నేడు ప్రధానితో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ 

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతోనూ సమావేశం 

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ 

విభజన హామీల అమలు, నిధులు, బకాయిలు విడుదల చేయాలని కోరనున్న ముఖ్యమంత్రి  

 న్యూఢిల్లీ, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఆదివారం రాత్రి 9.40 గంటలకు ఢిల్లీకి చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాస గృహం జన్‌పథ్‌ 1కు వచ్చారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రధానితో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, నిధుల విడుదల తదితర విషయాల గురించి మాట్లాడనున్నారని తెలిసింది.

 
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని.. దీనిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రిని కోరనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని, భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరు చేయాలని, ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కూడా సీఎం జగన్‌ కోరనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం అపాయింట్‌మెంట్‌లను అనుసరించి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలతో భేటీ కానున్నట్లు సమాచారం.

పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిసింది. అవసరమైతే సోమవారం రాత్రి కూడా ఢిల్లీలోనే బస చేసి మంగళవారం కూడా కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. అంతకు ముందు సీఎంకు ఢిల్లీ విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top