హామీల అమలుకు ముందడుగు వేస్తున్నాం

ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ

సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకర్ల సహకారం అవసరం

వడ్డీలేని రుణాల డబ్బు నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

 

అమరావతి: మేనిఫెస్టోలోని అంశాలు, ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, అధికారులు పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుంది. ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నాం. వివిధ పథకాల కింద ప్రభుత్వం అనేక మందికి నిధులు ఇస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలి. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించుకోకూడదు. మినహాయించుకోలేని విధంగా ఆన్‌ఇన్‌ కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలి. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుంది. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బు నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సున్నా వడ్డీ కింద చెల్లింపులను రశీదు రూపంలో వారికి అందిస్తారని వివరించారు. సున్నావడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించారో ప్రభుత్వానికి జాబితా ఇస్తే వాటిని ప్రభుత్వం నిర్ణిత సమయంలోనే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, చిరు వ్యాపారులను ప్రోత్సాహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ప్రతినెలా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుందని, ఇందుకు బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.

Back to Top