నేడు 14 మెడికల్‌ కాలేజీలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ శంకుస్థాపన

తాడేప‌ల్లి: రాష్ట్రంలో కొత్తగా 14 వైద్య కళాశాలలకు  సోమవారం సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్‌ విధానం ద్వారా 14 వైద్యకళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. పార్లమెంటుకు ఒకటి వంతున 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్యకళాశాలలకు శంకుస్థాపన పూర్తయింది. మిగతా 14 మెడికల్‌ కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేస్తారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఒకేసారి 4 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాతగానీ, అంతకు ముందుగానీ ప్రభుత్వ పరిధిలో ఎప్పుడూ ఇంత పెద్దస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఒకేసారి 14 వైద్యకళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోను ఒకేసారి ఇన్ని వైద్యకళాశాలలు ఏర్పాటు చేయలేదు. శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లాల పరిధిలో అక్కడి అధికారవర్గాలు పాల్గొంటాయి. 2023 నాటికి ఈ వైద్యకళాశాలలను పూర్తిచేయాలన్న లక్ష్యంతో సర్కారు కసరత్తు చేస్తోంది. నేడు శంకుస్థాపన చేయనున్న కాలేజీల్లో పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోని ఉన్నాయి. కొత్తగా నిర్మించే 16 వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Back to Top