మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

రెండో ఏడాది డబ్బులు మహిళల అకౌంట్లలో జమ 

45 నుంచి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750

వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి

ఈ పథకం ద్వారా రెండేళ్లలో రూ.8,943.52 కోట్ల సాయం

అర్హత ఉన్న వారు మరో నెల రోజుల పాటు దరఖాస్తుకు గడువు

మహిళల భద్రత కోసం రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం

దిశ, అభయం యాప్‌ ద్వారా మహిళలకు భద్రత

కృష్ణా తీరంలో జరిగిన ఘటన బాధాకరం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు

తాడేపల్లి: మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  ఇంట్లో అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో ఉంటే ఆ ఇళ్లు బాగుంటుందని నమ్ముతున్నాను. ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని అడుగులు వేశామని చెప్పారు.  ప్రతి అడుగులోనూ మహిళలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని వరుసగా రెండో ఏడాది అమలు చేస్తున్నానని చెప్పారు. దేశంలో ఎక్కడా ఎవరూ చేయని విధంగా ఏపీ దిశ బిల్లు చట్టాన్ని చేశామని చెప్పారు. 

తాడేపల్లిలోని  ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రెండో ఏడాది వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. బటన్‌ నొక్కి మహిళల ఖాతాల్లోకి చేయూత డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

ఈ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా దాదాపుగా 23.44 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపుగా రూ.4,400 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి, వారి బాగోగుల కోసం జమ చేసే కార్యక్రమం. దాదాపుగా కుటుంబ సభ్యులను కలుపుకుంటే కోటి జనాభాకు మంచి జరిగించే గొప్ప కార్యక్రమం దేవుడి దయతో మీ అందరికి మంచి జరిగించే అవకాశం ఈ పథకం ద్వారా వచ్చింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 45 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు అర్హతను బట్టి వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్ల పాటు రూ.75 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేసే గొప్ప కార్యక్రమం చేపట్టాం. ఈ ఏడాది రెండో ఏడాది వరుసగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

అక్క చెల్లెమ్మలు అంతా కూడా తమ కష్టాన్ని నమ్ముకుని, దైవాన్ని నమ్ముకుని 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారంతా కూడా కుటుంబాలకు రథసారధులుగా నడిపిస్తున్నారు. వీళ్ల చేతుల్లో డబ్బులు పెడితే..ఈ సొమ్ముతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా లబ్ధిపొందుతున్న వారు దాదాపు 6 లక్షలకు పైగా వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు సామాజికి పింఛన్ల ద్వారాలబ్ధి పొందుతున్నా సరే..అలాంటి వారికి ఎక్కువ సాయం అందించాలనే దృఢ నిర్ణయంతో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 

దాదాపుగా తొలి ఏడాది 23 లక్షల మంది మహిళలకు రూ.18,750 చొప్పున జమ చేశాం. రెండో ఏడాది మళ్లీ 23.44 లక్షల మందికి నేరుగా జమ చేస్తున్నాం. కేవలం ఈ రెండేళ్లలోనే అక్క చెల్లెమ్మలకు అందిస్తున్న పథకాలన్నీ కూడా పక్కన పెట్టి కేవలం వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా దాదాపుగా రూ.9 వేల కోట్లు అందిస్తున్నాం. ఈ సాయంతో మహిళలల్లో కొండంత ఆత్మ విశ్వాసం రావాలని అడుగులు ముందుకు వేస్తున్నాం.

మహిళల ఖాతాల్లో జమ చేస్తున్న ఈ డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలో వారి నిర్ణయానికే వదిలేస్తున్నాం. ఆ డబ్బులు దుర్వినియోగం కావని నమ్ముతున్నా. వాళ్ల చేతుల్లో పెట్టే ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలని చెప్పడం లేదు. వీళ్లలో ఎవరికైనా కూడా సహాయం కావాలన్నా..ఎలా వ్యాపారం చేసుకునేందుకు తోడ్పాటు కావాలంటే అలాంటి వారికి నాలుగేళ్లలో ఇచ్చే రూ.75 వేలు ఇస్తాం కాబట్టి..వారికి జీవనోపాధి చూపించే విధంగా అమూల్, రిలయన్స్, అలానా, హిందుస్థాన్‌ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వాళ్ల డీలర్లుగా ఈ అక్క చెల్లెమ్మలను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కోక్కరికి రూ.7 నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంది. 

బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారంటీగా ఉంటుంది. ప్రతి అక్క చెల్లెమ్మలకు వ్యాపార రంగంలో దారి చూపే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుందని గర్వంగా తమ్ముడిగా, అన్నగా తెలియజేస్తున్నాం. 
 
ఇప్పటికే 78 వేల మంది మహిళలు కిరాణా షాపులు పెట్టుకున్నారు. 1.19 లక్షల మంది మహిళలు ఆవులు, గేదేలు కొనుగోలు చేసుకున్నారు. వీరికి అమూల్‌ ద్వారా ప్రతి లీటర్‌కు రూ.5లకుపైగా అదనంగా ఆదాయం ఇప్పిస్తున్నాం. 70 వేల యూనిట్ల గొ్రరెలు, మేకల పెంపకం ద్వారా ఆదాయం పెంచగలిగాం. 

వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా బ్యాంకుల ద్వారా కనెక్ట్‌ చేసి అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అక్షరాల రూ.1510 కోట్ల ఆర్థికసాయం అక్కచెల్లెమ్మలకు ఇప్పించి వారికి మంచి జరిగేలా కార్యచరణ చేశాం.
లబ్ధిదారులను కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానం చేసేందుకు కాల్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ఈ సెంటర్‌కు ఒక నెంబర్‌ కేటాయించాం. 08662468899, 9392917899 నంబర్లు కేటాయించాం. ఎవరికైనా సలహా, సూచనలు కావాలంటే ఈ నంబర్లకు ఫోన్లు చేయవచ్చు. మహిళలకు అవసరమైన సాయం, శిక్షణ ఇప్పిస్తాం.

ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కష్టాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల చేతుల్లో డబ్బులు పెడితే మంచి జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఉన్న కష్టాల కంటే వీరికి ఉన్న కష్టం పెద్దదని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరిగే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న వారు వైయస్‌ఆర్‌ చేయూతకు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి ఫించన్‌ అందజేస్తాం. పింఛన్‌ కూడా మనం అధికారంలోకి వచ్చాక పెంచాం.  గ్రామ సచివాలయంలో వాలంటీర్‌ సాయంతో దరఖాస్తు చేసుకోండి. మరో నెల రోజుల గడువు పెంచుతున్నాం. ఎవరూ భయపడాల్సినఅవసరం లేదు. బాధపడాల్సిన పని లేదు. 45 నుంచి 60 ఏళ్ల ప్రతి అక్కకు తోడుగా ఉంటూ..వారికి మంచి జరగాలని అడుగులు ముందుకు వేస్తున్నాం.

మనం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన పనితీరును ఎవరైనా గమనిస్తే ..ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమవుతుంది. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. ఇంట్లో అక్క చెల్లెమ్మ చిరునవ్వుతో ఉంటే ఆ ఇళ్లు బాగుంటుందని నమ్ముతున్నాను. ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా తొలి సారిగా నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్ట్‌ల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే అని చట్టం చేసిన ప్రభుత్వం మనదే అని గర్వంగా చెప్పగలను. ఈ చట్టం ప్రకారం ఆలయాలు, కార్పొరేషన్లు, మార్కెట్‌ యార్డు పదవుల్లో అక్కచెల్లెమ్మలు ఉన్నారని గర్వంగా చెబుతున్నారు.
రాష్ట్ర కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా నా చెల్లెలు పుష్పాశ్రీవాణి ఉందని సగర్వంగా చెబుతున్నాను. రాష్ట్ర హోం మంత్రి మరో చెల్లెలు సుచరిత పని చేస్తోందని సగర్వంగా తెలియజేస్తున్నాను.

ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలని ఆరాటంతో పని చేస్తున్నాను. దిశా బిల్లును చట్టం చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించాం. ప్రతి జిల్లాకు అక్కచెల్లెమ్మలకే ఒక పోలీసు స్టేషన్‌ ఉండాలని రాష్ట్రంలో 18 దిశా పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. అభయ్‌ యాప్, దిశా యాప్‌లు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సెల్‌ఫోన్‌లో బటన్‌ నొక్కితే చాలు వెంటనే పోలీసులు మీకు తోడుగా ఉంటారు. ఈ యాప్‌లను ఇంకా మెరుగు పరిచి ప్రజలకు చేరువ చేస్తాం. ప్రత్యేకంగా 900 మొబైల్‌ టీమ్‌లు ఏర్పాటు చేశాం, వీరందరిని పెట్రోలింగ్‌ వ్యవ్యస్థలోకి తీసుకువచ్చాం. మార్కెట్లు, కాలేజీల వద్ద పెట్రోలింగ్‌ ప్రాంతాల్లో ముమ్మరంగా జరుగుతోంది. ప్రతి సచివాలయంలో ఏకంగా ఒక మహిళా పోలీసును ఏర్పాటు చేశాం.

 మంచి జరగాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. అయినా కూడా కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి వేళ జరిగిన ఓ ఘటన మనసును కలిచి వేసింది. ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు. ఆడవాళ్లు అర్ధరాత్రి పూట ఇబ్బంది లేకుండా తిరగలినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వస్తుందని గట్టిన నమ్మిన వ్యక్తిగా ..ఇలాంటివి పునరావృతం కాకుండా ఇంకా ఎక్కువగా కష్టపడుతానని మీ అన్నగా, మీ తమ్ముడిగా చెబుతున్నాను.

 వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా మహిళలకు ఎంతో మంచి జరగాలని కోరుకుంటూ..దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  శ్రీకారం చుట్టారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top