మన తలరాతల్ని మనమే మార్చుకోవాలి 

అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం

అభివృద్ధి ఫలాలు అందాలి

పంటల బీమా, పంటల పరిహారం అందించేందుకు చట్టం  తెచ్చాం

అమరావతి: మన తలరాతల్ని మనమే మార్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీసులకు మెడల్స్‌ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయి.. 73వ సంవత్సరంలో అడుగుపెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 1857లో మంగళ్‌ పాండే బ్రిటీష్‌ పాలకులపై తిరగబడి సిపాయిల తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభిస్తే.. ఆ తరువాత 90 ఏళ్లకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలి. మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి. మన తలరాతల్ని మనమే మార్చుకోవాలి. మనల్ని దోపిడీ చేసే పాలకులు గద్దె మీద ఉండటానికి వీల్లేదు. విభజించి పాలించే ఆలోచనలు పోవాలి.. సంఘ సంస్కరణలు రావాలి. కులాలు, మతాలు, వర్గాలు అన్న విభేదాలు చెరిగిపోవాలి. మనవత్వం నిలిచిపోవాలి అంటూ మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం అనేక గొప్ప భావాలతో ముందుకు సాగింది. బ్రిటిష్‌ వాడి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు. మన దేశంలో ఉన్న అంటరానితనానికి, మనుషుల్ని విభజిస్తున్న కులం పునాదుల్ని పెకలించడానికి, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఒకే సమయంలో జరిగిన అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

వందల భాషలు, వేల కులాలు, అనేక మతాలు.. వందలకొద్ది సంస్థానాల ఈ దేశం.. స్వాతంత్ర్య పోరాట ఫలితంగానే ఒక్కటయింది. వందేమాతరం, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, జైహింద్‌, క్విట్‌ ఇండియా అంటూ మహామహులు ఇచ్చిన నినాదాలు.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశభక్తిని రగిలించాయి అని గుర్తుచేశారు. ఒక జాతీగానీ, ఒక దేశంగానీ స్వాతంత్ర్యాన్ని కోల్పోతే.. ఎన్ని వందల ఏళ్లు బానిసలుగా, సెకండ్‌ క్లాస్‌ సిటిజెన్లుగా మానవహక్కులు లేకుండా బతకాల్సి వస్తుందో.. ఎన్ని పోరాటాలు, ఎంతటి త్యాగాలు చేయాల్సి వస్తుందో మన స్వాతంత్ర్య ఉద్యమం చెప్తోందని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

వ్యవస్థలో మార్పు కోసమే నవరత్నాలు
1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం దేశ ప్రజలందరికీ వచ్చిందా? లేక కొందరికే వచ్చిందా? అన్నదానిపై మనం బాధ్యతగా సమాధానం వెతకాలి. స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం. అని ఆ అభివృద్ధి ఫలాలు అందాల్సిన వారికి అందలేదు. అవినీతి, దళారీ వ్యవస్థ వేగంగా బలపడింది. ఎలాంటి విలవలూ లేని గత రాజకీయాన్ని కొనసాగిద్దామా? లేక ఈ వ్యవస్థను మార్చుకుందామా? మనం చెడిపోయిన ఈ వ్యవస్థలో భాగస్వాములుగా ఉంటూ.. అవినీతి, అధికారం పాలు, నీళ్లలా కలిసిపోయాయని.. అవి అలాగే ఉంటాయని వదిలేద్దామా? లేక ఈ పరిస్థితులను మారుద్దామా? అన్నది గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించాల్సిన సమయం. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువద్దామనే దృఢ నిశ్చయంతో నవరత్నాలు తీసుకొచ్చాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందలేకపోయిన వారి కోసం నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పదవుల్లో రిజర్వేషన్‌ కేటాయిస్తూ చట్టాలు తీసుకొచ్చాం అని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు.

శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు
మన వ్యవస్థను మార్చుకుందామన్న దృఢ నిశ్చయంతో ధైర్యంగా ముందండుగువేశాం. సామాజిక న్యాయ చరిత్రలోనే కనీవీని ఎరుగనివిధంగా బడుగులు, మహిళలకు పెద్దపీట వేస్తూ చరిత్రగతిని మార్చే చట్టాలను తీసుకొచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. బీసీ కులాలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాన్‌బోన్‌లుగా వెన్నెముక కులాలుగా చేస్తామన్న మాటకు కట్టుబడి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పేలా సామాజిక న్యాయానికి బాటలు వేసే చట్టాలు చేశాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ పనుల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదేని గర్వంగా చెప్తుతున్నా. గతంలో ఎప్పుడూలేనివిధంగా నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టాలను తీసుకొచ్చాం’ అని సీఎం పేర్కొన్నారు.

పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు
పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో 75శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే కేటాయించాలంటూ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో ముందుగానే తెలుసుకొని.. స్థానిక యువతకు అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి.. అటు పరిశ్రమలకు, ఇటు స్థానికులకు వెన్నుదన్నుగా నిలబడాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యనియంత్రణలో భాగంగా బెల్ట్‌ షాపులు మూయించడమే కాకుండా వాటిని శాశ్వతంగా మూయించేందుకు లాభాపేక్ష లేకుండా అక్టోబర్‌ 1నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మేలా నిర్ణయం తీసుకున్నాం. భూయాజమానులకు ఎలాంటి నష్టం కలుగకుండా కౌలురైతులకు వైయస్‌ఆర్‌ రైతు భరోసాతోపాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేందుకు చట్టం తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Back to Top