ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు "వైయస్‌ఆర్‌ వాహన మిత్ర'

అక్టోబరు 4న వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభం

డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం

అమరావతి :  సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు మేలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అర్హులైన డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన విషయం విదితమే. ఈ మేరకు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హామీ నెరవేర్చే దిశగా ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఆటో, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అదే విధంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అధికారులు అవకాశం కల్పించారు.అదే విధంగా అర్హులు సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా రవాణాశాఖకు సంబంధించిన డీటీసీ స్థాయి నుంచి ఎంవీఐ ఆఫీస్ వరకు, అలాగే ఈ- సేవ, మీ- సేవ, సీఎస్సీ, ఎండీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన గ్రామ, వార్డు వాలంటీర్ల వద్ద కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచడం ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభతం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. 

కాగా డ్రైవర్లకు అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ఇన్స్యూరెన్స్, వెహికిల్ ఫిట్‌నెస్, మరమ్మత్తులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లు ‘వాహన మిత్ర’ పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్ వివరాలను సమర్పించాలని అధికారులు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైతే  తమ కులధృవీకరణ పత్రం కూడా సమర్పించాలని సూచించారు. సమర్పించిన ఆ డాక్యుమెంట్లను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సంరక్షణలో ఉందో లేదో పరిశీలిస్తారు. ఈ సమాచారాన్ని, సదరు దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్, బిల్లు కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారన్నారు. తర్వాత ఆ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇక ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందాయి. వీటిలో నేటి వరకు 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 4న సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా వైయస్ఆర్‌ వాహన మిత్ర పథకంను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top