్టాలను కళ్లారా చూశా

వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌ 

ఇలాంటి ఆర్థికసాయం దేశ చరిత్రలో ఎక్కడా లేదు

ప్రతి ఏడాది వైయస్ఆర్‌ వాహన మిత్ర పథకం వర్తింపు 

కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి పథకాలు

రాష్ట్రంలో మంచి జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు

ఏ గ్రామంలోనూ బెల్టుషాపులు లేకుండా రద్దు చేశాం

ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు

ఏలూరు: ప్రజా సంకల్ప యాత్రలో ఆటో కార్మికుల కష్టాలను కళ్లారా చూశానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద ఆర్థికసాయం చేస్తామని, ప్రతి ఏడాది ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా 1,73,102 మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పథకం గడుపు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇలాంటి ఆర్థికసాయం దేశ చరిత్రలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. 
లక్షల మంది ప్రయాణికులను రోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న నా అన్నదమ్ముళ్లకు, నా అక్కచెల్లెమ్మళ్లందరికీ ధన్యవాదాలు. ఇదే ఏలూరులో 2018 మే 14న నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను. రాష్ట్రంలోని ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఇక్కడి నుంచి ఇచ్చిన ఆ మాటను రాష్ట్రం మొత్తం ఇదే రోజు నుంచి అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయగలుగుతున్నానంటే అది కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలని పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం అందజేస్తానని ఏలూరు నుంచి ప్రకటించాను. సొంత ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ బ్రతుకుమండిని ఈడుస్తున్న ఆ అన్నదమ్ముళ్ల కష్టాలను ఆ రోజు చూశాను. వారు నా దగ్గరకు వచ్చి కష్టాన్ని చెప్పుకున్న రోజు ఎప్పటికీ మర్చిపోను. అన్నా ఆటో తోలుకుంటున్నామన్నా.. రోజుకు రూ. 3 వందల నుంచి రూ. 5 వందలు మించి రాదన్నా.. వాటితో బతకడమే కష్టం అనుకుంటే అది చాలదు అన్నట్లుగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుంటే ప్రతి రోజు రూ. 50 ఫైన్‌ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండి అన్నా అని నా దగ్గరకు వచ్చి అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేదు.

నిజంగానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. సర్టిఫికెట్‌ రావాలంటే ఇన్సూరెన్స్‌ కట్టాలి. ఇన్సూరెన్స్‌ కట్టేందుకు రూ. 7,500 అవుతుందని చెప్పారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రావాలంటే బండి రిపేరు చేయించాలి. రిపేరు చేయించాలంటే రూ. 2 వేలు అవుతుంది. రోడ్‌ ట్యాక్స్‌ కడితే తప్ప సర్టిఫికెట్‌ రాదు. ఇవన్నీ ఒకేసారి కట్టాలంటే కనీసం రూ. 10 వేల పైచిలుకు అవుతుంది అన్నా.. ఎక్కడ నుంచి తేవాలన్నా అని చెప్పిన కష్టాలు ఎప్పటికీ మర్చిపోలేను.
మీ తమ్ముడిలా.. అన్నలా మీ అందరి తరుఫున ఒక్కటే చెబుతున్నా.. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు తిరగకముందే మీ అందరి బ్యాంక్‌ అకౌంట్లలో బటన్‌ నొక్కిన రెండు గంటల్లోనే డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంత ఆటోలు, సొంత ట్యాక్సీలు నడుపుకుంటూ బతుకుబండిని ఈడుస్తున్న ప్రతి అన్నకు, తమ్ముడికి మాటిస్తున్నా.. ప్రతి సంవత్సరం రూ. 10 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 వేలు మీ అకౌంట్లలో వేస్తానని సగర్వంగా చెబుతున్నాను.

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల గురించి, వారికి మేలు ఎలా చేయాలని బహుశా దేశ చరిత్రలో ఎవరూ ఆలోచించి ఉండరేమో.. అది ఒక్క ఆంధ్రరాష్ట్రంలో ఇవాళ జరుగుతుందని సగర్వంగా చెబుతున్నా. పరిస్థితులను మార్చుతూ ప్రతి పేదవాడికి మంచి చేయాలని ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రతి పథకం అర్హులందరికీ అందాలని ఆదేశాలు ఇస్తున్నాం. కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకూడదు. చివరకు పార్టీలు కూడా చూడకుడదని ఆదేశాలు ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మంచి జరగాలని ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల్లో భాగంగా ఇవాళ అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 1,75,352 మంది దరఖాస్తులు చేసుకుంటే 1,73,102 మందికి వాహనమిత్ర పథకం పూర్తిగా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఎంత పారదర్శకంగా జరిగిందో ఆలోచన చేయండి. బీసీలకు సంబంధించి 79 వేల మంది, ఎస్సీలకు సంబంధించి 40 వేల మందికి, ఎస్టీలకు సంబంధించి 6 వేలకుపైగా, మైనార్టీలకు సంబంధించి 17,500 మందికి, కాపులకు 20 వేల మందికి, బ్రాహ్మణులకు 397 మందికి, ఈబీసీలకు 9995 మందికి ఎక్కడా వివక్షలేదు, ఎక్కడా అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా వైయస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నాం.
లైసెన్స్‌ ఉండి కుటుంబ సభ్యులు పేరుతో ఆటో ఉంటే చాలు తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులు అయితే నేరుగా ఈ పథకం వర్తిస్తుందని ఆదేశాలు ఇచ్చాం. ఆన్‌లైన్‌లో పెట్టాం. గ్రామ వలంటీర్లు ఇంటికి వచ్చి చేయి పట్టుకొని నడిపించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేకుండా నేరుగా 1,74 లక్షల కుటుంబాలకు మేలు జరిగించే కార్యక్రమం. గర్వంగా చెబుతున్నా ఇటువంటి రాష్ట్రానికి జగన్‌ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని గర్వంగా చెబుతున్నాను.

చివరగా మీ అందరికీ ఒకే ఒక సూచన చేస్తున్నా.. ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోతే ఈ పథకం అక్టోబర్‌ 30వ తేదీ వరకు కొనసాగించాలని కోరుతున్నాను. మిగిలిపోయిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. గ్రామ వలంటీర్లు కూడా మీకు సాయం చేస్తాం. అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకుంటే నవంబర్‌లో ఇచ్చేస్తామని ఇదే వేదికపై నుంచి చెబుతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం లంచాలకు తావులేకుండా, వివక్షకు తావులేకుండా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గ్రామ వలంటీర్లను అభినందిస్తున్నాను. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ పథకానికి సహకరిస్తూ తోడుగా ఉండాలని కోరుతూ.. ఇంత గొప్పగా చేసినందుకు ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ అధికారులకు, మంత్రి పేర్ని నానికి అందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను.

రాజకీయాలు మీరంతా చూస్తున్నారు. ఎలా జరుగుతున్నాయో గమనిస్తున్నారు. మంచి జరుగుతుంటే ఆ మంచిని అభినందించాల్సింది పోయి బండలు వేస్తున్న పరిస్థితులు గమనిస్తున్నారు. అక్టోబర్‌ 2వ తేదీన సాక్షాత్తు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విని ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. గాంధీజీ జయంతిన గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా గ్రామ సచివాలయాలను ఆవిష్కరించాం. గ్రామ సచివాలయంలో 10 నుంచి 12 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. లంచాలు, వివక్షకు తావులేకుండా పేదవాడి ఇంటికే ప్రభుత్వ పథకం వచ్చేలా చేశాం. గాంధీజీ కలలు కన్నట్లుగా గ్రామస్వరాజ్యానికి నాంది పలుకుతూ తాగుడు మీద యుద్ధాన్ని ఆ రోజే ప్రకటించాం. మద్యం పాలసీని తీసుకువచ్చాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 43 వేల బెల్టుషాపులు ఉండేవి. గ్రామాల్లో తాగడానికి మినరల్‌ వాటర్‌ ఉన్నాయో లేవో తెలియదు కానీ, ప్రతి గ్రామంలో వీధి చివరన, గుడి పక్కన, బడి పక్కన బెల్టు షాపులు దర్శనమిచ్చేవి. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన మద్యం పాలసీని తీసుకువచ్చాం. బెల్టుషాపులు కనిపించకుండా చేశాం. 4,500 మద్య షాపులు ఉంటే వాటిలో 20 శాతం తగ్గించి 3450 షాపులకు కుదించాం. ఇంతకు ముందు మద్యం దుకాణాల వద్దే పర్మిట్‌రూంలను పెట్టి విచ్చలవిడిగా అక్కడే మందుబాబులు మద్యం తాగేవారు. పర్మిట్‌ రూం పక్కనుంచి అక్కాచెల్లెమ్మలు పోయే పరిస్థితి కూడా లేనిరోజులు. ఎక్కడా పర్మిట్‌ రూంలు కనిపించకుండా చేయాలని ఆదేశాలు ఇచ్చా. ప్రతి అడుగు మంచి చేయాలని తాపత్రయపడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురదతో తట్టుకోలేక గాంధీ జయంతి రోజు ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచిందని అబద్ధాలు చెప్పి బురదజల్లాలని చూస్తున్నాడు చంద్రబాబు. మీ అందరినీ అడుగుతున్నా.. మీరంతా చూశారు. గాంధీజయంతి రోజు మద్యం దుకాణం తెరిచి ఉందా.. అని మిమ్మల్నే అడుగుతున్నా.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు ఇంత నీచంగా అబద్ధాలు ఆడడం సబబేనా..? ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాం. మనసుకు బాధ కలిగినా మీ మొహాలు చేస్తే సంతృప్తి వస్తుంది. దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిపాలన చేయించాలని ఆ దేవడిని ప్రార్థిస్తూ.. మీ అందరి చల్లని దీవెనలకు, ప్రతి అక్కాచెల్లి, ప్రతి అవ్వాతాత, ప్రతి స్నేహితుడు, సోదరుడికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి, శిరస్సువంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక నుంచి సెలవు తీసుకుంటున్నాను.

 

Back to Top