ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి : సీఎం

 అమరావతి : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు.  సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి భూముల సమగ్ర రీసర్వేను త్వరగా పూర్తి చేయాలని, ఈ సందర్భంగా ఎక్కడా, ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైనవారిని గుర్తిస్తారని అన్నారు.

ఈ సందర్భంగా ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉగాదికి నెలరోజులకు ముందే భూమిని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేశామని, ఇళ్ల స్థలాల కోసం 23,448 ఎకరాలు గుర్తించామని, ఈ భూములపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఈ భూమి ఏ స్థితిలో ఉందన్న దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉందా? లేదా? అన్న పరిశీలన వేగంగా జరుగుతోందని తెలిపారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అంచనా ఉందని,ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని అధికారులు వివరించారు. పట్టణాల్లో మరో 2 లక్షలమందికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూమి అందుబాటులో ఉందని, దాదాపు 15.75 లక్షలమందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉందంటూ ముఖ్యమంత్రికి అధికారులు నివేదిక అందించారు. 

భూముల సమగ్ర సర్వేకి సన్నద్ధం
రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. రీసర్వే ప్రణాళికను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ‘సమగ్ర సర్వే కోసం రూ. 1688 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశాం. మొత్తం రాష్ట్ర విస్తీర్ణం 1.63 లక్షల చ.కి.మీలు కాగా, అందులో 1.22 లక్షల చ.కి.మీ మేర సర్వే చేయనున్నాం. మిగతా 38,8000 చ.కి.మీ అటవీ భూమి కాగా, మరో 2,200 కి.మీ మేర జనావాసాలు ఉన్నాయి. మొత్తం 679 మండలాలు, 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఎఫ్‌ఎంబీలు 49 లక్షలు కాగా, సబ్‌ డివిజనల్‌ రికార్డెడ్‌ ఎఫ్‌ఎంబీలు 159 లక్షలు ఉన్నాయి. అలాగే భూ యజమానులు 2.36 కోట్ల మంది ఉన్నార’ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు

రీ సర్వే ఎందుకంటే..

తొలిసారిగా 18801930ల మధ్య రైత్వారీ గ్రామాలపై రికార్డు జరిగింది. 
ఆ తర్వాత 196080 మధ్య మరోసారి సెటిల్‌మెంట్‌ గ్రామాలపై రికార్డు నిర్వహించారు. 
అయితే చాలా వరకు రికార్డులు పోవడం, ఉన్నదాంట్లో కూడా సమాచారం సరిగా అప్‌డేట్‌ కాకపోవడం. 
అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్న భూములకీ, రికార్డులకూ పొంతన లేకుండా పోయింది.
సర్వే చేయమంటూ వస్తున్న దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నందునా.. భూ వివాదాలను తగ్గించాల్సిన అవసరం ఉంది.
రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కుదరడం కోసం. 

Back to Top