ఏడాదిలో రెండుసార్లు ‘జగనన్న తోడు’

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జగనన్న తోడు కార్యక్రమం ద్వారా వడ్డీ సొమ్ము జమ

వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి

రుణం చెల్లిస్తే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం

సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశా

చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, చేతివృత్తుల కళాకారులకు లబ్ధి

సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.16.36 కోట్ల వడ్డీ జమ

కొత్త రుణాలతో పాటు కట్టిన వడ్డీని వాపసు ఇస్తాం

ఈ పథకంలో వందశాతం రికవరీ ఉండాలి

సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది

విపక్షం, ఎల్లోమీడియా జీర్ణించుకోలేక పోతున్నాయి 

తాడేపల్లి: చిరువ్యాపారులకు మేలు చేసేందుకు ఏడాదికి రెండుసార్లు జగనన్న తోడు కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశానని, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేలు వడ్డీ లేని రుణం అందిస్తున్నామని తెలిపారు.  ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశామన్నారు. సంక్షేమపాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఎఆ తయారయిందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా వడ్డీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్లను బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌గా కలెక్టర్లు, లబ్ధిదారులతో మాట్లాడారు. 

 ఈ రోజు దేవుడి దయతో ఇంకో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి అవకాశం వచ్చింది. చిన్న, చిన్న వ్యాపారాల ద్వారా తమకు ఉపాధి కల్పించుకోవడమే కాక, ఇంకా ఒకరికో ఇద్దరికో కూడా ఉపాధి కల్పించే దిశగా వీళ్లంతా చేస్తున్న కార్యక్రమానికి ప్రభుత్వం తరపున వడ్డీ భారం పడకుండా వాళ్లు,  వాళ్ల కాళ్లమీద నిలబడే పరిస్ధితి ఇంకా మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుడుతున్నాం. 

గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు... 
తోపుడు బండ్ల మీద పండ్లు, సామానులు అమ్ముకునేవారు నగరాలలో పుట్‌పాత్‌ల మీద ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్ముకునేవారు, రోడ్డు పక్కనే చిన్న ప్రదేశంలో చిన్న బంక్‌ పెట్టుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చిన్న మోపెడ్‌ మీద వాళ్లంతట వాళ్లే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి వీధుల్లో సామానులు అమ్ముకునేవాళ్లు,ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు మన గ్రామ, గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, టౌన్లలో కనిపిస్తుంచారు. ఇలాంటి వాళ్లకు ఏ రోజు కూడా బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ల అవసరాలు తీర్చేందుకు సహాయ, సహకారాలు అందని పరిస్ధితి. ఎందుకంటే వీళ్లకు సెక్యూరిటీ ఇచ్చే స్తోమత ఉండదు. ఏ ప్రభుత్వమూ వీళ్లను పట్టించుకోని పరిస్థితులో, బ్యాంకులు సెక్యూరిటీలు లేక లోన్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో వీల్ల జీవితాలు తల్లడిల్లిపోతున్నాయి. వీళ్లకు ఎటువంటి గత్యంతరం లేక   వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి రోజుకు రూ.1000 వర్కింగ్‌ కేపిటల్‌ కింద అప్పుతీసుకుంటే సాయంత్రానికి రూ.100 కడుతూ... విచిత్రమైన పదిరూపాయలు వడ్డీ కడితే తప్ప ఆ పెట్టుబడి సొమ్ము రాని పరిస్థితులో వ్యాపారాలు చేసుకోవాల్సిన అన్యాయమైన దుస్ధితిలో వీళ్లంతా ఉన్నారు. ఇలాంటి పరిస్ధితులను నా కళ్లెదుటనే, నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను.

వీళ్ల పరిస్థితి మారాలి, అండగా నిలబడాలనే...
 వీళ్ల పరిస్థితి మార్చాలి, వీళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో మన ప్రభుత్వం దేవుడి దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత  బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. బ్యాంకర్లందరినీ మీరు సహాయం చేస్తే ప్రభుత్వం తోడుగా ఉంటుంది,  వడ్డీ కూడా ప్రభుత్వం కడుతుంది, వడ్డీ లేకుండా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా రూ.10వేలు రుణాలివ్వగలిగితే వాళ్లకు ఎంతో మంచి జరుగుతుందని బ్యాంకర్లను ఒప్పించి ఈ పథకాన్ని  గతేడాది ప్రారంభించాం. 

దాదాపు 9 లక్షల మందికి రూ.905 కోట్ల రుణాలు
దాదాపుగా 9,05,458 మందికి రూ.10వేలు చొప్పున రూ.905 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. వాళ్లు వడ్డీలు కడితే ప్రభుత్వం ఆ వడ్డీని సంవత్సరంలో ఒకరోజు మరలా వారికి రీయింబర్స్‌ చేస్తుంది. 
వడ్డీ లేకుండా ఆ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిరువ్యాపారులందిరికీ మంచి జరిగే పరిస్ధితి ఏర్పడుతుంది.

ఈ జగనన్న తోడు పథకాన్ని ప్రారంభిస్తూ... గత ఏడాది నవంబరు 25 నుంచి 5 లక్షల 35వేల మందికి మొదటి విడతలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ యేడాది జూన్‌ 8 నుంచి మరలా రెండో విడతగా మరో 3 లక్షల 70 వేల మందికి రుణాల పంపిణీ చేశాం. దాదాపుగా 9,05,458 మందికి అక్షారాలా  రూ.905 కోట్లు పంపిణీ చేశాం. 

2020 నవంబరు నుంచి రుణాలు తీసుకుని, 30 సెప్టెంబరు 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు రూ.16 కోట్ల 36 లక్షల వడ్డీని ఈ కార్యక్రమంలో నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అలాగే జూన్‌ 2021లో  రెండో దఫా కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులందరికీ కూడా వారి రుణకాల పరిమితి ముగియగానే, వాళ్లకు సంబంధించిన వడ్డీని కూడా తిరిగి చెల్లించడం జరుగుతుంది. 

కొన్ని విషయాలు చెప్పాలి..
ఈ సందర్భంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 
సంవత్సరంలో రెండు దఫాలుగా ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇది చాలా ప్రాధాన్యతాంశం. రుణాలు చెల్లించినవారికి కొత్త రుణాలిచ్చే కార్యక్రమం, అదే రోజు వడ్డీ సొమ్ము కూడా లబ్ధిదారునికిచ్చే కార్యక్రమం కలిపి చేస్తాం. సంవత్సరానికి రెండు సార్లు చేస్తాం. ఒకసారి డిసెంబరులోనూ మరోసారి జూన్‌ నెలలోనూ చేస్తాం. రుణం తీసుకున్న వారి సంవత్సరం కాలం డిసెంబరు నాటికి పూర్తయితే, ఆ లోన్‌ క్లోజ్‌ చేయడం, వారి వడ్డీ డబ్బులు వెనక్కివ్వడం జరుగుతుంది. మరలా లోన్‌ను కొత్తగా మంజూరు చేస్తారు. అదే విధంగా జూన్‌లో కూడా అప్పటికి సంవత్సరం పూర్తయిన వారికి మరలా రెన్యువల్‌ చేస్తారు. సంవత్సరానికి రెండు దఫాలుగా సంవత్సరం పూర్తయిన వారికి రుణం రూ.10వేలు పునరుద్దరించడం, సంవత్సర కాలానికి సంబంధించిన వడ్డీ డబ్బులు తిరిగి లబ్ధిదారునికిచ్చే కార్యక్రమాలు జరుగుతాయి.

రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా చెల్లించండి.. 
దీనికి సంబంధించి ఎవరైనా రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా కట్టండి... మరలా డిసెంబరులోనూ, జూన్‌లోనూ రుణాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. 
ఒకసారి రుణం తీర్చిన తర్వాత లబ్దిదారుల కోరిక మేరకు బ్యాంకుల నుంచి మరలా వడ్డీ లేని రుణాలు పొందవచ్చు. వడ్డీల విషయంలో కానీ, రుణాలు పొందే విషయంలో ఎవరికైనా సందేహాలుంటే  0891 2890525 నంబరుకు ఫోన్‌ చేస్తే వారికున్న అన్ని సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే.. డిసెంబరులో ఈ కార్యక్రమం ఎలాగూ జరుగుతుంది... అటువంటిది రెండు నెలలు ముందే అక్టోబరులో ఈ కార్యక్రమం ఎందుకు జరపాల్సి వస్తుందన్నదానికి ఒక వివరణ కూడా ఉంది. 

నలుగురికి మంచి చేసే కార్యక్రమం– అవగాహన కల్పించాలి... 
నేను బ్యాంకర్లతో మాట్లాడినప్పుడు తాజాగా వారి నుంచి అందుతున్న డేటా చూస్తే.. దాదాపు 5 శాతం ఎన్‌పీఏలు, 11 శాతం ఓవర్‌ డ్యూస్‌గా ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై అందరికీ పూర్తి అవగాహన కలగాలి.  ఇది నలుగురికి మంచి చేసే కార్యక్రమం. దీనిలో 100 శాతం రికవరీ ఉండాలి. అప్పుడే బ్యాంకర్లకు మనమీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడే బ్యాంకర్లు మరో నలుగురికి రుణాలివ్వడానికి ముందుకు వస్తారు. 

కాబట్టి గ్రామ సచివాలయం, వాలంటీర్లు, కలెక్టర్లు అందరూ దీనిలో భాగస్వామ్యం అయి అందరికీ చెప్పాలి. ఇక్కడ గడువులోపల కట్టడమంటే ఏమనిటన్నది చెప్పాలి. ప్రతి నెలా ఈఎంఐ కట్టాలి. ఒకవేళ కట్టకపోతే గడువు దాటినట్లే, అంటే ఓవర్‌ డ్యూ అయినట్లే లెక్క. అలా 90 రోజుల కట్టకపోతే ఎన్‌పీఏ (నాన్‌ ఫెర్ఫార్మింగ్‌ అసెట్‌) కింద మారుస్తారు. 

ప్రతి లబ్ధిదారుడుకీ ఈ విషయాలన్నీ కూడా కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ అకౌంట్‌ కూడా ఏ లబ్ధిదారుడు తనకు తెలియని కారణంగా కట్టకపోతే అది ఎన్‌పీఏ అయిందంటే తర్వాత ప్రభుత్వం తరపున నుంచి సున్నా వడ్డీ రాకుండా పోయే పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాలి. కాబట్టే ఈరోజు ఈ మీటింగ్‌ ద్వారా ఆ విషయాన్ని చెపుతున్నాం. 
ఇప్పటివరకు జరిగిన దాన్ని పక్కనబెట్టండి. నేను కూడా బ్యాంకర్లు అందరికీ చెప్తున్నాను. ఎవరెవరైతే ఓవర్‌ డ్యూ ఉన్నారో... ఎవరెవరైతే కట్టకుండా ఎన్‌పీఏలగా అయిన పరిస్థితుల్లో...  90 రోజుల దాటి కట్టకుండా ఉన్నారో వాళ్లందరినీ రిక్వెస్ట్‌ చేస్తున్నాను. కచ్చితంగా డిసెంబరులోగా రుణాలు చెల్లించండి. అటోమేటిక్‌గా మీరు కట్టిన వడ్డీ ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. మరలా మీకు రూ.10వేలు బ్యాంకు రుణం ఇస్తుంది.  మీరు మీ వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి ఈవిషయాలన్నీ మీకు చెప్పాలన్నదే మా తపన, తాపత్రయం, అలా చెప్పకపోతే ఇది తెలియక ఇంకా మీరు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతారన్న భయంతో, అలాంటి పరిస్థితి రాకూడన్న ఆత్రుతతో ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాం.

డిసెంబరులో మరలా ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత జూన్‌లో జరుగుతుంది. టైం ప్రకారం ఎవరెవరు కడతారో వాళ్లందరికీ కూడా వడ్డీలు వెనక్కి తిరిగివ్వడం జరుగుతుంది.  గతంలో  జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు కట్టండి. 

సకాలంలో చెల్లిస్తేనే తిరిగి రుణాలు... 
 సకాలంలో కట్టిన వారికి మాత్రమే తిరిగి రుణాలు వస్తాయి. డిసెంబరు నాటికి రుణాలన్నీ 100 శాతం కట్టించే పరిస్థితుల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా మంచి పథకం.

ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది చిన్న, చిన్న వ్యాపారులకు మంచి జరుగుతుంది.  ఎవరైనా కొంతమంది కట్టకపోవడం వల్ల బ్యాంకుల్లో నమ్మకం పోయి.. ఈపథకానికి మరింతగా  సపోర్టు చేసే పరిస్థితి, అవకాశం రాకుండా ఉండకూడదు. బ్యాంకర్ల నుంచి మనం మరింత సాయం తీసుకుని ఇంకా ఎక్కువ మందికి విస్తరింపజేసే పరిస్థితి రావాలన్నదే మన తపన, తాపత్రయం. 

చివరగా... రెండు మాటలు చెప్పాలి.. 
మీరు ఇచ్చిన ఈ అధికారంతో ఈరోజు ఇప్పటికే సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధ తీసుకొచ్చి గ్రామ స్ధాయి నుంచి కూడా ఎక్కడా కూడా వివక్ష లేకుండా, అవినీతి లేకుండా, బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకి వెళ్లేటట్టుగా (డీబీడీ ద్వారా)
కులం, మతం,ప్రాంతం, వర్గం చివరకు పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేసారన్న మాట కూడా అడగకుండా... అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికీ  మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోంది.

ఎస్సీలు,ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ, అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వం నడిపిస్తుంది. 

ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే...
అంతా నావాళ్లే, అన్ని ప్రాంతాలు నావే, ప్రతి ఒక్కరూ నా కుటుంబసభ్యులే అన్న భావనతోనే దాదాపుగా ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా సాగుతూ వచ్చింది. 
దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో సాగిన పరిపాలన మీ అందరికీ నచ్చింది కాబట్టే పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికలు, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్ధానమే లేకుండా ప్రతి అక్కా, చెల్లెమ్మా, ప్రతి సోదరుడు, స్నేహితుడు కూడా నన్ను సొంత బిడ్డగా, అన్నగా భావించి అన్ని రకాలగా తోడుగా నిలబడుతున్నారు.

ప్రతిపక్షం జీర్ణించుకోలేక పోతుంది...  
కానీ మీరు ఇంత ప్రేమ,ఆప్యాయతులు చూపుతున్నారు కాబట్టే  జీర్ణించుకోలేని పరిస్థితుల్లో  ప్రతిపక్షం తయారైంది. ప్రతిపక్షంతో పాటు ఒక సెక్షన్‌ ఆఫ్‌ ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి,  టీవీ 5 జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఏ రకంగా తయారయ్యారో మీరే చూస్తున్నారు. వీళ్లే బూతులు తిడతారు. ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు మాట్లాడతారు. 

నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను. కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు ఎవరూ కూడా మాట్లాడి ఉండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్లే తిడతారు. 
ఆ బూతులు తిట్టారని దానిమీద ఎవరో మనల్ని అభిమానించేవాళ్లు, మనల్ని ప్రేమించే వాళ్లు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక, అభిమానించే వాళ్లు, ఆప్యాయత చూపేవాళ్ల రియాక్షన్‌ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. 
ఆ రకంగా వైషమ్యాలను క్రియట్‌ చేసి, కావాలని తిట్టించి వైషమ్యాలను క్రియేట్‌ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం మన కర్మ కొద్దీ ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. 

విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం... 
అబద్దాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు. వంచన కనిపిస్తుంది.  ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్దాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొచ్చడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు. కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలు చేస్తారు.  వ్యవస్ధలను పూర్తిగా మేనేజ్‌ చేయబడుతున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఏ పేదవాడికి మంచి జరుగుతున్నా ఆ మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని చెప్పి ఏకంగా ఆ మనిషిని ఆపడం కోసమని చెప్పి రక,రకాల కోర్టు కేసులు వీళ్లే వేయిస్తారు.
రక,రకాల వక్రీకరణ రాతలు వీళ్లే పేపర్లలో, టీవీలలో రాస్తారు, చూపిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా మనస్ఫూర్తిగా, సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను. 

ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయను. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

అనంతరం సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ 2020 నవంబరు నుంచి 30 సెప్టెంబరు 2021 వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు. 

ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కె సునీత, ఆప్కాబ్‌ ఛైర్‌ పర్సన్‌ ఝాన్సీరాణి, సెర్ఫ్‌ సీఈఓ ఎ ఎండి ఇంతియాజ్, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌ షన్‌ మోహన్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బీ వీ బ్రహ్మానందరెడ్డి, స్త్రీ నిధి ఎండీ కె వి నాంచారయ్య, పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

 ఈ సందర్భంగా మాట్లాడిన లబ్దిదారులు ఏమన్నారంటే...

ఏలూరు పట్టణంలోని 36 డివిజన్ ఆర్ ఆర్ పేట కు చెందిన కె. నాగజ్యోతి తన స్పందన 

అన్నా...మీరు ప్రవేశపెట్టిన ప్రతీపథకాన్ని కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందుతున్నారని పి.నాగ జ్యోతి ముఖ్యమంత్రికి తెలిపారు.
తాను సాయినాథ్ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని ప్రభుత్వం నుండి  జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నానన్నారు. కరోనా విపత్తులో లాక్ డౌన్ మూలంగా తన వ్యాపారం సరిగా జరగకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. వార్డు వాలంటీర్ ద్వారా జగనన్న తోడు పథకాన్ని గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నానని, వెంటనే  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 10వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పొందాను అన్నారు. తనకు ఇద్దరు పిల్లలని అమ్మఒడి ద్వారా రెండు సంవత్సరాలుగా 15వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పొంది ఆ డబ్బుతో పిల్లలను బాగా చదివించుకొంటున్నానన్నారు.తన తల్లి,అత్తకు ప్రతినెలా ఒకటో తేదీనే వాలంటీర్ ఉదయాన్నే తలుపు తట్టి పింఛన్ అందిస్తున్నారని, ఇప్పుడు వారు ఎవరిపై ఆధారపడకుండా వారికి నీవు తమ్ముడుగా తన తమ్ముడు ప్రతి నెల 2,250  పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడని ఆనందంగా చెబుతున్నారన్నారు. వైయస్సార్ ఆసరా పథకంలో 15 వేల రూపాయల వరకు రెండుదఫాలుగా రుణమాఫీ జరిగిందన్నారు. పండుగలన్నీ కుటుంబంతో సంతోషంగా జరుపుకుంటున్నానని, ప్రతి నెల రేషన్ తన ఇంటివద్దే తీసుకుంటున్నామన్నారు. గతంలో క్యూలైన్లో నిలబడి రేషన్ కోసం పనులు మానుకొని అనేక ఇబ్బందులు పడేవారమని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నామని,  కుటుంబంలో అందరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొంటున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా దర్జాగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్య సేవలు పొందుతున్నామని అన్నారు. మీరు ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళలకు ఎంతో భద్రత, రక్షణగా ఉందన్నారు. అన్న పక్కనున్నాడనే  ధైర్యం తమలో కలిగిందని అన్నారు.తన అన్నఆటో నడుపుకుంటాడని, లాక్ డౌన్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాడని, నేడు వాహన మిత్ర ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నాడన్నారు. 
సచివాలయ వ్యవస్థ ఎంతో అద్భుతమని గతంలో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పనుల కోసం తిరిగి  కాలం వృథా అయ్యేదని, నేడు తన ఇంటి సమీపంలోనే సచివాలయం రావడంతో  ఇబ్బందులు తీరాయన్నారు.
ప్రతీకుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ప్రతీ పథకాన్ని అందుకుంటున్నారన్నారు.
అన్నలా, తమ్ముడిలా, తండ్రిగా, మావయ్యలా అందరి కష్టాలు తీరుస్తున్న మీరే మాకు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని, చల్లగా ఉండాలని అంటూ  నాగ జ్యోతి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌కు తన స్పందనను తెలియజేశారు.

పిలకా పద్మ, లబ్దిదారు, సీహెచ్‌ రాజాం, రణస్ధలం మండలం, శ్రీకాకుళం జిల్లా

వీధుల్లో తిరుగుతూ చేసే వ్యాపారం నుండి కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగానని, రోజుకు నాలుగు ఐదు వందల రూపాయలు ఆదాయం లభిస్తుందని, నెలకు పది నుండి పదిహేను వేల రూపాయలు ఆదాయం కుటుంబానికి వస్తుందని చెప్పారు. తన పిల్లలు ఇద్దరు ఆరవ తరగతి, ఏడవ తరగతి చదువుతున్నారని వారికి గత రెండు సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకం కింద 30 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయిందని అన్నారు. ముప్పై వేల రూపాయలను పిల్లల చదువులకు వినియోగిస్తున్నామని వారి విద్యాభ్యుదయానికి సహకరిస్తుందని పద్మ వివరించారు. తన భర్తకు రైతు భరోసా క్రింద రూ.13500 వస్తుందని చెప్పారు. చిరు వ్యాపారం చేసుకోవడమే కాకుండా శ్రీ కనకదుర్గ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని, సంఘంగా రూ.7.50 లక్షలు రుణం తీసుకున్నామని అందులో ఆసరా క్రింద రూ.6 లక్షల రుణం మాఫీ జరిగిందని పద్మ చెప్పారు. మొదటి ఏడాది ఒక్కో సభ్యునికి రూ.12,500, రెండో ఏడాది ఒక్కో సభ్యునికి రూ.12,500 అందాయని వివరించారు. ఈ ఏడాది వచ్చిన సొమ్ముతో ఆవును కొనుగోలు చేశామని, ప్రతిరోజు లీటర్ నుండి రెండు లీటర్ల పాలు ఇస్తుందని దాన్ని విక్రయించడం ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండ లభించిందని అన్నారు. తమ కుటుంబానికి జగనన్న పథకాల ద్వారా ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిందిదని పద్మ చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రిగా చిరకాలం కొనసాగి పేదలకు అండగా నిలవాలని పద్మ ఆకాంక్షించారు.

మాధవి, లబ్దిదారు, వెంకటాచలం, నెల్లూరు జిల్లా

మా జగనన్నకు నమస్కారాలు.. అన్నా మీరు అందించే పథకాలు అన్ని లబ్ధి పొందుతున్నాను. నేను వెంకటాచలం గ్రామంలో చీరల వ్యాపారం చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని వడ్డీలకే కట్టేదాన్ని. తమరు ప్రారంభించిన జగనన్న తోడు పథకం ద్వారా మా వాలంటీరు నాకు పదివేల రూపాయలు వస్తుందని చెప్పాడు. దీంతో ఆ పథకం ద్వారా నేను పదివేల రూపాయలు రుణంగా పొందాను. ఈ డబ్బులతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అధిక వడ్డీ లను చెల్లించే బాధ తప్పింది. దీంతో రోజుకు 500 రూపాయల వరకు ఆదాయం పొందుతూ ప్రతి నెల సుమారు 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాను. తీసుకున్న రుణాన్ని కూడా క్రమం తప్పకుండా బ్యాంకుకు చెల్లిస్తున్నాను. అలాగే ఇటీవలే నాకు వైయస్సార్ ఆసరా పథకం కింద పొదుపు ఖాతా కు పదివేల రూపాయలు ఇచ్చారు. పావలా వడ్డీకి ఐదు వేల రూపాయలు రుణంగా కూడా తీసుకున్నాను. మా పాపకు అమ్మ ఒడి నగదు గత రెండేళ్లుగా ఒకసారి 15000, రెండోసారి 14 వేల రూపాయలు వచ్చింది. మా పాప పుట్టినరోజు జనవరి తొమ్మిదో తారీఖు నాడు నాకు అమ్మ ఒడి డబ్బులు పడడంతో మా పాపకు కొత్త బట్టలు తీసి కేక్ కట్ చేసి పుట్టినరోజు చేసాము. అలాగే నాడు నేడు పథకం కింద పాఠశాలలను బాగా మార్చారు. టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయి. మంచి ఆహారం అందిస్తున్నారు. ఒకప్పుడు పాఠశాలకు మా పాప వెళ్లనని మారాం చేసేది ఇప్పుడు సంతోషంగా వెళుతుంది. నేను ఈరోజు తమరితో మాట్లాడుతున్నానని తెలిసి  మా జగన్ మేనమామకు శుభాకాంక్షలు చెప్పమని మా పాప చాలా సంతోషంగా చెప్పింది. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా తమరు అందించే ప్రతి పథకాన్ని నేను పొందుతున్నాను. మాకు ఎల్లప్పుడూ మీరే సీఎంగా ఉండాలన్నా...

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top