స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై సీఎం వైయ‌స్‌ జగన్ దిగ్భ్రాంతి 

ప్రమాద ఘటనపై తక్షణ చర్యలకు ఆదేశం

మృతి చెందిన కుటుంబాలకు  రూ.50లక్షల చొప్పున‌ పరిహారం

తాడేప‌ల్లి: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో  రమేష్ హాస్పిటల్‌కి చెందిన కోవిడ్ కేర్ సెంటర్‌ను లీజ్‌కు నిర్వహిస్తున్నారు.  అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను ఉంచి.. చికిత్స అందిస్తుండ‌గా ఆదివారం తెల్లవారుజామున 5 గంటలసమయంలో  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.  మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది.  ప్రమాద కారణాలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎం వైయ‌స్‌ జగన్‌కు వివరించారు.ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని సీఎం అధికారులను ఆదేశించారు.  

 
రూ. 50 ల‌క్ష‌ల ప‌రిహారం
 కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జ‌రిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.   క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. 
 

Back to Top