ప్రతి పనిలో పారదర్శకత ఉండాలి

పశుసంవర్ధక, మత్స్యశాఖపై సీఎం సమీక్ష

మచిలీపట్నంను మేజర్‌ పోర్టుగా తీర్చిదిద్దుతాం

ఆక్వా రైతులకు మంచి జరిగేలా చూడాలి

వెటర్నరీ ఆస్పత్రులు, క్లినిక్‌లలో సదుపాయాలు కల్పించండి

ప్రతి కార్యక్రమంలో వలంటీర్లను భాగస్వాములను చేయాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: పశుసంవర్ధక, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నుంచి నీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జెట్టీలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి సన్నాహాలు, మూడు మేజర్‌ పోర్టుల నిర్మాణానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మచిలీపట్నంను మేజర్‌ పోర్టుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భీమిలి సమీపంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపైనా సీఎం చర్చించారు. మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఏం చేస్తుందో వివరించాలన్నారు. పనుల్లో పారదర్శకత ఉండాలన్నారు. అవినీతి లేకుండా చూడాలన్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌పై ఒత్తిడి తగ్గించాల్సి ఉందని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత వారిని ఉద్యోగులుగా తీసుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారు. దీని వల్ల కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తోందని, ఈ అంశంపై పూర్తి అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత మనదే. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. వాటిని బ్రాండ్‌ను వినియోగించుకునేలా ప్రణాళికలు తీసుకురండి. మేనేజ్‌మెంట్‌లో ప్రతిభావంతుల సహకారం తీసుకోండి. దీన్ని వల్ల మార్కెటింగ్‌ సదుపాయాలు పెరుగుతాయి. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని సీఎం సూచించారు.

వెటర్నరీ ఆస్పత్రులు, క్లినిక్‌లలో సదుపాయాలు కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు. పశువులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, దీని వల్ల క్రమ తప్పకుండా వ్యాక్సిన్స్‌ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. పశువుల పెంపకాల్లో సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేయాలని సూచించారు. గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా వలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. పశువుల మందుల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. పశువుల వైద్యం కోసం 102 నంబర్‌ గల వాహనాలు వచ్చే ఏడాది నుంచి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు
.

 

Back to Top